Sangareddy: ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ
ABN , Publish Date - Apr 05 , 2025 | 05:44 AM
ఎన్‌వోసీ జారీ చేసేందుకు రూ. పది లక్షల లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నీటిపారుదల శాఖ ఏఈ రవికిషోర్ ఏసీబీకి చిక్కారు. పటాన్‌చెరులోని నీటిపారుదల శాఖ డివిజనల్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎన్‌వోసీ జారీకి రూ. 10 లక్షలు డిమాండ్
రూ. లక్ష తీసుకుంటుండగా పట్టివేత
పటాన్‌చెరు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : పటాన్‌చెరు, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : ఎన్‌వోసీ జారీ చేసేందుకు రూ. పది లక్షల లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల నీటిపారుదల శాఖ ఏఈ రవికిషోర్ ఏసీబీకి చిక్కారు. పటాన్‌చెరులోని నీటిపారుదల శాఖ డివిజనల్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుమ్మడిదల గ్రామ శివారులో సంతోష్ అనే వ్యక్తి తన 4,400 గజాల స్థలానికి ఇటీవల ప్రహరీ నిర్మించాడు. పక్కనే చిన్న నాలా ప్రవహిస్తుండటంతో డ్రైనేజీని నిర్మించాడు. గత నెల 28న మండల నీటిపారుదల శాఖ ఏఈ రవికిషోర్ సదరు స్థల యజమానినిహైడ్రా పేరు చెప్పి బెదిరించాడు. నిబంధనలకు విరుద్ధంగా నాలాను కబ్జా చేసి ప్రహరీనిర్మించారని, దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేసి కూల్చి వేయిస్తామన్నాడు. ఇదంతా జరగకూడదంటే రూ. పది లక్షలు ఇస్తే, నాలాకు ఎన్‌వోసీ జారీ చేస్తామని చెప్పాడు. పలు దఫాలుగా జరిపిన చర్చల్లో రూ.7 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.
తరువాత స్థల యజమాని ఎన్‌వోసీకి దరఖాస్తు చేసుకున్నాడు. ముందస్తుగా రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేయడంతో శుక్రవారం ఉదయం బాధితుడు హైదరాబాద్ ఏసీబీ విభాగాన్ని ఆశ్రయించాడు. తరువాత పటాన్‌చెరు డీఈ కార్యాలయం వద్దకు చేరుకున్న బాధితుడు ఏఈ రవికిషోర్‌ను కలుసుకుని రూ. లక్ష చెల్లిస్తానన్నారు. కార్యాలయంలో వద్దని బయట తన సిల్వర్ కలర్ స్కోడా కారు ముందు సీట్లో కూర్చుని డ్యాష్ బోర్డులో పెట్టాలని సూచించారు. వెనక సీట్లో కూర్చున్న రవికిషోర్ సూచనల మేరకు రెండు రూ.500 నోట్ల కట్టలను డ్యాష్ బోర్డులో పెట్టాడు. కార్యాలయం ఆవరణలో మాటు వేసి చూస్తున్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రవికిషోర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ.. ఏఈ రవికిషోర్ ఎన్‌వోసీ జారీ చేసేందుకు లంచం రూపంలో రూ. లక్ష తీసుకున్నానని అంగీకరించినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారం అంతటినీ వీడియో తీశామని తెలిపారు. ఏఈని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు.