Share News

Environmental Conservation: కోనోకార్పస్‌ మొక్కలను రక్షించుకుందాం

ABN , Publish Date - Apr 16 , 2025 | 03:48 AM

కోనోకార్పస్‌ మొక్కల రక్షణపై అవగాహన పెంచడం ముఖ్యమైందని నిపుణులు తెలిపారు. ఈ మొక్కలు భూమి ఆరోగ్యాన్ని పెంచడానికి, మట్టి కాంతిని మెరుగుపరచడానికి మరియు వాయు నాణ్యతను కాపాడడంలో సహాయపడతాయి.

Environmental Conservation: కోనోకార్పస్‌ మొక్కలను రక్షించుకుందాం

కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్‌ ఇస్తాయ్‌

ప్రభుత్వం ఈ మొక్కలను నరికితే సుప్రీంకు వెళ్తాం

పర్యావరణ వేత్తలు, ప్రముఖ వృక్ష శాస్త్రవేత్తలు

పంజాగుట్ట, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రయోజనాలను అందిస్తున్న కోనోకార్పస్‌ మొక్కలను రక్షించుకుందామని పర్యావరణవేత్తలు, ప్రముఖ వృక్షశాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షతన మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కోనోకార్పస్‌ (దుబాయ్‌) మొక్కలను రక్షించుకుందాం’ అనే అంశంపై జరిగిన సమావేశంలో శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, యోగివేమన వర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌, కోనోకార్పస్‌ మొక్కపై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో పరిశోధనలు జరిపిన ప్రొఫెసర్‌ ఏఆర్‌ రెడ్డి మాట్లాడుతూ... మొక్కలన్నింటిలో అత్యధిక కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తీసుకొని అత్యధిక ఆక్సిజన్‌ను అందిస్తున్న మొక్క కోనోకార్పస్‌ అని తన పరిశోధనలో తేలిందన్నారు. ఈ మొక్క భూగర్భ జలాలను ఎక్కువ తీసుకుంటుందనే ప్రచారం అవాస్తవమని, నీటి లభ్యతలేని దుబాయ్‌, సౌదీ అరేబియాలో వీటిని విరివిగా పెంచుతున్నారని తెలిపారు. ప్రజలు అపోహలను నమ్మి మంచి ప్రయోజనాలు గల కోనోకార్పస్‌ మొక్కలను నరక వద్దని కోరారు.


ప్రపంచంలో సగటున ఒక మనిషికి 421 మొక్కలుండగా, బ్రెజిల్‌లో 500, అమెరికాలో 470 ఉండగా భారత్‌లో కేవలం 28 మొక్కలు మాత్రమే ఉన్నాయన్నారు. సీసీఎంబీ మాజీ పూర్వ డైరెక్టర్‌ డాక్టర్‌ సీహెచ్‌ మోహన్‌రావు మాట్లాడుతూ.. ప్రతి మొక్క నుంచి అన్ని ప్రయోజనాలు పొందలేమని, కొన్నిపండ్లు, కొన్ని పూలు ఇస్తాయని, మరికొన్ని నీడను, కలపను ఇస్తాయన్నారు. కోనోకార్పస్‌ చెట్లు అత్యధిక ఆక్సిజన్‌ను అందిస్తాయని పేర్కొన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌రావు కోనోకార్పస్‌ మొక్క ఆక్సిజన్‌ పీల్చుకొని కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుందని పేర్కొనడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోనోకార్పస్‌ చెట్లను నరికే కార్యక్రమాన్ని కొనసాగిస్తే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ బీ.ఎన్‌.రెడ్డి, జీవశాస్త్ర నిపుణులు గోపాలకృష్ణ, వీ.ఎన్‌. ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 03:49 AM