Share News

Mahesh Kumar Goud: అధికారం పోయాక బీసీలు గుర్తొచ్చారా?

ABN , Publish Date - Jan 03 , 2025 | 03:15 AM

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీలను వంచించిందని, వారికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.

Mahesh Kumar Goud: అధికారం పోయాక బీసీలు గుర్తొచ్చారా?

  • నా ప్రశ్నలకు జవాబు చెప్పి ధర్నా చేయండి

  • ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ సవాల్‌

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీలను వంచించిందని, వారికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం బీసీలపై కపట ప్రేమ చూపుతూ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. బీసీలకు కాంగ్రెస్‌ పార్టీతోనే మేలు జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు మహేశ్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మద్యం కుంభకోణంలో మరక అంటించుకున్న ఎమ్మెల్సీ కవిత.. బీఆర్‌ఎ్‌సలో ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారని విమర్శించారు. రాజకీయంగా ఉనికి కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కవిత కపట నాటకం మొదలుపెట్టారని, దాంట్లో భాగంగానే ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా జరపాలని నిర్ణయించారన్నారు.


బీసీలు ఈ కుట్రను గమనించి బీఆర్‌ఎస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కవితకు మహేశ్‌గౌడ్‌ పలు ప్రశ్నలు సంధించారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 23 నుండి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా? స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు నిర్ధారించడానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా? మీ బీఆర్‌ఎస్‌ పాలనతో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్‌ను రూ.2971.32 కోట్లకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా? గీత కార్మికుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు, కాటమయ్య రక్షణ పథకాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా? జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5,136 మంది ఉద్యోగులను నియమించినందుకు ధర్నా చేస్తున్నారా? అంటూ మహేశ్‌గౌడ్‌ నిలదీశారు.

Updated Date - Jan 03 , 2025 | 03:15 AM