Share News

Ponguleti: సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:26 AM

ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతి లోపు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.

Ponguleti: సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

  • రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

  • హనుమకొండలో 50ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభం

వరంగల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతి లోపు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఇది వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోనివారు ఉంటే, మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. తొలివిడతలో ఇళ్లు రాకుంటే ఆందోళన చెందవద్దన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో గృహ నిర్మాణాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సమీక్ష నిర్వహించారు. తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.


రాబోయే నాలుగేళ్లలో 20లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల కాలంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో ప్రజలను మభ్య పెట్టిందని పొంగులేటి విమర్శించారు. నిర్మించి వదిలేసిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను జనవరి చివరి నాటికి పంపిణీ చేస్తామన్నారు. నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పూర్తి చేసి ఇస్తామన్నారు. కాగా, జనవరి 26 నుంచి రైతు భరోసా కింద ప్రతీ సంవత్సరం ఒక్కో ఎకరానికి రూ.12వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్నారు. సాగు చేసే భూములకే రైతు భరోసా వర్తిస్తుందని, రియల్‌ ఎస్టేట్‌ భూములకు పెట్టుబడి సాయం ఇవ్వబోమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ 200 ఎకరాల్లో వ్యవసాయం చేస్తే.. ఆయనకు కూడా 200 ఎకరాలకు రైతు భరోసా సాయం అందుతుందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే భూమి లేని పేదలకు కూడా ఏటా రూ.12 వేల సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని పొంగులేటి చెప్పారు. కాగా, హనుమకొండలో 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులను పొంగులేటి ఈ సందర్భంగా ప్రారంభించారు.

Updated Date - Jan 07 , 2025 | 04:26 AM