Telangana Assembly: ఇదే ఫస్ట్‌టైమ్.. అసెంబ్లీలో హైవోల్టేజ్ కామెంట్స్..
ABN , Publish Date - Mar 27 , 2025 | 06:05 PM
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడి జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆరోపణలు, కౌంటర్లతో సభ దద్దరల్లింది.

హైదరాబాద్, మార్చి 27: తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి.. అటు నుంచి కేటీఆర్ ఒకరొకరు కౌంటర్లు ఇస్తూ సభను మరింత రక్తి కట్టించారు. తొలుత మాట్లాడిన కేటీఆర్.. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కక్ష సాధింపులకు పాల్పడితే కేటీఆర్ కుటుంబం అంతా జైల్లోనే ఉండేదన్నారు. కక్ష సాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం తమకు లేదని.. దేవుడు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు.
అసెంబ్లీలో సీఎం ప్రసంగం..
కక్ష సాధింపుల ఆలోచన ప్రభుత్వానికి లేదు. కక్ష సాధింపులకు పాల్పడితే మీరంతా చంచల్‌గూడ జైల్లోనే.. చర్లపల్లి జైల్లోనే ఉండేవారు. సలహాలు ఇస్తారనుకుంటే.. ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు. కానీ, ఎంపీగా ఉన్న తనను చర్లపల్లి జైలుకు పంపారు. జైల్లో నిద్రలేని రాత్రుళ్లు గడిపాను. డిటెన్షన్ సెల్లో 16 రోజులు నన్ను నిర్బంధించారు. రాత్రిపూట లైట్లు ఆపమని అడిగినా.. జైలు సిబ్బంది ఆపేవారు కాదు. ఎందుకని అడిగితే.. పై నుంచి ఆదేశాలు ఉన్నాయనేవారు. రాజకీయ కక్షసాధింపులు చేసింది మీరు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చి వెళ్లా. కక్ష సాధింపు మీదా నాదా పైనుంచి దేవుడు అన్నీ చూస్తాడని వేచి చూశా. నేను ప్రమాణస్వీకారం చేసిన రోజే.. వాళ్లు ఆస్పత్రి పాలయ్యారు. నేను కక్ష సాధింపులకు పాల్పడితే మీ కుటుంబం అంతా జైలుపాలే. ఇప్పటివరకు మేం అక్రమ కేసులు పెట్టలేదు.
రైతు రుణమాఫీ చేశాం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారు. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి.. అసలు పూర్తే చేయలేదు. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకుని రైతుబంధు కూడా వేయలేదు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.16,900 కోట్లతో రుణమాఫీ చేశారు. మేం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే.. రూ.20,615 కోట్ల రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ ఎగవేసిన రైతుబంధు రూ.7,625కోట్లు మేం చెల్లించాం. వరి వేస్తే ఉరే అని పేద రైతులను బెదిరించారు. కానీ వారి ఫామ్‌హౌస్‌లో మాత్రం వరి పండించి అమ్ముకున్నారు. మేం వరి వేసిన వారికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చాం.
కాంగ్రెస్ అంటేనే కరెంట్..
అసలు బీఆర్ఎస్‌కు ఉచిత కరెంట్‌తో ఏం సంబంధం.. రాష్ట్రంలో ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్‌దే. రైతుల ఉచిత కరెంట్ కోసం రూ.33వేల కోట్లు ఖర్చు చేశాం. బీఆర్ఎస్ పదేళ్లలో చేయని పనులు.. మేం 10 నెలల్లో చేశాం.
భారీగా అప్పులు..
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర అప్పు రూ.72వేల కోట్లు. కార్పోరేషన్ అప్పులు కూడా కలిపితే రూ.90 వేల కోట్లు. ఈ పదేళ్లలో FRBM అప్పులే రూ.3.50లక్షల కోట్లు దాటింది. మేం అధికారంలోకి వచ్చే నాటికి అప్పు రూ.6.69 లక్షల కోట్లు. ఇతర బకాయిలతో కలిపి రూ.7.05 లక్షల కోట్లు. పెండింగ్ బిల్లులే రూ.40వేల కోట్లు పెట్టిపోయారు. మేం 15 నెలల్లో రూ.1.58లక్షల కోట్ల అప్పు చేశాం. కొత్తగా చేసిన అప్పులో రూ.1.53లక్షల కోట్లు పాత అప్పులకే చెల్లించాం. కాళేశ్వరంపై రూ.70,490 కోట్లు అప్పు తీసుకొచ్చారు. కూలిపోయిన ఆ ప్రాజెక్ట్‌కు రూ.5వేల కోట్లకు పైగా చెల్లించాం. గత సీఎం డాక్టర్, ఇంజనీర్, డిజైనర్ నేనే అంటూ కాళేశ్వరం కట్టారు. ఇంజనీర్లు చెప్పినా వినకుండా.. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టారు. ఏడో వింత అంటే మూడేళ్లకే పనికిరాకుండా పోయింది. ఇప్పుడు నీళ్లు నిలిపితే కూలుతుందని నిపుణులు చెబుతున్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల వల్లే.. తెలంగాణలో వరి దిగుబడి పెరిగింది.