ఎస్సీ సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:25 PM
ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు.

- రూ. 40,232 కోట్లు కేటాయింపు
- విద్య, వైద్య రంగాలకు పెరిగిన పద్దు
- బీసీ సంక్షేమానికి అరకొర నిధులు
- రాష్ట్ర బడ్జెట్‌పై భిన్న స్వరాలు
మంచిర్యాల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు. రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రకటించగా ఎస్సీ సంక్షేమానికి అత్యధికంగా రూ. 40,232 కోట్లు కేటాయించింది. రాజీవ్‌గాంధీ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ సామాజికవర్గాలకు వివిధ యూనిట్లు కేటాయించేందుకు భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న బడ్జెట్ మరికొన్ని వర్గాలను నిరాశలో ముంచింది. జిల్లాకు ప్రత్యేకంగా నిధుల ప్రస్తావన లేకపోవడం ఒకింత నిరాశపరిచింది.
- విద్య, వైద్య రంగాలకు..
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యానికి గత సంవత్సరంతో పోల్చితే కొంతమేర బడ్జెట్ పెరిగింది. విద్యారంగానికి రూ. 23,108 కోట్లు కేటాయించగా, గత ఏడాదికంటే స్వల్పంగా బడ్జెట్ పెరిగింది. విద్యా రంగానికి గత ఏడాది రూ. 21,389 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం అధనంగా రూ. 1,719 కోట్లు కేటాయించారు. వైద్య రంగానికి రూ. 12,393 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం బడ్జెట్ కన్నా రూ.893 కోట్లు అధికం. అయినప్పటికీ ఆయా రంగాలకు బడ్జెట్ కేటాయింపులు సరిపడా జరగలేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
విద్యారంగానికి 20 శాతం కేటాయించాలి..
డి శ్రీకాంత్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్‌లో కేవలం 7.57 శాతం కేటాయించడం సిగ్గుచేటు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌కు వత్తాసు పలికేలా బడ్జెట్ రూపకల్పన జరిగింది. తక్షణమే ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి 20 శాతం నిధులు కేటాయించాలి.
నామ మాత్రపు బడ్జెట్...
రంగు రాజేశం, కన్వీనర్ సామాజిక న్యాయ వేదిక
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బలహీనవర్గాల వారికి కేటాయింపులు నామ మాత్రంగానే ఉన్నాయి. బీసీ సంక్షేమశాఖకు కేవలం రూ. 11,405 కోట్లు కేటాయించడం కంటి తుడుపు చర్యగా ఉంది. అలాగే విద్యాశాఖకు రూ. 23వేల కోట్లు కేటాయించడం ద్వారా కీలక రంగాలపై అశ్రద్ధ చేశారు. రాహుల్‌గాంధీ ప్రవచిస్తున్న సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాష్ట్ర పాలకులు ప్రవర్తించడం శోచనీయం.
కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు...
శాంతికుమారి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వం విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్ ఏ మాత్రం సరిపోదు. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067 పాఠశాలలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆయా గురుకులాల్లో చదివేది 5.5 లక్షల మంది మాత్రమే. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో చదివే విద్యార్థులు 16 లక్షలు. వారిలో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారు. వీరికి నాణ్యమైన విద్యా అందించడానికి ఈ కేటాయింపులు ఏ మాత్రం సరిపోవు.
ప్రజా సంక్షేమ బడ్జెట్...
ఆదర్శ వర్ధన్ రాజు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. గత సంవత్సరంతో పోలిస్తే అన్నిరంగాల్లో బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. విద్యా రంగానికి సైతం బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పించారు. గురుకులాల విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు పెంచడం శుభపరిణామం. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్ రూపకల్పన చేయడం గొప్ప విషయం.
జిల్లాకు మొండి చేయి
- వెర్రబెల్లి ర ఘునాథ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు మొండిచేయి చూపింది. జిల్లాలో ప్రభుత్వపరంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండగా దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలాగే మంచిర్యాల- అంతర్గాం బ్రిడ్జికి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. బ్రిడ్జీ నిర్మాణం చేపట్టి ప్రజలకు మేలు చేకూర్చాలి. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ నుంచి రాజీవ్‌నగర్ మధ్య రైల్వే వంతెనకు హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించడం మరిచారు.