Share News

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీ కరోనా కంటే ప్రమాదకరం

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:31 AM

కాంగ్రెస్‌ పార్టీ కరోనా కంటే ప్రమాదకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. బ్రిటిషర్లకంటే బీజేపీ ప్రమాదకరమంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీ కరోనా కంటే ప్రమాదకరం

  • రేవంత్‌రెడ్డి బీజేపీని బ్రిటిషర్లతో పోల్చడం సిగ్గుచేటు

  • తెలంగాణలో కమలాన్ని అడ్డుకుంటామనడం శతాబ్దపు జోక్‌: బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ కరోనా కంటే ప్రమాదకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. బ్రిటిషర్లకంటే బీజేపీ ప్రమాదకరమంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయవాద సిద్ధాంతాలు, నిలువెల్లా దేశభక్తిని పుణికి పుచ్చుకున్న బీజేపీని... దేశాన్ని దోచుకున్న బ్రిటిషర్లతో పోల్చడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. అవకాశవాద రాజకీయాలకు, అవినీతి పాలనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్‌ పార్టీ అని, అది కరోనా కంటే ప్రమాదకరమని అభివర్ణించారు.


కాంగ్రెస్‌ పార్టీ అంతరించిపోతున్న జాతిలాంటిదని, బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల పాలనలో ఎంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందో... 15 నెలల పాలనలో కాంగ్రెస్‌ పార్టీ అంతకు రెట్టింపు వ్యతిరేకతను మూటగట్టుకున్న విషయాన్ని రేవంత్‌రెడ్డి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కాంగ్రె్‌సను గెలిపించలేకపోయారని, సిట్టింగ్‌ సీటైన మల్కాజ్‌గిరి స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 50 శాతానికిపైగా ప్రాతినిధ్యాన్ని బీజేపీ కలిగి ఉందనే విషయాన్ని విస్మరించొద్దని చెప్పారు. బీజేపీ కంచుకోటైన గుజరాత్‌కు వెళ్లి తెలంగాణలో బీజేపీని అడ్డుకునే శక్తి ఉందనడం ఈ శతాబ్దపుజోక్‌ అని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని చెప్పారు.

Updated Date - Apr 10 , 2025 | 04:31 AM