Share News

పంటను కాపాడేందుకు రైతుల పాట్లు

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:38 AM

వట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న వరి పొలాల్లో పశువుల మేతలు.. కొన్నిచోట్ల ఇప్పటికే కరువు ఛాయలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు.

 పంటను కాపాడేందుకు రైతుల పాట్లు

కొన్ని చోట్ల పశువులకు మేతగా వరిచేలు

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): వట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న వరి పొలాల్లో పశువుల మేతలు.. కొన్నిచోట్ల ఇప్పటికే కరువు ఛాయలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పంట చేతికొస్తుందనే దశలో సాగు నీరు అందక కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే అద్దె ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంటలను కాపాడుకునే మార్గం కానరాక కన్నీరు పెడుతూ పశువులకు, గొర్రెలకు మేతగా తమ ఎండిన పంట చేను వదిలిపెట్టారు. భూగర్భజలాలను నమ్ముకుని ఎక్కువ శాతం రైతులు వరికి మొగ్గు చూపారు. తీరా నీటి ఎద్దడి ఏర్పడిన తర్వాత పంటలు ఎండిపోతుంటే అల్లాడి పోతున్నారు.

జిల్లాలో వరిసాగు ఇలా..

జిల్లాలోని 17మండలాల పరిధిలో 2లక్షల 75వేల 316 ఎకరాల్లో వరి సాగును చేశారు. భూగర్భజలాలను నమ్ముకుని ఎక్కువ శాతం రైతులు వరికి మొగ్గు చూపారు. తీర నీటి ఎద్దడి ఏర్పడిన తర్వాత పంటలు ఎండిపోతుంటే అల్లాడి పోతున్నారు. జిల్లాలో దాదాపు 4260ఎకరాల వరి పంట ఎండిపోయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌ తెలిపారు. అయితే ఆరు తడి పంటలు సాగు చేసి ఉంటే ఈ పరిస్థితి మరోలా ఉండేదని ఆయన పేర్కొంటున్నారు.

పంటను కాపాడేందుకు..

రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటడంతో రెండు ఎకరాల్లో వరి సాగు చేసుకున్న రైతు వాటర్‌ ట్యాంకర్‌ నీటితో ఉన్న పంటను కాపాడుకుంటున్నాడు. భువనగిరి మండలంలోని గౌస్‌నగర్‌కు చెందిన రైతు నల్లమాస చంద్రమల్లయ్య మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో రెండు ఎకరాల్లో వరి సాగును చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం బోరు బావుల్లో నీరు ఉండడం, వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ భూగర్భజలాలు రోజు రోజుకూ తగ్గిపోతుండడం ఎలాగైనా వరి చేనును కాపాడుకోవాలనే ఆశతో రోజుకు రూ.2వేలు వెచ్చించి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వాటర్‌ ట్యాంకర్లతో నీటిని పోయించుకుంటున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వస్తుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగి..ఆగి పోస్తున్న బోర్లు

వేసవి వేసవి సమీపిస్తున్న తరుణంలో బావులు, బోర్లలో నీళ్లు ఆగిఆగి పోస్తున్నాయి. దీంతో సాగు చేసిన పంటల పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. భువనగిరి మండలంలోని వీరవెల్లిలో నీరు అందక ఎండిపోయిన నాలుగు ఎకరాల వరి పంటను రైతు బుగ్గ మల్లేశం తన పశువులను ఎండిన వరి చేనుకు మేతగా వదిలేశాడు. దాదాపు రూ.లక్ష వెచ్చించి నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. నెల రోజుల నుంచి భూగర్భజలాలు అడుగంటడంతో బోరు బావి నుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో వరి పైరు ఎండుతోంది. తన పశువులను ఎండిన చేలలో మేపుతున్నాడు. ఎండిన పంటలకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని, బునాదిగాని, కాళేశ్వరం కాల్వలను పూర్తి చేయించి, సాగు నీరు అందించాలని కోరుతున్నాడు.

Updated Date - Apr 15 , 2025 | 01:38 AM