Share News

KTR: అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:30 PM

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్‌పై వ్యంగ్య బాణాలు సంధించారు. రేవంత్ రెడ్డికి రోషం లేదన్నారు. కాబట్టే ఆయన అన్ని దులుపుకొని తిరుగుతున్నాడన్నారు.

KTR: అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
BRS Working President KTR

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2014 తర్వాత ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందని ఆయన గుర్తు చేశారు. పువ్వాడ అజయ్ లాంటి ఉత్సాహవంతమైన నాయకుడు ఓడిపోవడం బాధాకరమన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా కూడా ప్రజలకు కష్టం వస్తే బీఆర్ఎస్ నాయకుల గులాబీ దండు ఏడాది కాలంగా వారికి అండగా ఉందని స్పష్టం చేశారు.

ఖమ్మంలో వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చాడన్నారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎంతో కలిసి ముగ్గురు మంత్రులు ఉన్నారని.. కానీ వరదల సమయంలో వాళ్ల వల్ల ఒక్క పైసా కూడా ఉపయోగం లేదని కేటీఆర్ పెదవి విరిచారు. ఒక కుటుంబం వరద నీటిలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి.. వారిని కాపాడాలన్న సోయి సైతం ఈ మంత్రులకు లేదని ఆయన పేర్కొన్నారు.


కానీ ఎమ్మెల్యేల బర్త్ డేలు.. ఇతర పనికి మాలిన పనులకు మాత్రం మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద తగ్గు ముఖం పట్టిన తర్వాతే.. ఖమ్మంలో మంత్రులు పర్యటించారన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఓపెన్ టాప్ జీపులో చేతులు ఊపుతూ.. కాలు కింద పెట్టకుండా అటు ఇటు తిరిగి వెళ్లిపోయాడని వ్యంగ్యంగా అన్నారు.

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు


ప్రజలు తిడుతున్న తిట్లు వింటే పౌరుషమున్న ఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవారని కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కానీ రేవంత్ రెడ్డికి రోషం లేదు కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడన్నారు. మా స్కూటీ ఏమైందని కాలేజీ పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోస పోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలోనే లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయే సరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉన్నారన్నారు.

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం


ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇవ్వాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుంది. డిప్యూటీ సీఎం 30 శాతం కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ కాలేదని చెప్త్తుంటే.. సీఎం మాత్రం మొత్తం రుణ మాఫీ అయిందంటారని కేటీఆర్ వ్యంగ్యంగా ఆరోపించారు.


మంత్రులకి, ముఖ్యమంత్రికి శృతి లేదన్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పారు. బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, సబ్ ప్లాన్ అమలు చేస్తామని, లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని, ఐదు వందల శాతం బీసీ జనాభానను తగ్గించిందని మండిపడ్డారు.


కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5 శాతం ఉంటే రేవంత్ చేసిన కుల గణన సర్వేలో మాత్రం ఐదున్నర శాతం తగ్గించి 46% కి బీసీ జనాభాను చూపిస్తుందని మండిపడ్డారు. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా కేసులు పెట్టి వేధిస్తున్నా.. విచారణల పేరిట పిలిచి జైల్లో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ, ప్రజా సమస్యల మీద రేవంత్ రెడ్డితో కొట్లాడామని.. భవిష్యత్తులో సైతం కొట్లాడుతామని ఈ సంద్భంగా ఆయన స్పష్టం చేశారు.


కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైం అయిపోయిందని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న ఓ మంత్రిని తులం బంగారం ఏమైందని మహిళలు ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉందన్నారు.


పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఈ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే తాను త్వరలోనే ఖమ్మంలో పర్యటిస్తానని పార్టీ కేడర్‌కు ఈ సందర్బంగా మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు.

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 04:57 PM