Share News

త్వరలో తెలుగు మాండలికాల గ్రంథస్థం

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:15 AM

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి.

త్వరలో తెలుగు మాండలికాల గ్రంథస్థం

  • తెలుగునాటక రంగాన్ని కాపాడతాం: ఏపీ మంత్రి దుర్గేశ్‌

  • రాజమహేంద్రిలో ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు

రాజమహేంద్రవరం/రాజానగరం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. శుక్రవారం చివరి రోజు కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ తెలుగుభాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారని, కిందస్థాయి నుంచి తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టడం కోసం త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.


గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో తెలుగుభాష అడుగంటి పోయిందని, ఆంగ్ల మాధ్యమం బూచీని చూపించి తెలుగుభాషను పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే తెలుగు భాష పరిరక్షణకు శ్రీకారం చుట్టిందని, త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు మాండలికాలను సేకరించి గ్రంథస్థం చేయించి భావితరాలకు అందిస్తామని చెప్పారు. తెలుగునాటక రంగాన్ని కాపాడతామని, నంది నాటకాలు ప్రారంభించి, పౌరాణిక నాటకాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 04:15 AM