Abn logo
Jun 8 2021 @ 00:32AM

జ్ఞానభ్రాంతికి ఆనందయ్య ‘మందు’

ఏది సత్యం, ఏదసత్యం? ఏది సైన్సు, ఏది కాదు? ఆయుర్వేదం వంటి సంప్రదాయ, దేశీయ వైద్య విధానాలని పాశ్చాత్య వైద్యప్రమాణాలతో పరీక్షించటం ఎంతవరకు శాస్త్రీయం? ఆ మాటకొస్తే పాశ్చాత్య వైద్యం శాస్త్రప్రమాణాలమేరకే నడుస్తోందా? అసలు మొత్తం శాస్త్రీయపరిశోధనా రంగమే వ్యాపారప్రయోజనాలవల్ల కలుషితమయినందువల్ల నకిలీ జ్ఞానమే అసలైన సైన్సుగా చెలామణీ అవుతుందనీ, ఆ కారణంగా మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందనీ అంతర్జాతీయ స్థాయి సైంటిస్టుల హెచ్చరికలు మనదాకా ఎందుకు చేరటంలేదు? శాస్త్రీయదృక్పథం లేదంటూ సగటు మనిషినీ, దేశీయవైద్యాలనీ చిన్నచూపు చూడటం సమంజసమేనా?

ఆనందయ్య తెలిసో తెలియకో ఇలాంటి చాలా ప్రశ్నలే లేవనెత్తాడు. పెద్ద చర్చకే తెరతీశాడు. ఐతే మనమేం చేశాం? ఎప్పట్లాగే చర్చని పక్కకి నెట్టాం. సైద్ధాంతిక ముష్టియుద్ధాలకి దిగాం. మేధోబలప్రదర్శనలకి తెగబడ్డాం. తీర్పులు తీర్చాం. ఎప్పట్లాగే సత్యాన్నీ మనిషినీ సమాధి చేశాం. ఈ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే కొన్ని వాస్తవాల్ని ప్రస్తావించాలి.

(1) 2011లో Don Poldermans అనే ఒక డచ్ డాక్టర్ scientific misconduct ఆరోపణల మీద పదవి నుండి తొలగించబడ్డాడు. Non-cardiac surgeryల్లో Betablockers వాడవచ్చని నిర్ధారిస్తూ అతను పబ్లిష్ చేసిన ఫలితాలన్నీ తప్పుడు లెక్కలూ తప్పుడు పరిశోధనల ఆధారంగా నిరూపించబడినవేనని తేలింది. ఆ పరిశోధనలని ప్రామాణికంగా చేసుకొని జరిగిన సర్జరీల వల్ల ఒక్క యూరోప్‌లోనే ఎనిమిది లక్షలమంది చనిపోయినట్టు లెక్క తేల్చారు. (2) ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకి adverse drug reactions ఒక ప్రధానమైన కారణం. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏటా లక్షా ఎనభై వేలమంది preventable medical errors వల్ల చనిపోతున్నారని Centre for disease control అంచనా వేసింది. (3) 2009, 2014 మధ్య ఐదేళ్ళ కాలంలో అమెరికాలోని పది అతి పెద్ద ఫార్మా కంపెనీలు తాము పాల్పడ్డ మోసాలగ్గాను కట్టిన జరిమానాలు అక్షరాలా 14 బిలియన్ డాలర్లు.

తవ్వుకుంటూపోతే పరిశోధనల్లో నిగ్గుతేలిన ఇట్లాంటి నిజాలెన్నో బయటపడతాయిగానీ, విడిగా చూస్తే అవన్నీ చెదురుమదురు పొరబాట్లుగానే కనిపిస్తాయి. ఇదంతా ఫార్మాకంపెనీల కుట్రలేతప్ప మెడికల్ సైన్సు భద్రంగానే ఉందన్న భ్రమని కల్పిస్తాయి. కొంచెం లోతుగా పరిశీలిస్తేగానీ, అసలు సమస్య అవినీతిమయమైన వ్యక్తులూ, సంస్థలూ కాదు, అవినీతిమయమైన సైంటిఫిక్ రీసెర్చ్ అని అర్థం కాదు. 

అసలేం జరుగుతుందో చూద్దాం. ఈరోజు మనం వాడే మందులు ప్లాసిబో టెస్ట్‌లూ, డబుల్ బ్లైండ్ మెథడ్స్ వంటివన్నీ అనుసరించి, శాస్త్రీయమైన పద్ధతిలో పరీక్షించి పారదర్శకంగా అప్రూవ్ చేసినవేనని నమ్ముతున్నాం కదా మనం. కాదంటున్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మెడిసిన్ & స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ John Loannidis ఒక పరిశోధన కోసం పరిశీలించిన 60,000 క్లినికల్ ట్రయల్స్‌లో కేవలం 7% మాత్రమే నాణ్యమైనవని నిర్ధారించాడు. అంటే తొంబై శాతం క్లినికల్ టెస్టుల ఫలితాలు మందుల ఎఫికసీ (ప్రభావశీలత)ని, పనితనాన్ని నిర్ధారించటానికి ఏ మాత్రం పనికిరావు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌లో సగం పైగా అసలు ఫలితాలనే పబ్లిష్ చెయ్యటం లేదు. అయితే నష్టమేంటి? ఏదైనా మందు ఎఫికసీ పరీక్షించటానికి జరిగే ట్రయల్స్‌లో కొన్ని ఫలితాలు మందు నిజంగానే పని చేస్తుందని అనుకూలంగా వస్తాయి. కొన్ని నెగెటివ్‌గా వస్తాయి. అయితే ఫార్మా కంపెనీలేం చేస్తాయి? నెగెటివ్ ఫలితాలని దాచిపెడతాయి. ఎక్కువ పాజిటివ్, అతి తక్కువ నెగెటివ్ ఫలితాలని కలిపి అప్రూవల్ కోసం అవసరమైన statistical value (P value hacking ద్వారా) వచ్చేలా fabricated data సృష్టిస్తాయి. ఈ అబద్ధాలనే మెడికల్ జర్నల్స్‌లో ప్రచురిస్తాయి. వీటి మీద అధిక సంఖ్యలో పీర్ రివ్యూలు రాయిస్తాయి. ఇవే నిజమని ప్రభుత్వాలనీ, డాక్టర్లనీ, పరిశోధకులనీ నమ్మిస్తాయి. తమ మందులు యథేచ్ఛగా అమ్ముకుంటాయి. ఎప్పటికో నిజం బైటపడేలోపు అబద్ధాలే సైంటిఫిక్ సత్యాలుగా చెలామణీ అవుతాయి. జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఒక్క మందులకే పరిమితం కాదిది. Surgical procedures, diagnostic equipment, therapies వంటి మార్కెట్ విలువ కలిగున్న ప్రతి అంశాన్నీ publication bias అనబడే ఈ జాడ్యం భ్రష్టు పట్టించింది. కార్పొరేట్ సంస్థలూ, విశ్వవిద్యాలయాలూ, ప్రభుత్వ సంస్థలూ, డాక్టర్లూ సైంటిస్టుల భాగస్వామ్యంలో మొత్తం మెడికల్ సైన్సు ప్రామాణికతనే ప్రశ్నార్థకంగా మార్చివేసిన భారీ కుట్ర ఇది. 2017లో దీని గురించి నియమించిన Peter Wilmshurst కమిటీ బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ఇది organised criminal activity అంటూ తీవ్రంగా విమర్శించింది. ఇదంతా చూస్తే ఫార్మాకంపెనీల కుట్రలకీ మెడికల్ సైన్సు క్రెడిబిలిటీకి సంబంధం లేదన్న వాదన ఎంత బలహీనమైనదో మనకి అర్థమౌతుంది.

నిజానికి ఈ జాడ్యం ఒక్క మెడికల్ సైన్సుకే పరిమితం కాదు. అసలు మొత్తం సైన్సే తప్పుడు పరిశోధనలవల్ల చావుదెబ్బ తింటోంది. 

ఈరోజు మనం ఒక పారడాక్సికల్ ప్రపంచంలో బతుకుతున్నాం. సత్యమేదో తెలుసుకోవటానికి జరిగే శాస్త్ర పరిశోధనలు ఒకవైపు జరుగుతూనే ఉన్నా అసత్యాలకి సైన్సు ముసుగేసి అదే ప్రామాణికమైన సైన్సుగా చెలామణీ చెయ్యటానికి జరిగే ప్రయత్నాలు అంతకంటే ముమ్మరంగా జరుగుతున్నాయి. 1950లలో అమెరికన్ సిగరెట్ కంపెనీలు అత్యంత భారీ స్థాయిలో ఇటువంటి సైంటిఫిక్ ఫ్రాడ్ మొదలుబెట్టాయి. అప్పటిదాకా ఏమాత్రం హానిలేని సరదా అని భావించిన సిగరెట్ నిజానికి కాన్సర్ కారకమని పరిశోధనలలో తేలింది. నిషేధించాలని పబ్లిక్ డిమాండ్ మొదలయ్యింది. సిగరెట్ కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. ముల్లుని ముల్లుతోనే తియ్యాలని నిశ్చయించుకున్నాయి. వార్ స్ట్రాటజీ సిద్ధమయ్యింది. కళ్ళు చెదిరే స్థాయిలో ఫండింగ్ సమకూరింది. కాన్సర్ కారకాలైన ఇతర అంశాలని హైలైట్ చేస్తూ పెద్దమొత్తంలో distracting research మొదలయ్యింది. బట్టతలకీ కాన్సర్‌కీ ఉన్న సంబంధం మీద రీసెర్చ్‌లు జరిగాయి. కాన్సర్‌కీ పుట్టిన నెలకీ ఉన్న సంబంధంపైనా జరిగాయి. జనాన్ని పీకల్లోతు అయోమయంలోకి నెట్టాయి. మొత్తమ్మీద సిగరెట్ కంపెనీలు విజయం సాధించాయి. ఒక దుస్సంప్రదాయానికి శక్తిమంతమైన బీజం పడింది. సైన్సుని లాభసాటి interventional technology లుగా మార్చి సొమ్ముచేసుకునే క్రమంలో పెట్టుబడిదారీవ్యవస్థ ఈరోజుకీ ఇటువంటి distracting researchనే ముఖ్యమైన ఆయుధంగా వాడుకుంటోంది. పొగాకు, యాసిడ్ రెయిన్, కెమికల్ పెస్టిసైడ్స్, కాంట్రాసెప్టివ్స్, స్టెంట్స్, యాంటీ డిప్రెసెంట్స్, క్లైమేట్ చేంజ్, ఒకటేమిటి, అమ్ముకోవటానికి వీలున్న ప్రతి అంశమూ ఈ కథనంలోకి అందంగా ఒదిగిపోయింది. సైన్సుని అత్యంత భక్తి ప్రపత్తులతో కొలిచే విద్యావంతులే ఈ manufactured ignorance యథేచ్ఛగా వ్యాపించటానికి ప్రధానమైన వాహకాలవటం పెద్ద విషాదం.

మెడికల్ సైన్సులోనేగాక, అసలు మొత్తం సైన్సులోనే వేళ్ళూనుకుపోయిన invasive approach మానవాళి ఉనికికే ముప్పుగా మారిందన్న స్పృహ ఇప్పటికే మొదలయ్యింది. సైన్సుని నడిపిస్తోన్న foundational values గురించి లోతైన అంతర్మథనమే జరుగుతోంది. ప్రపంచం ఈరోజున్న విధంగా రూపుదిద్దుకోవటంలో సైన్సు పోషించిన శక్తివంతమైన పాత్రని గుర్తిస్తూనే అదే సైన్సు కారణంగా మన జ్ఞానంలోనూ, జీవితంలో ఏర్పడిన పగుళ్ళని కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంప్రదాయ పద్ధతుల మీదా, సంప్రదాయ జ్ఞానం మీదా ప్రపంచం కొత్తగా చూపు సారిస్తోంది. ప్రతి రంగంలోనూ ఆధునికతకీ సంప్రదాయానికీ మధ్యనున్న కాంప్లిమెంటారిటీని గుర్తిస్తోంది. 

ఈ రోజున వెస్టర్న్ మెడికల్ సైన్సులో ఉన్న లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెస్టర్న్ సైన్సుకి మూలస్తంభం లాంటి cartesian విలువలే మొదట్లో మెడికల్ సైన్సుకి కూడా మార్గం నిర్దేశించాయి. ఫలితంగా మనిషిని మనిషిగా కాక మానవ శరీరంగా అర్థం చేసుకున్నారు. చుట్టూ ఉన్న ప్రకృతిలో మమేకమైన అంతర్భాగంగా కాక స్వతంత్రమైన అస్తిత్వమున్న యంత్రంగా భావించారు. యంత్రభాగాలకి రిపేర్ చేస్తే యంత్రం భాగయినట్టు, స్వతంత్ర భాగాల్ని బాగు చేస్తే మనిషి బాగవుతాడనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. శరీరం, మనసుల మధ్యనున్న అద్వైతం అర్థ మయ్యింది. వైద్యంలో డాక్టర్లకున్నంత ప్రాముఖ్యత పేషెంట్ల నమ్మకాలకీ, విలువలకీ ఉందని గుర్తిస్తూ Evidence Based Medicine ఉద్యమం మొదలయ్యింది. ఇప్పుడు జరుగుతున్న క్లినికల్ టెస్టులే గాక గతంలో జరిగిన అన్ని టెస్టుల వివరాలని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలనే డిమాండ్‌తో AllTrials Movement నడుస్తోంది. ప్రపంచం మారుతోంది. సైన్సు ఒక paradigm shift అంచున నిలబడి ఉంది. మనం మాత్రం అపసవ్య దిక్కుకు చూస్తున్నాము. సైన్స్ పేరుతో చలామణీ అవుతున్న నకిలీ సైన్సుని దైవంగా మార్చి కొత్త మతం స్థాపించే మహోద్యమం చేస్తున్నాము. దాన్నే సైంటిఫిక్ టెంపర్ అని ప్రకటించుకుంటున్నాము. 

సైన్సు వేరు, టెక్నాలజీ వేరు. సైన్సు గొప్పదనాన్ని వివరించే ప్రతి సందర్భంలో కంప్యూటర్లనీ, రాకెట్లనీ ఉదాహరణలుగా చూపించే అమాయకత్వాన్ని తగ్గించుకుందాం. మోడర్న్ సైన్స్ చాలా విజయాలే సాధించింది. కాదంటంలేదు. కానీ మనిషిని ఓడించింది. మనిషి జీవితకాలాన్ని పెంచింది కానీ మానవజాతి ఆయుర్దాయాన్ని తగ్గించింది. 

మనిషిప్పుడొక endangered species. బతకటానికి నానా చావు చస్తున్నాడు. నిజానికి సగటు మనిషికి సిద్ధాంతాల జంజాటాలు ఏనాడూ లేవు. ఇప్పుడైతే ఎట్లాగైనా ప్రాణాలు దక్కించుకోవాలన్న తపన తప్ప వేరే ప్రయారిటీలు అసలే లేవు. ఏం తప్పుందందులో? ఆస్తులు కోల్పోయి కూడా ప్రేమించిన మనుషుల్ని కాపాడుకోలేని నిస్సహాయ పరిస్థితిలో కళ్ళ ముందు కనిపించే కారణాల్ని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. ఏ సన్నటి వెలుగురేక కనిపించినా ఆశగా చూస్తున్నాడు. న్యాయమే కదా? బతుకే బరువైన మనిషిలో scientific temper వెతికే మన హేతుబద్ధత నిగ్గెంత? సైంటిఫిక్ టెంపర్లూ, రేషనాలిటీలూ గొప్ప విషయాలే గానీ ఉపయోగించే మనకి సంయమనం లోపిస్తే ఈ బతుక్కి మిగిలిన కొద్దిపాటి అందమూ, సున్నితత్వమూ గోదాట్లో కలిసిపోతాయి. సైన్సు గొప్ప జ్ఞానమార్గమేగానీ జ్ఞానానికి అదొక్కటే మార్గం కాదు. మనిషిని మించిన ప్రమాణమేదీ లేదు.

-మోషే డయాన్

ఫ్రీలాన్స్‌ ఆర్టిస్‌్ట, 73968 76461

Advertisement