వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:16 AM
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి ఖిల్లా వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

భువనగిరి టౌన, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి ఖిల్లా వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఆలేరుకు చెందిన కే శ్రీధర్‌చారి(21), భువనగిరికి చెందిన రంగాపురం నవదీప్ బైకులపై ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇరువురిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా శ్రీధర్‌చారి చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు శ్రీధర్‌చారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
వేంపాడులో ఎమ్మెల్సీ కోటిరెడ్డి డ్రైవర్...
నిడమనూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వద్ద వ్యక్తిగత డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడ్ సమీపంలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ ఉప్పు సురేష్ తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల నర్సింహ(41) ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వద్ద వ్యక్తిగత డ్రైవరుగా పనిచేస్తూ మిర్యాలగూడలోని బాపూజీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం విధులు ముగించుకున్న నర్సింహ స్వగ్రామమైన ఎర్రబెల్లికి వెళ్లి పొలం పనులు చూసుకుని తిరిగి బైక్‌పై సాయంత్రం నాలుగు గంటల సమయంలో మిర్యాలగూడకు బయలుదేరాడు. నిడమనూరు మండలం వేంపాడ్ సమీపంలో అన్నారం స్టేజీ దగ్గర ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని ఓ వాహనం ఢీకొనడంతో బైక్‌పై ఉన్న నర్సింహ కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నర్సింహ మృతితో ఎర్రబెల్లి, పరిసర గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే నర్సింహ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. నర్సింహ మృతదేహం వద్ద కుటుంబసభ్యులు బోరున విలపించారు. నర్సింహకు భార్య రామేశ్వరి, ఇద్దరు కుమారులు ఈశ్వర్, అజయ్ ఉన్నారు. ఆస్పత్రిలో ఉన్న నర్సింహ మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. నర్సింహ భార్య రామేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.