Share News

New Bars: వచ్చేస్తున్నాయ్‌ కొత్త బార్లు!

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:23 AM

రాష్ట్రంలో కొత్త బార్లు ఏర్పాటుకానున్నాయి. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా 25 చోట్ల బార్లు రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ప్రభుత్వ ఆమోద ముద్ర పడింది.

New Bars: వచ్చేస్తున్నాయ్‌ కొత్త బార్లు!

  • జీహెచ్‌ఎంసీ మినహా 25 చోట్ల ఏర్పాటు

  • నేడు నోటిఫికేషన్‌ జారీ

  • కోడ్‌ ముగిశాక జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 15 బార్లు

  • ఏప్రిల్‌ 26 వరకు దరఖాస్తులు

  • లాటరీ పద్ధతిన ఎంపిక

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త బార్లు ఏర్పాటుకానున్నాయి. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రవ్యాప్తంగా 25 చోట్ల బార్లు రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ప్రభుత్వ ఆమోద ముద్ర పడింది. ఈమేరకు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆబ్కారీశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్‌ 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనాభా ప్రాతిపదికన, రాబడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని బార్లను ఏర్పాటు చేయనున్నారు. ఎలైట్‌ బార్లకు అనుమతులతో పాటు మైక్రోబ్రూవరీల సంఖ్య పెంచాలని భావించినా, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1176 బార్లు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం వరకు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్‌, బీరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్ముకునేందుకు టీజీబీసీఎల్‌ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇదే తరుణంలో కొత్త బార్లకు అనుమతి ఇవ్వడానికి ఎక్సైజ్‌ శాఖ ముందుకొచ్చింది.


కాగా బార్లకు సంబంధించి ఒక్కో దరఖాస్తుకు ఫీజును రూ.లక్షగా నిర్ణయించారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వరు. ఎవరైతే బార్‌ దక్కించుకుంటారో.. వారు ఏడాదికి ఒక్కో బార్‌కు రూ.40లక్షల నుంచి రూ.45లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో కొత్త బార్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. వచ్చేది స్థానికసంస్థల ఎన్నికల సమయం కావడంతో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని.. వాటిని దృష్టిలో పెట్టుకుని బార్ల ఏర్పాటుకు ఎక్కువ సంఖ్యలో ముందుకొస్తారని ఆబ్కారీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన చోట్ల లాటరీ పద్ధతిన ఎంపిక చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 40బార్లకు ఒకేసారి అనుమతులు ఇవ్వాలనుకున్నారు. అయితే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో తాజాగా ఇవ్వబోయే నోటిఫికేషన్‌లో ఈ ప్రాంతాలను మినహాయించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే జీహెచ్‌ఎంసీ పరిధిలో 15కొత్తబార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 01:23 AM