Virat Kohli-KL Rahul: అందరూ కోహ్లీ-రాహుల్‌నే పొగుడుతున్నారు.. రియల్ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:38 PM
Champions Trophy 2025: ఆసీస్‌పై భారత్ విక్టరీతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. నాకౌట్ ఫైట్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీని మెచ్చుకుంటున్నారు. అయితే అసలోడ్నే మర్చిపోతున్నారు.

టీమిండియా బ్రేకుల్లేని బుల్డోజర్ మాదిరిగా దూసుకెళ్తోంది. అడ్డొచ్చిన ప్రత్యర్థిని రప్పా రప్పా అంటూ చిత్తు చేస్తూ పరుగులు పెడుతోంది. చాంపియన్స్ ట్రోఫీ కప్పు గెలవడమే లక్ష్యంగా ప్రయాణం సాగిస్తోంది రోహిత్ సేన. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. ఆఖరి పోరులోనూ నెగ్గి మరో ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు స్టన్నింగ్ విక్టరీతో పైనల్స్‌కు చేరిన టీమిండియాను అభిమానులు ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా బ్యూటిఫుల్ నాక్స్ ఆడిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే గెలుపులో కీలక పాత్ర పోషించిన ఓ యోధుడ్ని మాత్రం మర్చిపోతున్నారు.
కష్టకాలంలో ఆదుకుంటే..
నిన్నటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లీ (84), రాహుల్ (42 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (45) రాణించారు. మధ్యలో అక్షర్ పటేల్ (27), ఆఖర్లో హార్దిక్ పాండ్యా (28) కూడా మంచి నాక్స్‌తో ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో మహ్మద్ షమి (3/48), వరుణ్ చక్రవర్తి (2/49), రవీంద్ర జడేజా (2/40) మెరిశారు. ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించడం, సారథి రోహిత్ శర్మ అటు బ్యాటింగ్‌లో ఇటు కెప్టెన్సీలోనూ తన రెస్పాన్సిబిలిటీ సరిగ్గా నిర్వర్తించడంతో ఈ విజయం సాధ్యమైంది. అయితే గెలుపులో ఎక్కువ క్రెడిట్ కోహ్లీ-రాహుల్‌కే వెళ్లిపోయింది. కానీ భారత బ్యాటింగ్ సమయంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్‌ను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పట్టుదలతో ఆడుతూ..
ఆసీస్‌తో పోరులో ఒకదశలో 43 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది భారత్. ఓపెనర్లు రోహిత్-గిల్ ఇద్దరూ పెవలియన్ చేరారు. ఆ సమయంలో మరో వికెట్ పడితే మ్యాచ్ మీద కంగారూలు పట్టు బిగించేవారు. కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఆ చాన్స్ ఇవ్వలేదు. కింగ్ కోహ్లీతో కలసి స్కోరు బోర్డు మీదకు ఒక్కో పరుగు చేర్చుకుంటూ పోయాడు. వికెట్ పడకుండా చూసుకోవడమే గాక కోహ్లీతో సమానంగా పరిగెత్తుతూ వేగంగా సింగిల్స్, డబుల్స్ తీసి కంగారూ బౌలర్లు, ఫీల్డర్లను విసిగించాడు. పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ చేజింగ్‌లో ముఖ్య భూమిక పోషించాడు. కోహ్లీతో కలసి మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. అయినా అతడికి పెద్దగా క్రెడిట్ దక్కడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ టోర్నమెంట్ ఆసాంతం అతడి ఆట అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. ఫైనల్స్‌లో శ్రేయస్ ఇదే రీతిలో ఆడితే మనకు తిరుగుండదని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి