Share News

Myanmar earthquake: భూకంపాలను ముందే పసిగట్టేస్తా

ABN , Publish Date - Apr 02 , 2025 | 03:43 AM

మయన్మార్‌ భూకంపాన్ని ముందుగానే గుర్తించిన యువ ఇంజనీరు శివ సీతారామ్‌ స్వయంగా రూపొందించిన అల్గారిథమ్‌ ద్వారా భూప్రకోపాన్ని ముందస్తుగా అంచనా వేసి హెచ్చరికలు అందించారు. 19 ఏళ్ల పరిశోధనల తర్వాత, ఆయన ఈ విధానాన్ని అభివృద్ధి చేసారు.

Myanmar earthquake: భూకంపాలను ముందే పసిగట్టేస్తా

మయన్మార్‌ భూకంపం గురించి ముందే చెప్పా

ముందస్తు గుర్తింపునకు ప్రత్యేక అల్గారిథమ్‌

5 వేల కిలోమీటర్ల దూరంలోనూ అంచనా వేయొచ్చు

వారం-నెల ముందే గుర్తించవచ్చు

100 అంచనాలలో 18 నిజమయ్యాయి

త్వరలో ధర్మశాల, తవాంగ్‌లో..భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం

యువ ఇంజనీర్‌ శివ సీతారామ్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మయన్మార్‌ భూకంపం మూడు వేలమందిని బలిగొంది. ఆకాశ హార్మ్యాలు పేక మేడల్లా కూలిపోయాయి. అయితే.. తుఫానులు, సునామీల మాదిరిగానే.. భూకంపాలనూ ముందుగానే గుర్తించే వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. సరిగ్గా ఇదే ఆలోచనతో పనిచేసిన యువ ఇంజనీరు శివ సీతారామ్‌ ఇప్పుడు భూప్రకోపాన్ని ముందస్తుగా గుర్తించగలుగుతున్నారు. ఇందుకోసం ఎన్నో పరిశోధనలు చేసిన ఆయన.. సొంతంగా ఓ అల్గారిథమ్‌ను రూపొందించుకుని, హెచ్చరికలు చేస్తున్నారు. తన వెబ్‌సైట్‌ జ్ట్టిఞట://ఠీఠీఠీ. ట్ఛజీటఝౌ.జీుఽ/ లో.. ముందస్తు అంచనాలను పోస్టు చేస్తున్నారు. మయన్మార్‌ భూకంపంపైనా ఆయన నెల రోజుల ముందే హెచ్చరికలు చేశారు. ఈ అల్గారిథమ్‌ కోసం 19 ఏళ్లు పరిశోధించిన శివ సీతారామ్‌తో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆయన ఇంటర్వ్యూ వివరాలు..

ముందుగానే భూకంపాలను అంచనా వేయడం ఎలా సాధ్యం?

సాధ్యం కానిదేదీ లేదు. ఒకప్పుడు చంద్రుడి పైకి వెళ్లడం అసాధ్యమనుకున్నారు. ఇప్పుడు అది సాధ్యమైంది కదా? 2004లో సునామీ తర్వాత.. నాకు భూకంపాలను ముందుగానే అంచనా వేయాలనే ఆలోచన వచ్చింది. 2005లో జమ్మూకశ్మీర్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత.. నా పరిశోధనలు మొదలయ్యాయి. 2017 వరకు దీనిపై పనిచేస్తూ.. ప్రత్యేక అల్గారిథమ్‌ను రూపొందించా. దీని ద్వారా కచ్చితత్వంతో భూంకపాలను అంచనా వేస్తున్నా.

ఎన్ని రోజుల ముందు గుర్తించొచ్చు?

ప్రపంచవ్యాప్తంగా భూభౌతిక శాస్త్రవేత్తలు కొన్ని సెకన్ల ముందే భూకంపాలను గుర్తిస్తున్నారు. నా అల్గారిథమ్‌ మాత్రం ఎక్కడ.. ఎంత తీవ్రతతో భూకంపం వస్తుందో నెలరోజుల ముందే చెబుతుంది. నా అంచనాల్లో 100కు 18 నిజమయ్యాయి. పరిశోధనల్లో ఇది మంచి సక్సెస్‌ రేటుగా చెప్పవచ్చు. 2023 నేపాల్‌ భూకంపం, ఈ ఏడాది జనవరిలో టిబెట్‌, జపాన్‌ భూకంపాలను ముందుగానే అంచనా వేశాను. చిన్న భూకంపాలను కాకుండా.. తీవ్రత 5 కంటే ఎక్కువ ఉండే వాటినే గుర్తించగలుగుతున్నాం. 2020 నుంచి నేను గుర్తించిన అంచనాల డాటా నా వెబ్‌సైట్‌లో ఉంది.


ధర్మశాలలో భూకంపం అని మీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు కదా..?

అవును. నా అల్గారిథమ్‌ తదుపరి అంచనా ధర్మశాల. అక్కడ 7 అంత కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వచ్చే ప్రమాదముంది. తవాంగ్‌ రీజియన్‌లో కూడా భూమి ప్రకోపించనుంది. ఈ రెండూ కొన్ని నెలల్లో జరగవచ్చు. అయితే.. సమయం, తేదీల విషయంలో కచ్చితత్వం రావాల్సి ఉంది.

ప్రకృతి కూడా ముందే హెచ్చరిస్తుందా?

అవును.. ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తుంది. భూకంపం రావడానికి మూడు నుంచి ఆర్నెల్ల ముందుగానే ఆ సూచనలు అందుతాయి. శాస్త్రవేత్తలకు కూడా ఆ విషయం తెలుసు. అయితే, ఆ సూచనలను పసిగట్టి, నిజంగానే విపత్తు వస్తుందా అని చెప్పడం కష్టమే..! మేము 20 అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. వాటిల్లో కీలకమైనది భూమిలోంచి రాడాన్‌, మిథేన్‌ గ్యాస్‌ విడుదలవ్వడం. విద్యుదయస్కాంత తరంగాల్లో హెచ్చుతగ్గులుండడం. భూమి లోపల లావా నిరంతరం ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ ఒత్తిడిని భరించలేనప్పుడు భూ ఫలకాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీంతోపాటు.. వాతావరణంలో మార్పులను పరిగణనలోకి తీసుకుంటాం. ఇలా భారత్‌తోపాటు.. 50 దేశాల్లో భూకంపాలను ముందుగానే అంచనా వేయగలుగుతున్నాం.


గ్రహాల కూటమికి.. భూకంపాలకు సంబంధముందా?

గ్రహాల కూటమి వల్ల ప్రకృతిలో మార్పులు వస్తాయి. కానీ, భూకంపాలు వస్తాయని కచ్చితంగా చెప్పలేం.

ప్రభుత్వ/ప్రైవేటు సహకారం ఉందా?

నేను సొంతంగానే పరిశోధనలు చేస్తున్నా. నా అంచనాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వానికి 70-80ు కచ్చితత్వంతో ఉన్న అంచనాలు కావాలి. నా అల్గారిథమ్‌ ఆ స్థాయికి చేరేలా పరిశోధనలు చేస్తున్నాం. అయితే.. నా కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది. హైదరాబాద్‌ సైనిక్‌పురిలో సెసిమో రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి, పరిశోధనలు చేస్తున్నా. దేశంలో మూడు చోట్ల అబ్జర్వేటరీలున్నాయి. నా పరిశోధనలు నచ్చి, కొందరు నిధులను సమకూరుస్తున్నారు.

డిప్లొమా చేసి ఈ స్థాయిలో పరిశోధనలెలా?

మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు. సీఆర్‌రెడ్డి కాలేజీలో పాలిటెక్నిక్‌ డిప్లొమా(మెకానికల్‌ ఇంజనీరింగ్‌) చేశాను. సైయెంట్‌ సంస్థలో కొన్నాళ్లు పనిచేశాను. పరిశోధనల కోసం 2014-15లో ఉద్యోగం మానేశాను. 2018 తర్వాత పూర్తిస్థాయిలో పరిశోధనలకు అంకితమయ్యాను.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..

జీవితాంతం సమాజం కోసమే

For More AP News and Telugu News

Updated Date - Apr 02 , 2025 | 03:43 AM