Interview Etiquette: టైమ్ కంటే ముందుగా ఇంటర్వ్యూకు వచ్చినందుకు దక్కని జాబ్.. కారణం తెలిస్తే..
ABN , Publish Date - Apr 13 , 2025 | 09:58 PM
టైమ్ కంటే ముందుగానే వచ్చినందుకు ఓ అభ్యర్థికి జాబ్ దక్కలేదు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందీ చెబుతూ సంస్థ యజమాని పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: నిర్లక్ష్యం, ఆలస్యం.. ఎంతటి ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిస్తే సంస్థలు అస్సలు సహించవు. క్షణాల్లో ఉద్యోగాల నుంచి తొలగిస్తాయి. ఇంటర్వ్యూ దశలో అభ్యర్థుల తీరు తెన్నులను వెయ్యి కళ్లతో గమనిస్తాయి. ఏమాత్రం తేడా ఉన్నా ఇంటికి పంపిచేస్తాయి. అయితే, ఓ అభ్యర్థి అతి జాగ్రత్త అతడి కొంప ముంచింది. ఇంటర్వ్యూకు 25 నిమిషాల ముందుగా వచ్చినందుకు సంస్థ యజమాని అతడిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. తానీ నిర్ణయం ఎందుకు తీసుకుందీ చెబుతూ ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Job Interview Punctuality).
మాథ్యూ ప్రివెంట్ అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టారు. ఉద్యోగం కోసం వచ్చి ఓ అభ్యర్థి ఇంటర్వ్యూ టైం కంటే చాలా ముందుగా వచ్చినట్టు తెలిపారు. ఇంత ముందుగా రావడమంటే అతడికి సమయపాలన లేదని, సామాజిక స్పృహ కొరవడినట్టేనని అన్నారు. ఇంటర్వ్యూకు 5 నుంచి 15 నిమిషాలు వస్తే అతడిపై సదభిప్రాయం వచ్చి ఉండేదని అన్నారు. ఈ ఒక్క కారణంతోనే అతడిని ఉద్యోగం లోకి తీసుకోలేదని తెలిపారు. ‘‘టైమ్ కంటే ముందుగా రావడం మంచిదే. కానీ మరీ ముందుగా వస్తే సమయపాలనలో ఏదో లోపం ఉన్నట్టే. అతడు దూర ప్రాంతం నుంచేమీ ఈ ఇంటర్వ్యూకు రాలేదు. దీంతో, అతడిని తీసుకోదలుచుకోలేదు’’ అని చెప్పాడు. అంతేకాకుండా, అంతముందుగా వచ్చి అతడు తన న్ కాల్స్ విన్నాడని ఇది కూడా కాస్త ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చారు.
ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు సంస్థ యజమాని తీరుపై మండిపడ్డారు. ఇలాంటి వింత విశ్లేషణ తాము ఎక్కడా చూడలేదని అన్నారు. అతడి అడ్రస్ తమకు పంపిస్తే తాము ఉద్యోగంలోకి తీసుకుంటామని కొందరు అన్నారు. ‘‘అతడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో వచ్చి ఉండొచ్చు కదా. దీంతో, అనుకున్న దానికంటే చాలా ముందే వచ్చి ఉండొచ్చు కదా ఇవన్నీ ఆలోచించారా తమరు’’ అని అన్నారు. తామైతే ఇలాంటి తొందరపాటు అభిప్రాయాలు ఏర్పరుచుకోకుండా ముందుగా అతడితో ఓసారి మాట్లాడి ఉండేవారని కూడా కొందరు చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో నడుస్తోంది.
ఇవి కూడా చదవండి:
యువతి వింత హాబీ.. చచ్చిన దోమల్ని పేపర్‌పై అతికించి
మహిళకు షాక్.. ఆఫీసు టైమ్ కంటే నిమిషం ముందుగా ఇంటికెళ్లినందుకు..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..