ఆ లెక్క తేలాలి
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:55 AM
రైతుభరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ గురువారం నుంచి షురూ కాబోతోంది. సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించేందుకు అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి.
సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే
నేటి నుంచి 20 వరకు అధికారుల క్షేత్రస్థాయి పర్యటన
21 నుంచి 24 తేదీవరకు గ్రామసభల్లో వివరాల ప్రదర్శన
గ్రామ, మండలస్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు
భరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ షరూ
హైదరాబాద్, జనవరి15(ఆంధ్రజ్యోతి): రైతుభరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ గురువారం నుంచి షురూ కాబోతోంది. సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించేందుకు అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. గ్రామం, రైతులు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలను రైతుభరోసా పోర్టల్‌లోని ఏవో(వ్యవసాయాధికారి) లాగిన్‌లో పొందుపరిచారు. ఈ వివరాల ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో నేటి నుంచి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల బృందాలు ఈనెల 20 తేదీ వరకు పర్యటించనున్నాయి. గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ తహసీల్దారు స్థాయి అధికారులతో బృందాలు ఏర్పాటుచేశారు. అంటే.. వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ... 3 శాఖల అధికారులు సంయుక్త సర్వే చేస్తారు. అలాగే, మండలస్థాయిలో 4నుంచి 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. ఈ బృందాలకు ఎంపీడీవో, తహసీల్దారు, మండల వ్యవసాయాధికారి, ఎంపీవో, అవసరమైతే డిప్యూటీ తహసీల్దారులు సారథ్యం వహిస్తారు.
సర్వేలో గుర్తించేవి ఇవే!
వ్యవసాయభూముల జాబితాలో ఉండి పంటలు సాగుచేయకుండా, స్థిరాస్తి వెంచర్లుగా మారిన భూములు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు ఉన్న భూములు, ఇండ్లు, ఫంక్షన్ హాళ్లు, ఇతరత్రా వ్యాపార సముదాయాలు నిర్మించిన భూములు, పరిశ్రమలు, మైన్స్ ఏర్పాటుచేసిన భూములు, అభివృద్ధి పనులకోసం ప్రభుత్వం సేకరించిన భూములను ఐదు రోజుల పాటు జరిగే సర్వేలో గుర్తిస్తారు. 21- 24వ తేదీ దాకా గ్రామసభలు నిర్వహించి సర్వేలో సేకరించిన వివరాలను ప్రదర్శించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈనెల 26న రైతుభరోసాను ప్రారంభించనున్న నేపథ్యంలో 24, 25 తేదీల నాటికి అనర్హుల తుది జాబితా రూపొందిస్తారు. 24వ తేదీ ప్రభుత్వానికి సర్వే నివేదిక చేరుతుంది. ఆ వివరాలను క్రోడీకరించి 25వ తేదీకి తుది జాబితా సిద్ధం చేస్తారు.