Share News

‘రాజన్న’ ఆలయ విస్తరణకు శ్రీకారం

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:38 AM

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

‘రాజన్న’ ఆలయ విస్తరణకు శ్రీకారం

సిరిసిల్ల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన పనులపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధ్యక్షతన దేవాదాయ శాఖ మంత్రిత్వ కార్యదర్శి శైలజరామయ్యార్‌, ఓఎస్‌డీ సోమరాజులు, కమిషనర్‌ శ్రీధర్‌ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం విస్తరణ పనులపై చర్చించారు. ఈనెల 15న దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి వేములవాడలో పర్యటించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి పర్యటన చేసి మరోసారి శృంగేరీ పీఠం వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ అర్కిటెక్‌తో తయారుచేయించిన ఆలయ విస్తరణ పనులకు సంబంధించిన నమూనాలను పరిశీలించి కొన్ని మార్పులుచేర్పులు చేసి రెండు రోజుల్లోగా చివరి ప్లాన్‌ తయారుచేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ, దేవాదాయ శాఖ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీలోపు పీఠాధిపతి సూచనలు తీసుకొని 21న టెండర్‌ పక్రియ చేపట్టడానికి ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

శ్రీభీమేశ్వర ఆలయంలో దర్శనాలకు ఏర్పాట్లు

రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జూన్‌ 15 నుంచి భీమేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు, అభిషేకాలు, అన్నపూజలు కోడెమొక్కుబడి మొదలైనవి జరిపించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. జూన్‌ 15లోపు భీమేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని వేద పాఠశాల ముందు స్థలంలో శృంగేరీ శంకరమఠం ఖాళీ స్థలాల్లో తాత్కలిక షెడ్లు ఏర్పాటు చేసి అభిషేకాలు, నిత్య కల్యాణం మొదలైనవి నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ స్థపతి, దుర్గాప్రసాద్‌, దేవస్థానం ఈవో కె వినోద్‌, రాజేష్‌, రఘునందన్‌, శరత్‌కుమార్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:38 AM