ఎర్రకోటపై ఎగిరిన జెండా ఏంటది?
ABN , First Publish Date - 2021-01-27T07:09:03+05:30 IST
గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో పోటెత్తిన ఆందోళనకారులు.. ఎర్రకోటలోకి దూసుకెళ్లి రెండు జెండాలు ఎగరేశారు.

ఖలిస్థాన్ జెండా కాదు.. సిక్కు పతాకం!
కొందరి చేతుల్లో ఖలిస్థాన్ జెండాలు
కోట బయట స్తంభానికి రైతు జెండా
ఎర్రకోట ముట్టడికి దీప్ సిద్ధూయే సూత్రధారి
వెనుక ఉన్నది ఆయనే.. రైతు నేతల ఆరోపణ
దీప్.. బీజేపీ నేతలకు సన్నిహితుడా..?
మోదీతో దిగిన ఫొటోతో కలకలం
న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ వీధుల్లో ట్రాక్టర్లతో పోటెత్తిన ఆందోళనకారులు.. ఎర్రకోటలోకి దూసుకెళ్లి రెండు జెండాలు ఎగరేశారు. వారు జాతీయ పతాకాన్ని తీసేసి, దాని స్థానంలో ఖలిస్థాన్ జెండా ఎగరేశారని.. మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. దీంతో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ పార్టీ ‘ఆల్ పాకిస్థాన్ ముస్లిమ్ లీగ్ (ఏపీఎంఎల్)’ సంబరాలు చేసుకుంది. భారత రిపబ్లిక్‌కు ఇదొక చీకటిరోజుగా అభివర్ణించింది. కానీ ఎర్రకోటపై ఎగరేసింది ఖలిస్థాన్ జెండాలు కాదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. తొలుత రైతులు ఎర్రకోటపై భారత జాతీయ పతాకానికి కింది భాగంలో ఉండే ఫ్లాగ్ పోస్టుపై రెండు పతాకాలను ఎగురవేశారు.
వాటిలో ఒకటి.. సిక్కులు పరమ పవిత్రంగా భావించే ‘నిషాన్ సాహిబ్’ జెండా. అది త్రికోణాకారంలో ఉంటుంది. కాషాయ వర్ణంలో ఉండే ఆ జెండాపై ఓ ఖాండా, రెండువైపులా పదునుండే కత్తి, రెండు కృపాణాలు, ఓ చక్రం ఉంటాయి. ప్రతీ గురుద్వారా వద్ద దీన్ని చూడవచ్చు. ఈ జెండాను చూసిన కొందరు- ఖలిస్థానీ జెండా అనీ, నిషేధిత ఖలిస్థానీ సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎ్‌ఫజే) పిలుపు మేరకు వారు దీనిని ఎగరేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ అది కాదని ఆ తరువాత వివరణలు వచ్చాయి. అది ఖలిస్థాన్ జెండా కాకపోయినప్పటికీ- సిక్కు మత జెండాను ఎగరేయడం ద్వారా ఖలిస్థానీ ఉద్యమకారులు దీని వెనుక ఉన్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగింది. కాగా.. ఖలిస్థాన్ జెండా అయితే కాషాయ రంగులో, త్రికోణాకారంలో ఉండదు. పసుపు పచ్చ రంగులో దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. దాని మీద ‘ఖలిస్థాన్’ అని రాసి ఉంటుంది. ఇక, నిరసనలో భాగంగా ఆ ఫ్లాగ్‌పోస్టుపై రైతులు ఎగరేసిన రెండో జెండా.. రైతు సంఘాల జెండా. పసుపు పచ్చ రంగులో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ జెండాపై.. రెండు ఎద్దులకు కాడి కట్టి రైతు వ్యవసాయం చేస్తున్న దృశ్యం ఉంది. పసుపు పచ్చ రంగులో ఉండడంతో కొందరు దీన్ని ఖలిస్థాన్ జెండాగా పొరబాటు పడి ఉండే అవకాశం ఉంది.
ఫ్లాగ్‌పోస్టుపై ఈ జెండాలు ఎగరేసిన తర్వాత.. ఎర్రకోటపై భారత జాతీయ పతాకం పక్కన ఉండే గుమ్మటానికి మరో రెండు జెండాలు కట్టారు. రెండింటి మీదా నిషాన్ సాహిబ్ మీద ఉన్నట్టే గుర్తులున్నాయి. అయితే.. రైతుల నిరసనల్లో మాత్రం కొందరి చేతుల్లో ఖలిస్థాన్ జెండాలు కనిపించడం గమనార్హం. మరోవైపు.. రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం గోడలపై కొందరు అగంతకులు ‘ఖలిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు రాశారు. కాగా.. రైతు నిరసనల్లో ఘర్షణలు సృష్టించేందుకు పాకిస్థాన్ మిలటరీ నిఘా సంస్థ ఐఎ్‌సఐ.. బబ్బర్ ఖల్సా సంస్థకు రూ.5 కోట్లు ఇచ్చినట్టు నిఘావర్గాల సమాచారం. అలాగే ఇటలీలో ఉన్న ఖలిస్థాన్ అనుకూలవాదులు దాదాపు రూ.2 కోట్లు.. కెనడాకు చెందిన జోగీందర్ సింగ్ బస్సీ అనే వ్యక్తి రూ.3కోట్లు పంపినట్టు సమాచారం.