Share News

Union Budget: తెలంగాణకు ద్రోహం

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:04 AM

కేంద్ర బడ్జెట్‌ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించిం ది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది.

Union Budget: తెలంగాణకు ద్రోహం

  • 1.63 లక్షల కోట్లు అడిగితే.. రూపాయి కూడా ఇవ్వలేదు

  • జీడీపీకి 5% వాటా అందిస్తున్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా?

  • బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా.. నిధులివ్వలేదు

  • సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు

  • సెస్‌ల పెంపుతో రాష్ట్రాల పన్నుల వాటా తగ్గే ప్రమాదం

  • మంత్రులతో సీఎం రేవంత్‌ భేటీ.. బడ్జెట్‌పై తీవ్ర ఆగ్రహం బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్‌ ధర్నా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించిం ది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి 5ు వాటాను అందిస్తున్న తెలంగాణను కేం ద్రం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. రాష్ట్రం నుంచి రూ.26 వేల కోట్ల పన్ను ఆదాయం కేంద్రానికి వెళ్లిందని, 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించి పంపించిందని గుర్తుచేసింది. అయినా.. తెలంగాణకు ప్రధాని మోదీ ద్రోహం చేశారని విమర్శించింది. ఈ బడ్జెట్‌లో కేంద్ర సెస్‌లను మరింత పెం చుకుందని, దానివల్ల రాష్ట్రాల పన్నుల వాటాలు తగ్గే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది. కేంద్ర సౌజన్య పథకాలపై రాష్ట్రాలు ఆధారపడేలా నిధులు పెంచిందని, సీఎ్‌సఎ్‌సలను రాష్ట్రాలు వర్తింపజేసుకోవాలా? లేదా? అన్న స్వయం నిర్ణయాధికారాన్ని విస్మరించిందని విమర్శించింది.


శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై చర్చించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలపై భట్టివిక్రమార్క ఓ పత్రికాప్రకటనను విడుదల చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి ప్రాధమ్యాలను కేంద్రం అర్థం చేసుకోలేకపోయిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. కొన్ని రకాల వస్తువులపై కస్టమ్‌ డ్యూటీని తగ్గిస్తున్నట్లు చెబుతూనే.. కేంద్రం తన సెస్‌లను పెంచుకుందని ఆరోపించింది. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది.


సమాఖ్య సూత్రాలకు విఘాతం

కేంద్ర సౌజన్య పథకాల(సీఎ్‌సఎ్‌స)ల కింద 2024-25లో కేటాయించిన రూ.4,15,356 కోట్ల కంటే ఈసారి బడ్జెట్‌లో 35.5ు నిధులను పెంచి, రూ.5,41,850 కోట్లను కేటాయించడమంటే ఆర్థిక సమాఖ్య సూత్రాలను కేంద్రం తుంగలో తొక్కినట్లయిందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. సీఎ్‌సఎ్‌సలను అమలు చేసుకోవడంపై రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలంటూ పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, ఈ నిధులను పెంచి, కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడేటట్లు చేస్తోందని విమర్శించింది.


అంతా వివక్ష

ఈసారి కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌ రాష్ట్రానికి వివిధ పథకాల కింద అధిక నిధులను కేటాయించిందని, రెవెన్యూ మిగులుతో ఉండి.. కొన్నేళ్లుగా తక్కువ ద్రవ్యలోటును నమోదు చేసుకుంటున్న తెలంగాణను మాత్రం పట్టించుకోలేదని రాష్ట్ర సర్కారు దుయ్యబట్టింది. ఆర్థిక వనరులను అత్యంత సామర్థ్యంతో వినియోగించుకుంటున్న తెలంగాణను ఈ బడ్జెట్‌లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. వివక్ష పూరిత విధానం రాష్ట్ర ప్రగతిశీల ప్రయత్నాలు, విజయాలను కుంగదీస్తాయని ఆక్షేపించింది. ఈ చర్య తెలంగాణకే కాకుండా దేశ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. సాగునీటి ప్రాజెక్టులకు, నీటి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేర్కొంది. అయినా.. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఎలాంటి నిధులను కేటాయించలేదని విమర్శించింది. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి ఊతమివ్వకపోగా... నీటి యాజమాన్య చర్యలను నిర్లక్ష్యం చేసిందంటూ మండిపడింది.


వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు ఊతమేదీ?

కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌లో కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని వరంగల్‌ విమానాశ్రయాభివృద్ధికి నిధులు కేటాయించకుండా విస్మరించిందని రేవంత్‌ సర్కారు ఆరోపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఒకే ఒక ప్రధాన విమానాశ్రయంపై ప్రయాణికుల భారం పెరిగిందని, కనీసం వరంగల్‌ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తే.. ఈ భారం కాస్త తగ్గేదని అభిప్రాయపడింది. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు నిధులు కేటాయిస్తే.. రాష్ట్రాభివృద్ధికి దోహదపడేదని పేర్కొంది. రాష్ట్రంలోని కృత్రిమ మేధ(ఏఐ) ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్‌వీడియా, ఇంటెల్‌, అడోబ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ఏఐ మిషన్‌(టీ-ఎయిమ్‌) భాగస్యామ్యాన్ని ఏర్పరుచుకుని, దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా రాణిస్తుందని వివరించింది. గతంలో కేంద్రం ప్రకటించిన 3 ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలకు నిధులు కేటాయించకుండా రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించింది. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రస్తావనే లేదని ఆక్షేపించింది. బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయించిన రూ.86,000 కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో కేటాయించిన రూ.89,263 కోట్ల కంటే చాలా తక్కువ అని విమర్శించింది. బడ్జెట్‌లో పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమాన్ని ప్రస్తావించిన కేంద్రం.. వారిని ప్రోత్సహించే ఎలాంటి కార్యక్రమాలను నిర్దేశించలేదని తెలిపింది.


రూ.1.63 లక్షల కోట్లు అడిగితే..

బడ్జెట్‌ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయని, గతంలో కంటే 12ు పన్ను ఆదాయం పెరిగినా.. రాష్ట్రంపై చిన్నచూపుతో వ్యవహరించిందని, దీనికి రాజకీయ విభేదాలే కారణమని విమర్శించింది. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా.. తెలంగాణ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించింది. బిహార్‌, ఢిల్లీ, ఏపీ, గుజరాత్‌లకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం కక్ష సాధింపు కాదా? అని ఆక్షేపించింది. తెలంగాణకు వివిధ ప్రాజెక్టులకు గాను రూ.1.63 లక్షల కోట్ల సాయం అవసరమని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా.. రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించింది. తలసరి ఆదాయం, వృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లో మొండిచేయి చూపారంటూ మండిపడింది.


ఇవీ చదవండి:

సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్

ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 04:04 AM