యథేచ్ఛగా అక్రమ సిట్టింగులు
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:53 AM
హోటళ్లు, దాబాలు నిబంధనల ప్రకారం రాత్రి 10.30 గంటల లోపు మూసి వేయాల్సి ఉండగా హైదరాబాద్- వరంగల్ 163వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటినా యఽథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి.

అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్న దాబాలు, హోటళ్లు
నియంత్రణ లేక ప్రజల అవస్థలు
ఆలేరు రూరల్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): హోటళ్లు, దాబాలు నిబంధనల ప్రకారం రాత్రి 10.30 గంటల లోపు మూసి వేయాల్సి ఉండగా హైదరాబాద్- వరంగల్ 163వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటినా యఽథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి. స్థానికంగా హోటళ్లు, దాబాలు రాత్రి 10.30 గంటలు దాటగానే మూసి వేస్తున్న పోలీసులు జాతీయ రహదారి ఇరుపక్కలా ఉన్న హోటళ్లు, దాబాలు 24 గంటల పాటు కొనసాగుతున్నా ఎందుకు అరికట్టడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అర్ధరాత్రి సైతం హోటళ్లు, దాబాలు కొనసాగుతుండడంతో వాహనాల రద్దీ పెరిగి పలు ప్రమాదాలతో పాటు దొంగతనాలు కూడా చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రి 10.30గంటలు దాటితే జాతీయ రహదారిపై ఉన్న ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించాలన్న, రోడ్డు దాటాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దాటాల్సిందేనని ఆలేరు ప్రజలు వాపోతున్నారు.
నిత్యం రద్దీయే
హైదరాబాద్ నుంచి భూపాలపల్లి వైపు వెళ్లే 163 జాతీయ రహదారి మార్గం నిత్యం పలు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటోంది. అర్ధరాత్రి సైతం ఈ దాబాలు కొనసాగుతుండడంతో జాతీయ మార్గానికి ఇరువైపులా ఉన్న దాబాలు, హోటళ్ల వద్ద పలు భారీ వాహనాలతో పాటు కార్లను, బైకులను ఆపుతుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతే కాకుండా అదే మార్గంలో వెళ్లే పలు వాహనాలు సైతం ఇబ్బందికరంగా మారింది. అర్ధరాత్రి దాటినా ఆలేరులో దాబాలు కొనసాగుతుండడం ఏమిటని పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదేమిటని దాబాల యాజమాన్యాన్ని స్థానికులు ప్రశ్నిస్తే తాము ఎవరికీ భయపడేది లేదంటూ అనడం కొసమెరుపు. ఇక్కడి దాబాల్లో అర్ధరాత్రి కూడా భోజనంతో పాటు మద్యం లభిస్తుండడంతో అక్కడే కూర్చుని మద్యాన్ని సేవిస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలతో పాటు పలు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే
రాత్రి 12గంటలు దాటితే అన్ని దాభాలను మూసివేయిస్తున్నాం. ఆ తర్వాత దాభాలను నడిపిస్తే న్యూసెన్స కింద కేసులను నమోదు చేస్తాం. నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందే. నిబంధనలు పాటిం చని దాభాల యజమానులపై కేసులను నమోదు చేస్తాం.
-రజనీకర్, ఎస్‌ఐ, ఆలేరు