వారికి ‘టైమ్’తో పనిలేదు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:58 AM
సమయానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ప్రపంచంలో ఎవరైనా, ఏ వృత్తిలో ఉన్నా, చివరికి ఖాళీగా ఉన్నా సరే... అందరూ టైమ్‌ను కచ్చితంగా ఫాలో అవుతుంటారు.

ప్రపంచంలో అన్నీ టైమ్ ప్రకారం నడుస్తుంటాయి. సమయానికి లేవడం, ఆఫీసుకు వెళ్లడం, పనులు పూరి ్తచేయడం, నిద్రపోవడం... ఇలా అన్నీ టైమ్‌కు లోబడి పూర్తి చేస్తుంటాం. అలాంటిది టైమ్‌తో సంబంధం లేకుండా గడిపితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అదెలా సాధ్యం అంటారా? నార్వేలోని ‘సొమ్మారోయ్’ దీవిలో నివసించే ప్రజలు చేసి చూపించారు. అందుకే ఈ దీవి ప్రపంచంలోనే మొట్టమొదటి ‘టైమ్ ఫ్రీ జోన్’గా గుర్తింపు పొందింది.
సమయానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ప్రపంచంలో ఎవరైనా, ఏ వృత్తిలో ఉన్నా, చివరికి ఖాళీగా ఉన్నా సరే... అందరూ టైమ్‌ను కచ్చితంగా ఫాలో అవుతుంటారు. సమయానికి రైళ్లు బయలుదేరడం, విమానాలు టేకాఫ్ తీసుకోవడం, బడి గంటలు మోగడం, ఆఫీసులు తెరుచుకోవడం... ఇలా ఒక్కటేమిటి, అన్ని పనులు టైమ్‌తో లింక్ అయి ఉంటాయి. అలా ఉంది కాబట్టే కాలచక్రం సాఫీగా సాగిపోతోంది. అలాంటిది టైమ్ చూడకుండా... ఒక్క పనికూడా సమయానికి చేయకపోతే ఏమవుతుందో ఆలోచించండి.
ప్రపంచం మొత్తం అస్తవ్యస్థం అవుతుందని అనుకుంటున్నారా? అలా ఏమీ కాదని అంటున్నారు నార్వేలోని సొమ్మారోయ్ గ్రామ ప్రజలు. సమయంతో సంబంధం లేకుండా జీవించి చూపిస్తున్నారు వాళ్లు. బీచ్‌లో కూర్చుని ఉదయం 2 గంటలకు కాఫీ తాగాలనిపిస్తే తాగుతారు. ఉదయం నాలుగు గంటలకు లాన్ కట్ చేయాలంటే చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈత కొట్టాలనిపిస్తే కొడతారు. రాత్రి 12 గంటలకు ఇంటికి రంగులు వేయాలనుకుంటే వేస్తారు. టైమ్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా... ఏ పని చేయాలనిపిస్తే అది చేస్తారు. సొమ్మారోయ్‌లో దాదాపు 350 మంది నివసిస్తున్నారు. నిజానికి ఈ దీవి ఒక అద్భుత దృశ్యం. దాని అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అంతగా ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది.
కారణం ఏమిటంటే ...
ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి ప్రతి పని టైమ్‌తో నియంత్రించబడి ఉంటుంది. ప్రతి పని టైమ్‌తో లింక్ అయి ఉంటుంది. ‘దానివల్లే చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నార’ని అంటున్నారు పరిశోధకులు. అందుకే సొమ్మారోయ్ ప్రజలు సమయంతో సంబంధం లేకుండా జీవించాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే అని తెలుసు కదా! సొమ్మారోయ్‌లో నవంబర్ నుంచి జనవరి వరకు చీకటిగా ఉంటుంది.
ఈ మాసాల్లో సూర్యోదయాలు ఉండవు..
మే 18న సూర్యుడు ఉదయిస్తే జూలై 26 వరకు మళ్లీ అస్తమించడు. అందుకే మాకు టైమ్‌తో సంబంధం లేదని అంటారు సొమ్మారోయ్ ప్రజలు. ‘‘ఈ భూమిపై ప్రతి ఒక్కరూ ఒత్తిడి, ఆందోళనతో బతుకుతున్నారు. టైమ్ ట్రాప్‌లో పడి జీవిస్తున్నారు. కానీ మేం అలా కాదు. సమయంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఉంటున్నాం. 24/7 ఫ్లెక్సిబుల్‌గా ఉండటమే మా లక్ష్యం’’ అని అంటారు టైమ్ క్యాంపెయిన్‌కు నాయకత్వం వహిస్తున్న కెజెల్ ఓవ్. టైమ్‌తో సంబంధం లేకుండా ఫ్రీగా జీవించడానికి స్థానికులు 2019లో ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా 1650 ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి. సుమారు 100 కోట్ల మందికి ఈ క్యాంపెయిన్ చేరువయింది. ఇందుకోసం సుమారు 99 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
‘‘ఇక్కడ అర్ధరాత్రి సూర్యుడు ఉన్నప్పుడు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తాము. రాత్రి 2 గంటలకు స్నేహితులతో కలిసి బీచ్‌లో కాఫీ తాగడం మాకు సాధారణ విషయం. అందరూ ఈ పని చేయలేరు’’ అని అంటారు స్థానికులు. ఇక్కడి ప్రజలు చేపలు పట్టడం, పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం గడుపు తుంటారు. అయితే ‘ఇదంతా పర్యాటకులను ఆకర్షించడం కోసం సొమ్మారోయ్ ప్రజలు చేస్తున్న మార్కెటింగ్ క్యాంపెయిన్’ అనేవాళ్లు కూడా ఉన్నారు. ఏదైతేనేం... ప్రపంచ వ్యాప్తంగా సొమ్మారోయ్ టైమ్ ఫ్రీజోన్ ప్రదేశంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.