తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అందరి చూపు తెలంగాణపైనే ఉంది. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? లేదంటే కమలం వికసిస్తుందా..? అని తెలుసుకోవడానికి ఔత్సాహికులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఓటర్లు ఎటు వైపు ఉన్నారు..? పోలింగ్ ఎప్పెడప్పుడు జరుగుతుందా..? ఫలితాలు ఎప్పుడొస్తాయా..? అని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల దృష్టి ఈ ఎన్నికలపైనే ఉంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీయేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాస్త సీట్లు తగ్గినా సరే హ్యాట్రిక్ కొట్టి తీరుతామని బీఆర్ఎస్ ధీమాగా ఉండగా.. ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి కేసీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చోనివ్వమని బీజేపీ, కాంగ్రెస్ శపథాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, ఎంఐఎంలు బరిలో ఉన్నాయి.
119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణకు నవంబర్-30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్-03న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టోతో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. 2014 నుంచి అధికారంలో ఉన్నాం.. అభివృద్ధి చేశాం.. మళ్లీ అధికారంలోకి వస్తామని అధికారపార్టీ బీఆర్ఎస్ అంటోంది. అయితే తెలంగాణ ఇచ్చాం.. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని.. అభివృద్ధి, సంక్షేమం ఏ స్థాయిలో ఉంటుందో చేసి చూపిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఒక దశలో బీఆర్ఎస్‌కు బీజీపీయే ప్రత్యామ్నాయమని.. అధికారంలోకి వస్తున్నామని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. హంగ్ వచ్చినా సరే అధికారంలోకి వచ్చేది మాత్రమే బీజేపీయేనని ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలు తెలంగాణ వేదికగా ప్రకటనలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తెలంగాణ ఓటరు ఎటువైపు ఉన్నారు..? ఎవర్ని గెలిపిస్తారో చూడాలి.