Harish Rao: రేవంత్ ప్రభుత్వం కొత్త దందా ఇదే.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 02:29 PM
Harish Rao: రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, రూ. 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్‌రావు విమర్శించారు.

సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపు చూస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్‌ను కోరుకుంటున్నారని చెప్పారు. వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ(బుధవారం) సంగారెడ్డి జిల్లాలోని సిద్ధి వినాయక దేవాలయంలో హరీష్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైందని అన్నారు. ఎల్‌ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
జీవో 58, 59ను కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. రైతు రుణమాఫీ, రూ. 4వేల ఫించన్‌తో సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని అన్నారు. 13 లక్షల పేదల పిల్లలకు కల్యాణలక్ష్మీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని చెప్పారు. రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఇతర ఆదాయాలు తగ్గిపోయాయని చెప్పారు. కేసీఆర్ మొక్కలు నాటితే.. రేవంత్ రెడ్డి మాత్రం చెట్లు నరుకుతున్నారని ఆరోపించారు. చివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, అడవిలోని మూగజీవులను చంపిన శాపం రేవంత్‌దేనని హరీశ్‌రావు విమర్శించారు.
కాంగ్రెస్ పాలన ఆగమాగం...
‘ఢిల్లీలో ధర్నా, సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాంధీ రాలేదు. రేవంత్ పాలన ఆగమాగం అయ్యింది.. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు. దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవుడినే రేవంత్ మోసం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది. తెలంగాణలో అన్ని వర్గాలు దివాళా తీశాయి. మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి. ఏడాది తిరగకుండానే లక్షా 50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌ది. పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్‌గా మారింది.. ధాన్యాగారంగా మారింది’ అని హరీశ్‌రావు తెలిపారు.
వారికి రేవంత్ క్షమాపణ చెప్పాలి...
‘ఢిల్లీలో కూడా రేవంత్‌రెడ్డి పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి ఆదేశించిందట ఉపముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటారంట. రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పినట్లే కదా. అక్రమ కేసులు పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్‌సీయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.హెచ్‌సీయూ అడవులు నరికి మూగజీవాల ఉసురు పోసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ అసలు ఇయ్యాల్సింది రూ. 49 వేల కోట్లు, అసెంబ్లీలో చెప్పింది రూ.31 వేల కోట్లు, ఇచ్చింది రూ. 15, 16 వేల కోట్లు కూడా లేదు. మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల భూమి తీసుకొని అక్కడ చెట్లు నరికేశారు. నిన్న హెచ్‌సీయూ 400 ఎకరాల అడవులనూ నరికి మూగజీవుల పాపం కట్టుకున్నాడు. ఏం పాపం చేశాయని మూగజీవాల ఉసురు పోసుకుంటున్నారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మరుసటి రోజు రేవంత్ రెడ్డి లేకుండా టీపీసీసీ అధ్యక్షులతో ఉపముఖ్యమంత్రితో ఫొటోలు దిగారు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు
Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News