Revanth Reddy: రెండో సారీ నేనే సీఎం!
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:32 AM
తాను ఐదేళ్ల పాలన తర్వాత మళ్లీ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శనివారం శాసన మండలిలో సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన విలేఖర్లతో చిట్‌చాట్ చేశారు.

మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకతతో మాకు ఓటేశారు
రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు
నిజం చెప్పడానికే అప్పుల వెల్లడి: సీఎం
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తాను ఐదేళ్ల పాలన తర్వాత మళ్లీ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శనివారం శాసన మండలిలో సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన విలేఖర్లతో చిట్‌చాట్ చేశారు. మొదటిసారి బీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రె్‌సకు ఓటేశారని, రెండోసారి మాత్రం తమపై ప్రేమతో ఓటేస్తారని ధీమాగా చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లని, తాను పనిని నమ్ముకుని ముందుకు వెళుతున్నానని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి పోరాటం చేశానో ఇప్పుడు సీఎంగా అదే పోరాటం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. సీఎం అయిన తర్వాత భద్రతాసిబ్బంది పెరిగారు తప్ప తానేమీ మారలేదన్నారు. చేసిందే చెబుతానని, చేయగలిగిందే చెబుతానని ప్రకటించారు. ప్రభుత్వం ప్రారంభించిన పథకాలన్నీ పక్కాగా ముందుకు వెళుతున్నాయన్నారు.
ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నిజం చెప్పడం కోసమే శాసన సభలో అప్పుల వివరాలను వెల్లడించామని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, రాష్ట్ర భవిష్యత్తే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తించిందని, కుటుంబానికి నలుగురిని లెక్క వేసుకున్నా కోటి మంది ఓటర్లు ఈ విధంగా లబ్ధి పొందారని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోటి మంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తామని ప్రకటించారు. వారంతా ఇప్పుడు మాట్లాడక పోయినా ఓట్లు మాత్రం తమకే వేస్తారన్నారు. జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను బడ్జెట్ అంచనాలు అడిగిందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2026లో జన గణనను పూర్తి చేసి, 2027లో జనాభా లెక్కలను ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. ఈ జనాభాను ఆధారంగా చేసుకుని, లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టవచ్చని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.