KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 04 , 2025 | 04:59 AM
టాలీవుడ్ నిర్మాత బోడేపూడి కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి(44) సోమవారం గోవాలో ఉరివేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డారు. కబాలితోపాటు తమిళంలో రీమేక్ చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.

ఇంజనీర్ నుంచి సినిమాల వైపు
నష్టాలతో ఆర్థిక సమస్యలు.. డ్రగ్స్‌కు బానిస
అరెస్టు.. జైలు.. బయటకొచ్చి గోవాలో క్లబ్
అక్కడా నష్టాలే.. ఉరి వేసుకొని ఆత్మహత్య
డ్రగ్స్ ముఠాలతో ఉన్న లింకులపై దర్యాప్తు
కేపీ స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్
హైదరాబాద్ సిటీ, బోనకల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): టాలీవుడ్ నిర్మాత బోడేపూడి కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి(44) సోమవారం గోవాలో ఉరివేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డారు. కబాలితోపాటు తమిళంలో రీమేక్ చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ డ్రగ్ కేసులో జైలుకు వెళ్లిన కేపీ చౌదరి.. బెయిల్‌పై బయటకు వచ్చాక, గోవాకు వెళ్లారు. అక్కడి సియోలిమ్ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సోమవారం ఆయన ఉరివేసుకుని, ఆత్మహత్య చేసుకున్నట్లు గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ మీడియాకు తెలిపారు. ‘‘చౌదరికి గతంలో డ్రగ్స్ ముఠాలతో లింకులున్నట్లు సమాచారం ఉంది. గోవాలో ఆయన కాంటాక్ట్‌లో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నాం’’ అని ఆయన వివరించారు. కాగా.. 2023లో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు కేపీ చౌదరిని ఓ డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే..! అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో చౌదరి అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన కేపీ చౌదరి.. గోవాలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. కేపీ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయనపేట. ఆయన తండ్రి బోడేపుడి శేషగిరిరావు లాయర్‌గా.. తల్లి విజయ పాల్వంచలో ఉపాధ్యాయురాలిగా సేవలందించారు.
కేపీ చౌదరి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేసి, పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డైరెక్టర్(ఆపరేషన్స్)గా పనిచేశారు. 2016లో ఆ ఉద్యోగాన్ని వీడి.. సినీపరిశ్రమ వైపు అడుగులు వేశారు. పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. సినీ రంగంలో ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడంతో గోవాకు మారిపోయారు. అక్కడ ఓహెచ్‌ఎం క్లబ్‌ను ఏర్పాటు చేసి.. హైదరాబాద్ నుంచి వచ్చే సెలబ్రిటీల కోసం పార్టీలు నిర్వహించేవారు. క్లబ్ వ్యాపారంలోనూ నష్టాలు రావడంతో.. 2023లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పట్లోనే 100 షీట్ల కొకైన్‌ను వెంట తెచ్చుకున్నారు. ఈ క్రమంలో 2023 జూన్ 14న పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్‌వోటీ పోలీసులు అతని నుంచి 90 షీట్ల కొకైన్‌ను సీజ్ చేశారు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాక.. మళ్లీ గోవాకు వెళ్లిపోయారు. కేపీ చౌదరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్టయ్యాక.. ఆయన కాల్‌లి్‌స్టలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులతోపాటు.. మొత్తం 800 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 300 మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. రాజకీయ నాయకుల్లో అప్పటి అధికార పార్టీకి చెందిన ప్రముఖులు ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో.. దర్యాప్తు అధికారులు ఓ దశలో తలలు పట్టుకున్నట్లు తెలిసింది. దాంతో.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఎవరికి వారు.. ‘‘మాకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం..!
నేడు ఖమ్మం జిల్లాకు భౌతికకాయం
కేపీ చౌదరి తండ్రి మూడేళ్ల క్రితం చనిపోగా.. తల్లి రాయనపేటలో ఉంటున్నారు. కేపీ చౌదరికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని తీసుకురావడానికి మేనమామలు గోవా వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.
అన్నా వెనక్కొచ్చేయ్: సుప్రీత
కేపీ మరణంపై నటి సురేఖవాణి కూతురు సుప్రీత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘‘నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాం అన్నా. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? నీ బాధలు నేను వినడానికి లేకుండా చేశావు. వెనక్కొచ్చేయ్ అన్నా.. నీ కోసం ఈ చెల్లి ఎదురుచూస్తోంది. నీ కోసం ఎప్పటికీ నేనుంటా. నువ్వు ఎక్కడ ఉన్నా టైగరే అంటావుగా. లవ్ యూ సో మచ్ అన్నా. నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా’’అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News