ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Education: గురువుల్లేని వైద్య కళాశాలలు సర్జరీ చేయలేని డాక్టర్లు!

ABN, Publish Date - Jan 13 , 2025 | 03:33 AM

ఇంజనీరు, డాక్టరు చదువంటే గతంలో గొప్ప.. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది! ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.. మెడిసిన్‌ చదువుతున్నారు.. అంటూ గొప్పగా చెప్పుకొనేవారు.

  • ఇబ్బడిముబ్బడిగా కొత్త మెడికల్‌ కాలేజీలు.. అడ్డగోలుగా ఎన్‌ఎంసీ అనుమతులు

  • షెడ్లు, గోదాముల్లో తరగతులు.. కొత్త కాలేజీలకు ప్రొఫెసర్లు దొరక్క అవస్థలు

  • ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో గురువుల కొరత.. రోగులు, సర్జరీలు అంతా మాయే

  • ప్రైవేటులో నకిలీ వేలిముద్రలతో ‘అధ్యాపకుల’ హాజరు

  • నైపుణ్యం లేకుండానే ఎంబీబీఎ్‌స పూర్తి.. చిన్న సర్జరీ చేయాలన్నా పరేషాన్‌!

  • ఎంబీబీఎ్‌సలు, పీజీలు చేసినోళ్లకూ వణుకుతున్న చేతులు

  • వైద్య విద్యలో కొరవడుతున్న నాణ్యత.. నిరుద్యోగులుగా మారుతున్న వైద్యులు

  • దేశంలో వెయ్యి మందికి ఓ వైద్యుడు.. తెలుగు రాష్ట్రాల్లో 681 మందికి ఓ డాక్టర్‌

  • త్వరలో ఇంజనీరింగ్‌ మాదిరిగానే వైద్యవిద్య మారుతుందన్న ఆందోళన

  • ఆసిఫాబాద్‌ వైద్య కళాశాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక్కడ పని

చేసేందుకు అధ్యాపకులు రావడం లేదు. 27 మంది ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కాగా ఇద్దరే ఉన్నారు. 30 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు గాను ఒక్కరే పని చేస్తున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 58 పోస్టులకు గాను 54 ఖాళీగా ఉన్నాయి. అమ్మాయిల వసతి గృహాన్ని మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో, అబ్బాయిలకు పాత డీఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

గతంలో ఎంబీబీఎస్‌ చేసిన వైద్యులు గర్భసంచి, ఉండూకం, హెడ్రోసిల్‌, హెర్నియా, పైల్స్‌ లాంటి వాటికి శస్త్రచికిత్సలు చేసేవారు. కానీ, నేటి తరం ఎంబీబీఎస్‌ వైద్యులకు కత్త్తిపట్టాలంటే చేతులు వణుకుతున్నాయి. పీజీ చేసినవారిదీ అదే పరిస్థితి! ఇదంతా అరకొర చదువుల ఫలితమే. ఈ పాపం ఎన్‌ఎంసీదేనని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు.

భూపాలపల్లి వైద్య కళాశాలలో 27 మంది ప్రొఫెసర్లకు గాను 9 మంది, 30 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు గాను 11 మంది, 56 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు 30 మంది ఉన్నారు. రెండో ఏడాది విద్యార్థులకు ల్యాబ్‌ లేదు. ఇక లైబ్రరీలో పూర్తి స్థాయిలో పుస్తకాలు అందుబాటులో లేవు.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఇంజనీరు, డాక్టరు చదువంటే గతంలో గొప్ప.. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది! ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.. మెడిసిన్‌ చదువుతున్నారు.. అంటూ గొప్పగా చెప్పుకొనేవారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత మంచి కొలువులూ దొరికేవి. అలాంటి ఇంజనీరింగ్‌ విద్యలో క్రమంగా నాణ్యత తగ్గిపోయింది! ఫీజురీయింబర్స్‌మెంట్‌ కోసం ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్‌ కాలేజీలు పెట్టడంతో సాంకేతిక విద్యలో నాణ్యత కొరవడింది. బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులు ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు.. చివరికి డెలివరీ బాయ్స్‌గాను, క్యాబ్‌ డ్రైవర్లగానూ పనిచేస్తున్నారు. చాలా మందికి అలాంటి ఉపాధి కూడా దొరకడం లేదు! ఇప్పుడు వైద్య విద్య పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు దేవుళ్లుగా భావించే వైద్యులను తీర్చిదిద్దే మెడికల్‌ కళాశాలల్లో పరిస్థితులు దైవాధీనంగా మారాయి! అరకొర వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది కొరత, నాణ్యత లేని చదువుతో.. పరీక్షలు పాసై, పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్న వైద్యులకు కనీస పరిజ్ఞానం లేని పరిస్థితులు నెలకొంటున్నాయి! ఇంజనీరింగ్‌ కాలేజీల మాదిరిగానే.. ఇటీవలి కాలంలో వైద్యవిద్య కళాళాలలనూ ఏర్పాటు చేసేస్తున్నారు.


కొత్త కాలేజీలను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తుండడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘జనాభా-వైద్యుల’ నిష్పత్తికి మించి డాక్టర్లు ఉన్నారు!! ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ప్రతి 1000 మందికి జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికే ఓ వైద్యుడు ఉండడం విశేషం!! ప్రభుత్వాలు మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై చూపుతున్న శ్రద్ధ.. వాటిలో నాణ్యమైన విద్యను అందించడంపై మాత్రం చూపడం లేదు. ఫలితంగా ఆయా కళాశాలల్లో చదివిన వైద్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. రేకుల షెడ్లు, గోడౌన్లలో మెడికల్‌ కాలేజీలు నడుస్తున్నాయి. మృతదేహాలను కోయకుండా, విషయ పరిజ్ఞానం లేకుండానే డాక్టర్లు అయిపోతున్నారు! ఎంబీబీఎస్‌ చదివినా.. సాధారణ శస్త్రచికిత్సలు కూడా చేయలేకపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో నిబంధనలకు తగినట్లుగా అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. అడ్డగోలుగా ఏర్పాటైన కాలేజీల్లో రోగులు, విద్యార్థులు ఉంటున్నారు తప్ప.. వారికి విద్యాబుద్ధులు నేర్పే గురువులు ఉండడం లేదు. పెద్ద సంఖ్యలో ఏర్పాటైన కాలేజీల కారణంగా ఏటా వేల సంఖ్యలో మెడికోలు బయటకు వచ్చి, నిరుద్యోగులుగా మారుతున్నారు. కొంత మందికి అవకాశాలు దక్కినా.. వేతనాలు మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. నాణ్యమైన బోధన లేకుండా వైద్య పట్టాలు పుచ్చుకొని వృత్తిలోకి అడుగుపెట్టే డాక్టర్లతో ప్రజల ప్రాణాలకూ ముప్పే! రాబోయే దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో ఇంజనీర్ల కంటే డాక్టర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కళాశాలలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.


ప్రభుత్వ, ప్రైవేటులో 50-60% ప్రొఫెసర్ల కొరత

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత 50 నుంచి 60 శాతం వరకు ఉందని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు. సర్కారీ కాలేజీల్లో అధ్యాపకులను కాంట్రాక్టు పద్ధతిలో రెట్టింపు జీతం ఇచ్చి తీసుకుంటామని పదేపదే నోటిఫికేషన్లు ఇచ్చినా ఎవరూ రావడం లేదు. గత ఏడాది జూన్‌ నుంచి డిసెంబరు మధ్య కాలంలో సర్కారీ కాలేజీలన్నీ వరుసగా అధ్యాపకుల కోసం నోటిఫికేషన్లు ఇచ్చాయి. అయినా పూర్థిస్థాయిలో ప్రొఫెసర్లను నియమించుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం పెరిగిన కాలేజీలకు తగ్గట్లుగా వైద్యవిద్యను బోధించే వారు పెరగకపోవడమే! ఉన్న వాటిలోనే అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండగా.. కొత్త కాలేజీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. డీఎంఈ పరిఽధిలో మానవ వనరుల కొరత ఉందని ఈ ఏడాది కాగ్‌ ఇచ్చిన నివేదికలోనూ వెల్లడైంది. డీఎంఈలో 56 శాతం మేరకు మానవ వనరుల కొరత ఉన్నట్లు కాగ్‌ పేర్కొంది. ఇక ప్రైవేటులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ అధ్యాపకులున్నారో లేరో కూడా తెలియదు.


త్వరలో ఏటా 10 వేల మంది ఎంబీబీఎస్‌లు!

తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ప్రైవేటులో ఉన్న వాటిలో 95 శాతం అధికార, విపక్ష రాజకీయ నేతలవే. అందులో కనీస సౌకర్యాలు, అధ్యాపకులు లేకున్నా.. అడిగే నాథుడే లేరు. ఈ విషయంలో జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)ని కూడా ‘మేనేజ్‌’ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే దేశంలో తగినంత మంది అధ్యాపకులు ఉన్నారా? లేదా? అని చూడకుండా కేంద్రం అడ్డగోలుగా మెడికల్‌ కాలేజీలను మంజూరు చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 60 కాలేజీలుండగా, 8715 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. తగినంత మంది అధ్యాపకులు లేక నాణ్యమైన వైద్యవిద్య అందడం లేదు. మరి కొద్ది ఏళ్లలో మనదగ్గర ఏటా పదివేల మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకొని బయటకు వస్తారు. వారిలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుందనేది ప్రశ్నార్థకమే! మరోవైపు మనదగ్గర 2544పీజీ సీట్లే ఉన్నాయి. అంటే ఎంబీబీఎస్‌ పూర్తి చేసేవారిలో కేవలం 26 శాతం మందికే సీట్లు దక్కుతాయి. దాంతో రానురాను సీటు దక్కించుకునే అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి.

ఖమ్మం కళాశాలలో అధ్యాపకుల కొరత ఉంది. సీట్ల సంఖ్య ఆధారంగా 170 మంది అధ్యాపకులుండాలి. 48 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు 12 మంది, 120 మంది అసిస్టెంట్లకు గాను 40 మంది ఉన్నారు. 55 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లకు 8 మందే ఉన్నారు. 12 మంది ఫార్మాసి్‌స్టలకు నలుగురే ఉన్నారు.


నర్సంపేటలో 137 మందికి 87 మందే..

నర్సంపేట మెడికల్‌ కాలేజీలో 50 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాదే అడ్మిషన్లు మొదలయ్యాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు 137 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం 87 మందే పనిచేస్తున్నారు. అధ్యాపకుల సంఖ్య తగినంతగా లేదు.

  • వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల(కేఎంసీ) బోధనాస్పత్రిగా ఎంజీఎం రోగులకు ేసవలు అందిస్తోంది. కళాశాలలో ప్రొఫెసర్ల కొరత లేనప్పటికీ మౌలిక సదుపాయాలు ఇబ్బందిగా ఉన్నాయి. ఎన్‌ఎంసీ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇటీవల రూ.12 లక్షల జరిమానా వేసింది.

  • కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తపల్లిలోని తెలంగాణ సీడ్స్‌ గోదాముల్లో ఏర్పాటు చేశారు. కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రొఫెసర్‌ పోస్టులు 27 మంజూరు కాగా.. పది మందే ఉన్నారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు 30కి 16 మంది, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 58కి 51 మంది ఉన్నారు.

  • జోగులాంబ గద్వాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్లకొరత తీవ్రంగా ఉంది. ఐదుగురు ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. మొదటి ఏడాదిలో 60 మందికి గాను 42 మందే ఉన్నారు. వీరిలోనూ రెగ్యులర్‌ 20 మంది, కాంట్రాక్టు 22 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బోధనేతర సిబ్బందిలో 20 మంది గాను కేవలం ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారు. లైబ్రరీ లేదు. ఇందులో ఉన్న విద్యార్థులకు కళాశాలలోని ఓ విభాగాన్ని హాస్టల్‌గా మార్చారు. విద్యార్థినులకు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం సమీపంలో హాస్టల్‌ ఏర్పాటు చేశారు.

  • మెదక్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేవు. ల్యాబ్‌ సరిగా లేదు.

  • సంగారెడ్డి కాలేజీలో మంజూరైన పోస్టులు 1001 ఉంటే కేవలం 546 మందే పనిచేస్తున్నారు. 455 ఖాళీలున్నాయి.

  • సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 175 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, 75 పీజీ సీట్లు ఉన్నాయి. వెయ్యి పడకల ఆస్పత్రి భవనం ఇంకా పూర్తి కాలేదు.

  • కామారెడ్డి మెడికల్‌ కళాశాలలో పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు లేరు. 28 మందికి గాను 15 మంది, 30 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు 16 మంది, 59 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు 29 మంది ఉన్నారు. యంత్ర పరికరాలు పూర్తిస్థాయిలో లేవు. గైనిక్‌ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రిలో బెడ్లూ సరిపోవడం లేదు.

  • జగిత్యాల ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 22 మంది ఫ్రొఫెసర్లుకు గాను 12 మంది ఉన్నారు. క్లినికల్‌, పారా క్లినికల్‌ విభాగాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగినంతగా లేదు. కళాశాలకు పూర్తి స్థాయి భవనం లేదు. తాత్కాలిక భవనాల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. జనరల్‌ ఆస్పత్రిని పాత భవనంలో నిర్వహిస్తుండడంతో సదుపాయాలు కరువయ్యాయి.

  • జనగామ మెడికల్‌ కాలేజీ శాశ్వత భవన నిర్మాణం కోసం రూ.190 కోట్లు మంజూరు అయ్యాయి. ఏడాది కిందట పనులు ప్రారంభమవగా, ప్రస్తుతం 50శాతం పూర్తి కాలేదు. 26 మంది ప్రొఫెసర్లకు 20 మంది, 29 మంది అసోసియేట్లకు 21 మంది, 57 మంది అసిస్టెంట్లకు 46 మంది ఉన్నారు.

  • మంచిర్యాల మెడికల్‌ కాలేజీలో 105 పోస్టులకు 74 మంది విధుల్లో చేరారు. ఇక బోధనాస్పత్రిని అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు.

  • సిరిసిల్ల కళాశాలలో 24 మంది ప్రొఫెసర్లకు గాను 8 మంది, అసోసియేట్లు 27కు గాను 12 మంది, అసిస్టెంట్లు 55కు గాను 45 మంది పని చేస్తున్నారు.

  • నిర్మల్‌ మెడికల్‌ కళాశాలలో 165 మందికి గాను 70 మంది అధ్యాపకులు ఉన్నారు. 95 ఖాళీలు ఉన్నాయి. విద్యార్థుల కోసం ప్రస్తుతం హాస్టల్‌ భవనం నిర్మాణంలో ఉండడంతో స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో కొంత భాగాన్ని కేటాయించి వసతి సదుపాయాలను కల్పిస్తున్నారు.

  • కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో 449 మంది అధ్యాపకులకు గాను, 100 మంది పని చేస్తున్నారు. ఇంకా 349 మందిని రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో భర్తీ చేయాల్సి ఉంది. మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.

  • వనపర్తి మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్లు 14 మంది, అసోసియేట్‌ ప్రొఫెసర్లు 15 మంది, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 50 మంది ఉన్నారు. దాదాపు 70 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • నారాయణపేట వైద్య కళాశాలలో 97 పోస్టులకు 32 మంది విధుల్లో చేరారు. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో ఒక్క డాక్టర్‌ లేరు. గైనకాలజీలో కాంట్రాక్టు పద్ధతిన ఒకరిని తీసుకున్నారు. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా 12 కిలోమీటర్ల దూరంలో శిథిలావస్థలో జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఉంది. అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు ఎంబీబీఎస్‌ విద్యార్థులు నారాయణపేటలో అద్దె భవనాల్లో హాస్టల్లో ఉంటూ నిత్యం ప్రత్యేక ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లి వస్తుంటారు.

  • పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిబ్బంది కొరత ఉంది. 45 మంది ప్రొఫెసర్లకు గాను 12 మంది, 45 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ముగ్గురు, 142 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు 44 మంది ఉన్నారు. 55 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లకు గాను ఒక్కరే ఉన్నారు. 12 మంది ఫార్మాసిస్ట్‌లకు ఇద్దరు మాత్రమే ఉన్నారు.

  • ఇక ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లోనూ అధ్యాపకులు, మౌలిక సదుపాయాల కొరత ఉంది. ఉస్మానియా మెడికోలకు కనీస హాస్టల్‌, మరుగుదొడ్ల సౌకర్యాలు లేవు. గాంధీలో 250 యూజీ, 221 పీజీ సీట్లుండగా, కేవలం 60 మంది ప్రొఫెసర్లు, 199 మంది అసిస్టెంట్లు, 77 మంది అసోసియేట్లు ఉన్నారు. ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. గాంధీలో సైకియాట్రిస్టు, మైక్రోబయాలజిస్టు, రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్లు లేరు.


ఆసిఫాబాద్‌లో అధ్యాపకుల కోసం ఆందోళన!

ఆసిఫాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో అధ్యాపకులు లేకపోవడంతో అక్కడి విద్యార్థులు ఈ నెల 2న కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. అధ్యాపకులు లేక కేవలం సీనియర్‌ రెసిడెంట్లు, ఇంటర్న్‌లతో నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతులు ప్రారంభమై మూడు నెలలు గడిచినా, ఇప్పటికీ ఒక్క మృతదేహం కూడా అందుబాటులో లేకపోవడంతో కేడవర్‌ డిసెక్షన్‌ చేయలేకపోయామని అంటున్నారు. ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు అక్కడ మొదటి, రెండో ఏడాది తరగతులకు 198మంది అధ్యాపకులకు కేవలం ఏడుగురే పనిచేస్తున్నారంటే ఎంత కొరత ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఈ పాపం ఎన్‌ఎంసీదే..

వైద్యవిద్య కళాశాలల్లో ప్రమాణాలు పడిపోవడానికి ఎన్‌ఎంసీ ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో కూడా చూడకుండా ఇబ్బడిముబ్బడిగా కొత్త ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసేస్తోంది. కళాశాలలు పెట్టిన తర్వాత కూడా తనిఖీలు చేయడం లేదు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఒక్క మెడికల్‌ కాలేజీ గుర్తింపు రద్దు కాలేదంటేనే ఎన్‌ఎంసీ పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏటా సీట్ల కోత, కాలేజీల గుర్తింపు రద్దులాంటివి జరిగేవి. కానీ తొలిసారి ఒక్క సీటు కూడా కోత పడకపోవడం గమనార్హం. పైగా ఎన్నడూ లేని జరిమానా విధానాన్ని ప్రవేశపెట్టింది. వైద్యవిద్యలో ప్రమాణాలు దిగజారిపోవడానికి ఎన్‌ఎంసీ కారణమని వైద్యనిపుణులు ఆరోపిస్తున్నారు. పలు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో రోజూ కనీసం వంద మంది కూడా అవుట్‌ పేషెంట్లు ఉండడం లేదు. సర్జరీలు జరిగేదీ లేదు. అయినప్పటికీ ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌కు దొంగ లెక్కలు చూపుతున్నాయి. అలాగే పీజీలు, హౌస్‌సర్జన్లతో తప్పుడు కేస్‌షీట్లు రాయిస్తున్నారు. చేయని సర్జరీలను చేసినట్లు చూపుతున్నారు. కొన్ని కాలేజీలకు అసలు రోగులే రావడం లేదు. మరికొన్ని కాలేజీలు ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చినప్పుడు నకిలీ రోగుల్ని తీసుకొస్తున్నాయి. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీలు చేసి బయటకొచ్చిన వారు మళ్లీ కార్పొరేట్‌ లేదా ఇతర ఆస్పత్రుల్లో చేరి మెళకువలు నేర్చుకుంటున్నారు.ఇక ప్రైవేటులో అధ్యాపకులు రావడం లేదన్నది బహిరంగ రహస్యం. కొద్దిమంది అధ్యాపకులే వస్తుంటారు. వారి బయోమెట్రిక్‌ హాజరు కోసం నకిలీ వేలిముద్రలు తయారుచేసి, అదే కాలేజీలోని అటెండర్ల చేత వేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వైద్యవిద్యలో పాఠ్యపుస్తకాల కంటే ప్రాక్టికల్‌గా నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది. అప్పుడే వైద్యవిద్యపై పట్టు లభిస్తుంది. గతంలో మెడికోలు బోధనాస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేసుల్ని చూసేవారు. అలాగే రోజూ రెండు, మూడు శస్త్రచికిత్సల్లో సహాయకులుగా పనిచేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటి మెడికోలు సర్జరీలను కూడా ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకుంటున్నారు. ఇక చాలా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు మృతదేహాలు దొరకని పరిస్థితి ఉంది. ప్రైవేటు కాలేజీలకు ఎమర్జెన్సీ కేసులే రావు. అటువంటి చోట చదువుకున్నవారు.. ఎమర్జెన్సీ కేసుల్ని ఎలా డీల్‌ చేయగలుగుతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పీజీ గైనకాలజీ చేసిన వారు సైతం సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయలేకపోతున్నారు.

నిరుద్యోగ వైద్యులు..!!

రాష్ట్రంలో ఏటికేడు నిరుద్యోగ వైద్యుల (ఎంబీఎఎస్‌) సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1,32,216 మంది డాక్టర్లు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్తగా 32 వేల మంది వైద్యులు రాష్ట్ర వైద్యమండలిలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యులకు కేవలం రూ.25-30 వేల జీతమే ఇస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ, మేనేజ్‌మెంట్‌ కోటాలో రూ.కోటికి పైగా పెట్టి చదివినా.. వారి ఖర్చులకూ సంపాదించుకునే పరిస్థితి లేదు.


ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇదీ పరిస్థితి..

నల్లగొండ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రస్తుతం 5వ సంవత్సరం బోధన సాగుతోంది. ఈ కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఇటీవలే నూతన భవన సముదాయం, హాస్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. దీనికి అనుబంధంగా 450 పడకల జనరల్‌ ఆస్పత్రి కొనసాగుతోంది. అయితే ఈ భవనంలోకి కళాశాలను మార్చలేదు. కాలేజీలో మొత్తం 173 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ములుగులో 20% బోధన సిబ్బంది లేరు!

ములుగు జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రారంభమైంది. సొంత భవనం లేకపోవడంతో జిల్లా ఆస్పత్రి కోసం కట్టిన భవనంలో ఏర్పాటు చేశారు. 50 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. 13 మంది ప్రొఫెసర్లు, 22 మంది అసోసియేట్‌, 32 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. 20ు బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మహేశ్వరం కళాశాల భవనం నిర్మాణదశలోనే..

మహేశ్వరం మెడికల్‌ కళాశాల ఇబ్రహీంపట్నం పరిధి మంగల్‌పల్లి భారత ఇంజనీరింగ్‌ కళాశాల క్యాంప్‌సలోని ఓ ప్రైవేట్‌ భవనంలో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతోంది. ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవనం తరగతుల నిర్వహణకే సరిపోతోంది. లైబ్రరీ లేదు. విద్యార్థులు, సిబ్బందికి సరిపడా మరుగుదొడ్లు లేవు. విద్యార్థులకు హాస్టల్‌ లేక ప్రైవేటు హాస్టళ్లలో ఉంటున్నారు.


నియామకాలే కాదు.. పోస్టింగూ ముఖ్యమే

కొత్త మెడికల్‌ కాలేజీల్లో శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి. ఎప్పటికప్పుడు పదోన్నతులు ఇవ్వాలి. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే వెసులుబాటు కల్పించాలి. అధ్యాపకులు కొరుకున్న చోట పోస్టింగ్‌ ఇవ్వాలి. గ్రామీణ ప్రాంత కాలేజీల్లో పనిచేసేవారికి అదనపు ప్రోత్సాహకాలివ్వాలి. ప్రస్తుతం అధ్యాపకులకిచ్చే వేతనాలకు శాశ్వత పద్ధతిలో ఎంపిక చేసినా తగినంత మంది రారు. అందుకే అధ్యాపకుల వేతనాలను పెంచాలి. డిమాండ్‌ ఉన్న సబ్జెక్టులకు ఇంకా ఎక్కువ వేతనమివ్వాలి. ప్రొఫెసర్లకు వేతనాలతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు లేదా ప్రోత్సాహకాలు ఇస్తేనే దీర్ఘకాలికంగా వారు బోధనావృత్తిలో కొనసాగుతారు. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.

- డాక్టర్‌ నరహరి, నాగర్‌కర్నూల్‌ కాలేజీ, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు


ఈ పరిస్థితి ఇప్పటిది కాదు..

వాస్తవానికి అధ్యాపకుల లభ్యత ఆధారంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ, గత ప్రభుత్వం రాజకీయ కోణంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ అంటూ వీటిని ప్రారంభించింది. 2022 నాటికి రాష్ట్రంలో 18 మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటిలో అధ్యాపకులు దొరక్క నానా ఇబ్బంది పడ్డారు. ప్రొఫెసర్ల కోసం ఆ ఏడాది వైద్యశాఖ జాతీయ స్థాయిలో 3 సార్లు నోటిఫికేషన్‌ ఇచ్చినా అధ్యాపకులు దొరకలేదు. దాంతో కొత్తగా ప్రారంభించాలనుకున్న మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లను అప్పటి సర్కారు తగ్గించుకుంది. 150 సీట్లు అనుకున్నచోట 100 సీట్లకే పరిమితం చేసింది. కొత్తగా మెడికల్‌ కాలేజీ ప్రారంభించాలంటే వాటిలోని సీట్ల ఆధారంగా ఎంతమంది అధ్యాపకులుండాలనేదానిపై ఎన్‌ఎంసీ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్య కళాశాలల్లో మొత్తం 22 విభాగాలుంటే వాటిలో క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ ఉంటాయి. నాన్‌ క్లినికల్‌లో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్‌లో అధ్యాపకులు అస్సలు దొరకడం లేదు. క్లినికల్‌లో రేడియాలజీ, డెర్మటాలజీలదీ అదే పరిస్థితి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి.

ఎన్‌ఎంసీ మార్గదర్శకాల

మేరకు కాలేజీల్లో

ఉండాల్సిన అధ్యాపకులు

వైద్య సీట్లు సంఖ్య

100 104

150 116

200 142

250 159


80% వైద్య కళాశాలల్లో కనీస ప్రమాణాలు కరువు!

న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో ప్రతి అయిదు వైద్య కళాశాలల్లో నాలుగు (80 శాతం) జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిర్దేశించిన కనీస ప్రమాణాలనైనా పాటించడం లేదు. దేశవ్యాప్తంగా సుమారు 700 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా.. ఎన్‌ఎంసీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అనేక కళాశాలల డొల్లతనం బయటపడుతోంది. కళాశాలల్లో మౌలిక వసతుల కొరత, అధ్యాపకుల గైర్హాజరుతో పాటు విద్యార్థులకు తగినన్ని హాస్టళు లేకపోవడం, ర్యాగింగ్‌ వంటి సమస్యలను వారు గుర్తిస్తున్నారు. నిబంధనలు, ప్రమాణాలు పాటించని కళాశాలలకు రూ.10 లక్షల నుంచి రూ.50 వరకు జరిమానాలు విధిస్తున్నారు. రూ.కోటి వరకు జరిమానా విధించిన సందర్భాలూ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయినా ప్రమాణాలు మెరుగుపర్చుకోని కళాశాలల్లో సీట్ల సంఖ్యపై కోత విధిస్తున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 03:33 AM