రెండేళ్లుగా కోడి పందేలు!
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:13 AM
కోడి పందేల కోసం ప్రత్యేకంగా బరి! కోళ్ల మధ్య పోరును చూసేందుకు చుట్టూ ప్రత్యేకంగా చుట్టూ గ్యాలరీలు! రాత్రుళ్లలోనూ పందేలను వీక్షించేందుకు ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు! పందేలతోపాటు క్యాసినోలో డబ్బులు వెదజల్లే వారి కోసం భారీ స్థాయిలో మద్యం, భోజన ఏర్పాట్లు!

మొయినాబాద్ తొల్కట్టలోని ఫామ్‌హౌస్‌లో
నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ వర్మ
పోలీసుల దర్యాప్తులో వివరాలు వెల్లడి
బీఆర్‌ఎస్ ద్వారా రాజకీయాల్లోకొచ్చే యత్నం
జీహెచ్‌ఎంసీ టికెట్ ఆశించి భంగపాటు
ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడుకుతో స్నేహం
గతంలో క్రికెట్ బెట్టింగ్‌లు.. అప్పట్లోనే కేసు
ఫామ్‌హౌస్ యజమాని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసు
డ్రగ్స్, క్యాసినో అంతర్జాతీయ దొంగలకు బాస్ కేటీఆర్: మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్ సిటీ, మొయినాబాద్, హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కోడి పందేల కోసం ప్రత్యేకంగా బరి! కోళ్ల మధ్య పోరును చూసేందుకు చుట్టూ ప్రత్యేకంగా చుట్టూ గ్యాలరీలు! రాత్రుళ్లలోనూ పందేలను వీక్షించేందుకు ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు! పందేలతోపాటు క్యాసినోలో డబ్బులు వెదజల్లే వారి కోసం భారీ స్థాయిలో మద్యం, భోజన ఏర్పాట్లు! ఇదంతా కూడా మొయినాబాద్ సమీపంలోని తొల్కట్ట ఫాంహౌస్ కేంద్రంగా ఇన్నాళ్లూ జూదక్రీడలు నడిపిన భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ గురించి అయితే ఆయన అక్కడ రెండేళ్లుగా పందేలు నిర్వహిస్తున్నట్లు తేలడం విశేషం! శివ కుమార్ రాజకీయాల్లోకి రావాలని.. నేతగా ఎదగాలని ప్రయత్నాలు చేసి చివరికి కోడి పందేలపై దృష్టి పెట్టి పూర్తిస్థాయిలో అదేపనిలో ఉన్నాడు. ప్రస్తుతం మోకిలలో ఉంటున్న ఆయన 2018లో కేపీహెచ్‌బీలో ఉండేవాడు. అప్పట్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున హైదర్‌గూడ కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకున్నాడు. అప్పటి ప్రభుత్వంలో మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమం కింద రూ.25 లక్షల అంబులెన్స్ వితరణ చేసి రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులకు దగ్గరయ్యాడు. గత సంక్రాంతికి ఏపీలోని భీమవరంలో పెద్ద ఎత్తున జరిగిన కోడి పందేల్లో ప్రముఖ పాత్ర పోషించాడు. పదిరోజుల పాటు అక్కడే ఉన్నాడు.
మూడేళ్ల క్రితం మోకిలకు మారాడు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ ఫాంహౌస్‌లో ఏ రోజు పందేలు జరుగుతాయి? అనే సమాచారాన్ని చేరవేస్తున్నాడు. కోడి పందేలతో వార్తలోకెక్కిన శివ కుమార్ వర్మ, 2018కి ముందు క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించే వాడని తెలిసింది. దీనికి సంబంధించి అతడిపై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత నేతగా ఎదిగేందుకు చేసిన ప్రయత్నాలు చేసి విఫలమవడంతో కోడి పందేలపై దృష్టిపెట్టాడు. బతుకుదెరువు కోసం భీమవరం నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారిలో కొందరి నుంచి శివకుమార్ కోళ్లను కొంటున్నట్లు తెలిసింది. ఆ ఫాంహౌస్‌లో కోడి పందేల కోసం నగరం నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో బడాబాబులు వస్తుంటారని సమాచారం. శివకుమార్ వర్మకు వైసీపీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు, హత్య కేసులో ఇటీవలే జైలుకు వెళ్లిన వ్యక్తితో మంచి స్నేహం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఫాంమౌస్‌పై మంగళవారం పోలీసులు జరిపిన దాడిలో రూ.34 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే జూదరుల వద్ద రూ.కోటి దొరికినట్లు తెలిసింది. ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్న 61మందిలో తొమ్మిది మంది తెలంగాణ వారైతే మిగతావారు ఏపీకి చెందినవారని తెలిసింది. ఇక్కడ 55 కార్లలో జూదరులు, నిర్వాహకులు వచ్చారని.. కార్లలోనే పందేల తాలూకు సామగ్రి తేచ్చారని తెలిసింది. విచారణలో తొల్కట్ట ఫాంహౌస్ యజమాని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. గురువారం శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. తొల్కట్ట ఫాంహౌస్‌ను శ్రీనివాస్ రెడ్డి నుంచి ఏపీ అమలాపురానికి చెందిన వెంకటపతి రాజు అనే వ్యక్తి రెండేళ్ల క్రితం లీజుకు తీసుకున్నాడని.. అక్కడ పందేలు నిర్వహిస్తున్న శివకుమార్ వర్మ వెంకటపతి రాజుకు బంధువు అని తేల్చారు. నగరానికి దూరంగా వ్యవసాయ క్షేత్రంలో పందేలు నిర్వహిస్తే ఎవరికీ అనుమానం రాదనే తొల్కట్ట ఫాంహౌస్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. స్థానిక ప్రజల నుంచి సమాచారం అందడంతోనే పోలీసులు ఫాంహౌస్‌పై దాడిచేశారు. కాగా కోడి పందేల నిర్వహణ ఫాంహౌస్ యజమాని శ్రీనివాస్‌రెడ్డికి తెలిసే జరుగుతోందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
రాష్ట్రంలో జరిగే జూదాలకు కేటీఆర్ నాయకుడు: మహేశ్ కుమార్ గౌడ్
డ్రగ్స్‌కు, క్యాసినో అంతర్జాతీయ దొంగలకు కేటీఆర్ నాయకుడు అని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రాక్షస పాలన చేసిందని.. యువతను మత్తులో చిత్తు చేస్తూ కేటీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే.. ఆయన బినామీలు క్యాసినో, కోడి పందేల దందాలు కొనసాగించారని విమర్శించారు. కేటీఆర్‌కు జోగినపల్లి సంతోష్ తోడయ్యాడని.. వీరు తమ భాగస్వామిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకొని ఆయన ఫాంహౌ స్‌లో దందాలు నిర్వహించారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. జూదం, పార్టీల నిర్వహణను కేటీఆర్, సంతోష్, పోచంపల్లి ప్రఽ దానవృ త్తిగా మార్చుకున్నారని.. విదేశాల్లో మాదిరిగా అత్యాధు నిక హంగులతో క్యాసినోను శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కాగా తెలంగాణను కేటీఆర్ క్యాసినో హబ్‌గా మార్చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన అనుమతితోనే శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌస్‌లో దందాలు జరుగుతున్నాయని.. వాటికి బాధ్యుడు కేటీఆర్ అని ఆరోపించారు. హీరో అయ్యేందుకు కేటీఆర్ జీరో పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.