Kavitha: తెలంగాణలో సంగీత దర్శకులు లేరా?
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:43 AM
జయజయహే తెలంగాణ’ గీతానికి ఆంధ్రా వ్యక్తితో సంగీతం చేయిస్తారా? ఇది సరికాదు, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం బాగాలేదని అన్నారు.

‘జయజయహే తెలంగాణ’ ఆంధ్రా వ్యక్తితోనా?
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు
ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు
శాసనమండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, మార్చి15 (ఆంధ్రజ్యోతి): ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఆంధ్రా వ్యక్తితో సంగీతం చేయిస్తారా? ఇది సరికాదు, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం బాగాలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి లేరని, అందుకే ప్రజల మనోభావాలకు అనుగణంగా ఆయన నిర్ణయాలు ఉండటం లేదని, ముఖ్యమంత్రికి తెలంగాణ ఆత్మ లేదని విమర్శించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం వ్యవహరిస్తున్నారని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో కవిత మాట్లాడుతూ.. రికార్డు స్ధాయిలో వరి పండిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారని వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే 2.6 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు కేవలం 64 మెట్రిక్ టన్నుల వరి పండేదని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని, మేడిగడ్డను బూచిగా చూపించి మొత్తం తెలంగాణ పంటలను ఎండబెట్టడం సబబుకాదన్నారు. ఇప్పటికీ సంపూర్ణ రుణమాఫీ కాక అనేక రైతు కుటుంబాలు బాధ పడుతున్నాయని, రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తేనే రైతులందరికీ రుణమాఫీ పూర్తి అవుతుందని, కానీ కేవలం రూ.20 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందని గవర్నర్‌తో చెప్పించి ఆయనను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కళ్యాణలక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇవ్వకుండానే మహాలక్ష్మీ పధకం ఎలా పూర్తవుతుందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు గ్యాస్ సబ్సిడీ సరిగా అందడం లేదని దీనిపై ప్రభుత్వం సమీక్షించాలని ఆమె కోరారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని, ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు.
న్యూసెన్స్ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలి: కవిత
శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యుల వ్యవహారశైలిపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూసెన్స్ చేస్తున్నారా?.. అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును చైర్మన్ అనడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పు పట్టారు. న్యూసెన్స్ వ్యాఖ్యను రికార్డు నుంచి తొలగించాలని చైర్మన్‌ను ఆమె కోరారు. నూసెన్స్ వ్యాఖ్య అన్‌పార్లమెంటరీ అయితే అప్పుడు తొలగిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు.