ఆడని బొమ్మ..!
ABN , First Publish Date - 2021-07-09T04:30:54+05:30 IST
సినీ ప్రేక్షక లోకంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. సినిమా విడుదలైన మొదటి రోజే నెల్లూరు టాక్ ఎలా ఉందనే విషయాన్ని సినీ వర్గాలు ప్రత్యేకంగా తెలుసుకుంటాయి.

అనుమతులు వచ్చినా వెలగని వెండితెర
పెద్ద సినిమాలు లేకపోవడమే కారణం
యాజమాన్యాల్లో నష్టాల భయం
వచ్చే నెల వరకు తలుపులు మూతే!
నెల్లూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : సినీ ప్రేక్షక లోకంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. సినిమా విడుదలైన మొదటి రోజే నెల్లూరు టాక్ ఎలా ఉందనే విషయాన్ని సినీ వర్గాలు ప్రత్యేకంగా తెలుసుకుంటాయి. సింహపురిలో మంచి టాక్ వచ్చిందంటే ఇక సినిమా హిట్ అయినట్లుగా భావిస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన జిల్లాలో ఇప్పుడు థియేటర్లకు సినిమా కష్టాలు ఎదురయ్యాయి. ప్రేక్షకులు వస్తారన్న గ్యారెంటీ లేకపోవడంతో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఉన్నా బొమ్మ వేయడానికి వెనుకాడుతున్నారు. గురువారం నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ జిల్లాలో అక్కడక్కడ ఒకటి రెండు చిన్న థియేటర్లు మినహా మిగిలినవేటిలో బొమ్మ పడలేదు.
అంతా మూతే..!!
నెల్లూరు నగరంలో మొత్తం 14 థియేటర్లు ఉన్నాయి. వాటిలో రెండు చిన్నవి. మిగిలిన 12 పెద్ద థియేటర్ల తలుపులు గురువారం తెరుచుకోలేదు. గూడూరులో 4, వెంకటగిరిలో 4, కోటలో3, రాపూరులో 2 థియేటర్లు ఉన్నా ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. సూళ్లూరుపేటలో ఐదు, నాయుడుపేటలో రెండు ఇలా జిల్లావ్యాప్తంగా 65కు పైగా థియేటర్లు ఉన్నాయి. వీటిలో నాలుగైదు చిన్న థియేటర్లలో మినహా మరెక్కడా సినిమా ప్రదర్శన ప్రారంభం కాలేదు.
సినిమాల కొరత
థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఆడించడానికి కొత్త సినిమాలు లేకపోవడంతో ఽథియేర్లు తెరవడానికి యాజమాన్యాలు వెనకాడుతున్నాయి. కొవిడ్ కారణంగా గడచిన ఏడాదిన్నర కాలంలో మూడు నెలలు మినహా మిగిలిన కాలం అంతా లాక్‌డౌనతోనే గడిచిపోయింది. దీంతో షూటింగ్‌లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి సినీ పరిశ్రమ షూటింగ్‌లు మొదలుపెట్టినా మూడు నెలల కాలానికే మళ్లీ బ్రేక్ పడింది. ఈ మధ్య కాలంలో విడుదలైన ఒకటి రెండు సినిమాలు కూడా ఓటీపీ పద్ధతిలో టీవీ చానళ్లలో ప్రసారం అయ్యాయి. నట్టింట్లోకి.. అరచేతిలోకి సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన క్రమంలో ఆసక్తి రేకిత్తించే సినిమాలు రిలీజ్ అయితే తప్ప థియేటర్లకు ప్రేక్షకులు రాని పరిస్థితి. అయితే కరోనా కారణంగా పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు విడుదల చేయాలంటే నిర్మాతలు హడలిపోతున్నారు. రిలీజ్‌కు ఇది సరైన సమయం కాదేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలో థియేటర్ల పునః ప్రారంభానికి అనుమతులు ఇచ్చినా ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించే పెద్ద సినిమాలు విడుదల కాని కారణంగా డిస్ర్టిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు వెనకడుగు వేస్తున్నారు. థియేటర్లు నడపడం అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నపని. సినిమాల కొనుగోలు ఒక ఎత్తు అయితే థియేటర్ల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు మరో ఎత్తు. థియేటర్లు ఫుల్ కెపాసిటీతో నడిస్తే తప్ప గిట్టుబాటు కాదు. పరిస్థితి ఇలా ఉంటే కరోనా ఆంక్షల మేరకు 50 శాతం సీట్లతో సినిమా ఆడించడం అంటే మరింత కష్టం. ఇవన్నీ ఆలోచించి పెద్ద సినిమాలు రిలీజ్ అయిన తరువాతే థియేటర్లు పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు మొదటి, రెండవ వారాల్లో పెద్ద సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు థియేటర్లు రన చేద్దామని భావనలో యాజమాన్యాలు ఉన్నాయి.
