జోరుగా నువ్వు సాగు
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:08 AM
నువ్వు సాగులో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ముందు వరసలో ఉంటోంది.

జగిత్యాల, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): నువ్వు సాగులో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ముందు వరసలో ఉంటోంది. జిల్లాలో పసుపు తర్వాత రెండో పంటగా నువ్వులను సాగు చేస్తున్నారు. గత యేడాది జిల్లాలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా నువ్వు సాగు చేసి రాష్ట్రంలోనే జగిత్యాల ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వులను 50 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా జిల్లాలో ప్రతీ యేటా 12 వేల నుంచి 15 వేల ఎకరాల్లో వేస్తున్నారు. ప్రస్తుత యేడాది ఇప్పటికే 10 వేల ఎకరాలకు పైగా నువ్వు పంటను వేశారు. మరో 5 వేల ఎకరాల వరకు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. యాసంగిలో నువ్వు పంట సాగు చేసుకుంటే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. యాసంగిలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పంట పూత దశకు చేరుకుంటే దిగుబడి తగ్గుతుందని, ప్రస్తుతం నువ్వు విత్తుకునేందుకు అనుకూల పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జగిత్యాల తిల్-1 (జెసిఎస్-1020), శ్వేతి తిల్, చందన, హిమ రకాలు అనుకూలంగా ఉంటున్నాయని రైతులు అంటున్నారు. పసుపు పంటను తవ్విన నేలల్లో సాగుచేస్తే లాభసాటిగా ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
నువ్వు సాగుపై రైతుల ఆసక్తి
ఎప్పుడూ ఒకే రకమైన పంటలు సాగుచేసి నష్టపోకుండా తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటల సాగుకు జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో సుమారు 3.70 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను యాసంగిలో సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. రెండో ప్రధాన పంటగా మొక్కజొన్న 24,412 ఎకరాల్లో, తదుపరి ప్రధాన పంటగా సుమారు 15 వేల ఎకరాల్లో నువ్వును పంటను రైతులు సాగు చేస్తున్నారు.
బొంత పురుగు ఆశించే అవకాశం
ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులతో నువ్వు పంటను బొంత పరుగు ఆశించే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పొద్దంతా నేలలో ఉండే పురుగులు రాత్రి పంటలపై దాడి చేస్తాయని పేర్కొంటున్నారు. నివారణకు నోవాల్యురాన్ 1 ఎంఎల్‌ను లీటర్ నీటికి కలిపి సాయంత్రం సమయంలో పంటపై పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.
నీటి యాజమాన్యం
విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వడం వల్ల మొలక బాగా వస్తుంది. తర్వాత సున్నిత దశలైన పూత, కాయ దశల్లో నీరు అవసరం అధికంగా ఉంటుంది. విత్తిన 30-40 రోజుల వరకు పంట పూతకు వస్తుంది. కాయలు గింజలు గట్టి పడటానికి 70 రోజుల సమయం పడుతుంది. మధ్య కాలంంలో నేలలో తగినంత తేమ ఉంటే దిగుబడి బాగుంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
ఆశాజనకంగా పంట
జిల్లాలో సాగవుతున్న నువ్వు పంట ప్రస్తుతం ఆశాజనకంగా ఉంది. జిల్లాలో అధిక దిగుబడి వచ్చే జేసీఎస్ 1020 రకం ఎక్కువ సాగుచేశారని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఈ రకం ఎకరానికి 5-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంటున్నారు. రైతులు గతంలో సాగుచేసే శ్వేత రకం ఎకరానికి కేవలం 4-5 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, జేసీఎల్- 1020 రకం దానికి రెండింతల దిగుబడి వస్తుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. దీంతో ఎకరాకు రూ.50 వేల వరకు ఆదాయం వస్తుందన్న ఆశతో ఉన్నారు.
వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి
-భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
జిల్లాలో ఈ యాసంగిలో ఇప్పటికే 10 వేల ఎకరాల వరకు నువ్వు విత్తారు. ప్రస్తుతం పంట బాగానే ఉంది. రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. యాజమాన్య పద్ధతులతో మంచి దిగుబడి సాధించవచ్చు.