MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి?
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:50 AM
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

జీవన్‌రెడ్డి పోటీలో లేరన్న మంత్రి శ్రీధర్‌బాబు
ఒకటి రెండురోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం
కరీంనగర్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండురోజుల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశమున్నట్టు తెలిసింది. గురువారం కరీంనగర్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పోటీ చేయడంలేదని, అభ్యర్థి ఎవరనేది ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. టీపీసీసీ నుంచి ఈ స్థానానికి జీవన్‌రెడ్డి పేరునే పంపారు. జీవన్‌రెడ్డి తాను పోటీలో ఉండబోనని ఏఐసీసీకి తెలిపారని శ్రీధర్‌బాబు పేర్కొనడంతో నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి లైన్‌క్లియర్ అయినట్లు భావిస్తున్నారు. జీవన్‌రెడ్డిపై ఉన్న గౌరవభావంతోనే ఆయన పేరును టీపీసీసీ... ఏఐసీసీకి పంపింది.
అభ్యర్థిత్వం విషయంలో నరేందర్‌రెడ్డి, ప్రసన్న హరికృష్ణ పేర్లను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 42 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ ఎంపీల అభిప్రాయాలు తీసుకుని నరేందర్‌రెడ్డి పేరును ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3.47 లక్షల ఓట్లు నమోదు కాగా అందులో సగానికిపైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే. దీంతో ఈ జిల్లావాసినే అభ్యర్థిగా నిలిపితే గెలుపు సాధించవచ్చని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. నరేందర్‌రెడ్డి అందరికన్నా ఎక్కువ ఓట్లు నమోదు చేయించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని నరేందర్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు కలిశారు. జిల్లాలో పలు సమావేశాల్లో నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి వేదిక పంచుకోవడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లేనని భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్‌సింగ్?
కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్‌ను నిలపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి పేరు వెల్లడి కాగానే తమ అభ్యర్థిని ప్రకటించాలని బీఆర్‌ఎస్ నాయకత్వం వేచిచూస్తున్నట్టు సమాచారం.