Share News

Ugadi Tragedy: ముగ్గురు పిల్లలు, సవతి తల్లి మృత్యువాత

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:03 AM

ఉగాది పండుగ రోజున కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలను కాపాడబోయి తల్లి సహా నలుగురు చెరువులో మునిగి మృతి చెందారు. కుటుంబ కలహాల కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Ugadi Tragedy: ముగ్గురు పిల్లలు, సవతి తల్లి మృత్యువాత

కామారెడ్డి జిల్లా వెంకటాపూర్‌లో

ఉగాది పండుగ రోజున ఘోరం

చెరువులో పడి నలుగురి మృతి

ప్రమాదమా? ఆత్మహత్యా? హత్యా?

అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు

పోలీసుల అదుపులో పిల్లల తండ్రి

ఎల్లారెడ్డి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ వేళ ఓ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. సవతి పిల్లలను కాపాడబోయి వారితో పాటు ఆ తల్లి కూడా మృత్యువాత పడింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు పంచాయతీ వెంకటాపూర్‌ అగ్రహారంలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన బొమ్మర్ది లింగయ్యకు గతంలో మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన శ్యామలతో వివాహం అయింది. కూతుళ్లు మైథిలి, అక్షర, కుమారుడు వినయ్‌ పుట్టిన కొన్నాళ్లకు శ్యామల అనారోగ్యంతో చనిపోయింది. దాంతో లింగంపేట్‌ మండలం షెట్‌పల్లికి చెందిన మౌనికను లింగయ్య వివాహం చేసుకున్నాడు. మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. లింగయ్య కూలి పనులు చేసుకుంటూ తండ్రి లక్ష్మయ్య, భార్య మౌనిక(26), ఇద్దరు కూతుళ్లు మైథిలి(10), అక్షర(9), కుమారుడు వినయ్‌(7)లతో కలిసి జీవిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం మౌనిక చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్తుండగా పిల్లలు కూడా వెళ్లారు. మౌనిక పని చేసుకుంటుండగా చెరువులో స్నానానికి దిగిన పిల్లలు మునిపోతుండడంతో వారిని కాపాడబోయి మౌనిక కూడా నీట మునిగింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి చూడగా గట్టున వారి చెప్పులు, బట్టలు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించగా .. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ రవీందర్‌నాయక్‌, ఎస్సై మహేష్‌ గజ ఈతగాళ్లతో వెతికించి ఆదివారం తెల్లవారుజామునకు నలుగురి మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వినయ్‌ గ్రామంలో రెండవ తరగతి చదువుతుండగా మైథిలి, అక్షర మెదక్‌లోని ఓ ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్నారు. ఉగాది పండుగకు ఇంటికి వచ్చిన పిల్లలు మృత్యువాత పడడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.


ఆత్మహత్యా?.. హత్యా? అన్న కోణంలో విచారణ:

తల్లి, పిల్లల మరణాలపై అనుమానాలున్నట్లు గ్రామంలోని కొందరు చర్చించుకుంటున్నారు. మౌనికకు భర్త లింగయ్యకు మధ్య కుటుంబ కలహాలుండేవని అంటున్నారు. ఈ క్రమంలో తల్లి, పిల్లల మరణాలు ప్రమాదవశాత్తు సంభవించినవా?? లేక ఆత్మహత్యా? లేక హత్యా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లింగయ్యను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 06:03 AM