Hyderabad Outer Ring Road: ఔటర్‌పై టోల్ పెంపు
ABN , Publish Date - Apr 01 , 2025 | 04:44 AM
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే సంస్థ టోల్ చార్జీలను 4-5% పెంచింది. అలాగే, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిలో టోల్ చార్జీలను ఎన్‌హెచ్‌ఏఐ తగ్గించింది. టోల్ చార్జీల పెంపు మరియు తగ్గింపు వివిధ వాహనాలపై అనుసరించబడుతుంది.

కి.మీ.కు 4-5ు పెంచుతూ నిర్ణయం
సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి
హైదరాబాద్-బెజవాడ హైవేపై తగ్గింపు
రూ.10 నుంచి 60 వరకు తగ్గిన ధర
హైదరాబాద్ సిటీ/కేతేపల్లి/చౌటుప్పల్ రూరల్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ చార్జీలు పెరిగాయి. కి.మీ.కు 4-5శాతం మేర పెంచుతూ ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్ణయించింది. సాధారణ మోటారు వాహనాలకు ప్రస్తుతం కి.మీ.కు రూ.2.34 పైసలు వసూలు చేస్తుండగా, పెంచిన ధర ప్రకారం రూ.2.44 పైసలు వసూలు చేయనున్నారు. కార్లకు పది పైసలు, భారీ వాహనాలకు 69 పైసల మేర పెంచారు. పెంచిన టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. పెరిగిన చార్జీలకు అనుగుణంగానే రోజు వారీ, నెలవారీ పాస్‌ల ధరలు ఉంటాయని.. మరిన్నీ వివరాలకు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. 2023 ఆగస్టులో ఐఆర్‌బీ సంస్థ రూ.7,360 కోట్లకు ఒప్పందం చేసుకుని 30 ఏళ్లకు ఔటర్‌ను లీజు తీసుకుంది. ఏటా టోల్ చార్జీలను పెంచుకునేలా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అందుకనుగుణంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గతేడాది ఏప్రిల్ 1న టోల్ చార్జీలను పెంచారు. అప్పట్లో కి.మీ.కు 7 పైసల నుంచి 53 పైసల మేర పెంచారు.
విజయవాడ మార్గంలో తగ్గింపు..
తెలుగు రాష్ట్రాలను కలిపే విజయవాడ-హైదరాబాద్ 65వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తీపి కబురు చెప్పింది. ఈ మార్గంలో టోల్ రుసుమును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు తగ్గిన ధరలు అమలులో ఉంటాయి. ఏటా 10 శాతం మేర పెరిగే టోల్‌చార్జీలు ఈ ఏడాది ఆ మేర తగ్గనున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 181.5 కి.మీ. మేర రెండు లేన్లుగా ఉన్న ఈ రహదారిని దాదాపు రూ.2వేల కోట్లతో 13 ఏళ్ల క్రితం జీఎంఆర్ సంస్థ బీవోటీ పద్ధతిలో నిర్మించింది.
ఆ వ్యయాన్ని రాబట్టుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో కృష్ణా జిల్లాలోని చిల్లకల్లు వద్ద మూడు టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేసింది. 2012 డిసెంబరు 20 నుంచి టోల్‌చార్జీల వసూలును ప్రారంభించింది. జాతీయ రహదారి విస్తరణ పనుల విభాగం సూచించిన నిబంధనల మేరకు వార్షిక సవరణల పేరిట నిర్మాణ సంస్థ ఏటా టోల్ చార్జీలను పెంచుకునే వీలుంది. అయితే గతేడాది జూన్ 31 నుంచి జీఎంఆర్ సంస్థ రహదారి నిర్వహణ, టోల్ వసూళ్ల బాధ్యతల నుంచి తప్పుకుంది. దీంతో జూలై 1 నుంచి టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణ బాధ్యతలను ఎన్‌హెచ్‌ఏఐ వివిధ ఏజెన్సీల ద్వారా నిర్వహిస్తోంది. గతంలో జీఎంఆర్ సంస్థ నిర్వహణలో ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్‌చార్జీలను పెంచుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ టోల్ రుసుము వసూలు చేస్తుండటంతో చార్జీల పెంపునకు బదులు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా మంగళవారం నుంచి టోల్ చార్జీలను తగ్గించి వసూలు చేయనున్నారు. వాహనాల సామర్థ్యం ఆధారంగా ఒక్కో వాహనానికి ఒకవైపు, ఇరువైపులా కలిపి కనిష్ఠంగా రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.60 మేర చార్జీలు తగ్గనున్నాయి. కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.10, ఇరువైపులా ప్రయాణానికి రూ.15.. బస్సు, ట్రక్కులకు ఒక వైపునకు రూ.20, ఇరువైపులా కలిపి రూ. 25.. 7 యాక్సిల్‌పైన ఉండే భారీ వాహనాలకు ఒక వైపునకు రూ.40, ఇరువైపులా కలిపి రూ.60 వరకు తగ్గాయి. అయితే, టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలోని గ్రామాల వాహనాలకు నెలవారీ పాస్ చార్జీ రూ.10 పెరిగింది. నిత్యం ఈ రహదారిపై దాదాపు 17-20 వేల వరకు వాహనాలు వెళతాయి. పండుగలు, సెలవు రోజుల్లో ఆ సంఖ్య 10 వేలు అదనంగా ఉంటుంది.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News