కరిగిపోతున్న కొండలు

ABN , First Publish Date - 2022-11-24T00:01:59+05:30 IST

తవ్వకాలకు అనుమతులు లేవు.. అయినా అధికారం మాటున వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక అడ్డుకోవాల్సిన మైనింగ్‌ అధికారులు మామూళ్ల గంతలతో కళ్లుమూసుకుని ఉన్నారు.

కరిగిపోతున్న కొండలు
కోటప్పకొండలో అక్రమ మట్టి తవ్వకాలు

నరసరావుపేట, నవంబరు 23: తవ్వకాలకు అనుమతులు లేవు.. అయినా అధికారం మాటున వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక అడ్డుకోవాల్సిన మైనింగ్‌ అధికారులు మామూళ్ల గంతలతో కళ్లుమూసుకుని ఉన్నారు. ఇదే అదనుగా మట్టి మాఫియా కోటప్పకేంద్రంగా చెలరేగిపోతోంది. మాఫియా చేతిపడిన కోటప్పకొండలో కొండలు కరిగిపోతున్నాయి. కొండ ప్రాంతంలో గ్రావెల్‌కు మంచి గిరాకి ఉంది. కోటప్పకొండలో భారీగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నది. నిత్యం వందల లారీల మట్టిని అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. ఇందుకు ఎక్స్‌కవేటర్లు, లారీలను పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. నరసరావుపేట ప్రాంతంలో ఇటీవల వెలుస్తున్న రియల్‌ వెంచర్లు పల్లంలో ఉండటంతో గ్రావెల్‌ వినియోగం పెరిగింది. దీంతో ఇక్కడి నుంచి నరసరావుపేటకు గ్రావెల్‌ను సరఫరా చేసేందుకు లారీకి రూ.6 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లే గ్రావెల్‌ లారీకి కొంత మొత్తాన్ని అధికార పార్టీ కీలక నేత వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వైసీపీ మండల స్థాయి నేత ఒకరు మట్టి దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఒక వర్గానికే అక్రమ గ్రావెల్‌ వ్యాపారం పరిమితమైందన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. మట్టి సామ్రాజ్యాన్ని కొందరు మాత్రమే అధికార పార్టీలో శాసిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్ని నెలలుగా అక్రమ మైనింగ్‌ను అధికార పార్టీ నేతలు నిరాటంకంగా సాగిస్తున్నారు. ఇలానే కొనసాగితే కొండలు మిగిలే పరిస్థితి ఉండదు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

కోటప్పకొండ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతులు లేవు. కొండ కేంద్రంగా జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలతో ప్రభుత్వానికి ఆదాయం లేదు. ప్రభుత్వ అనుమతి ఉంటే గ్రావెల్‌ క్యూబిక్‌ మీటర్‌ గ్రావెల్‌కు రూ.60 మైనింగ్‌ శాఖకు చెల్లించాలి. లారీకి మైనింగ్‌ శాఖకు రూ.1200 చెల్లించాలి. అయితే అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతుండటంతో ప్రభుత్వానికి ఎటువంటి నగదు చెల్లిస్తున్న దాఖలాలు లేవు. అక్రమ మైనింగ్‌తో రోజుకు లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. పెద్దఎత్తున అక్రమాలు జరుగుతుంటే మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు అటు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. వీరిపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో చర్యలు తీసుకునే సాహసం సదరు అధికారులు చేయడంలేదు. మరో వైపు వారు మాముళ్లు కూడా తీసుకుని మిన్నకుంటున్నారన్న ప్రచారం ఉంది. కోటప్పకొండలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఆ శాఖ డీడీని ప్రశ్నించగా వివరాలు తన వద్ద లేవని ఏడీని వివరణ కోరాల్సిందిగా సూచించారు. మైనింగ్‌ ఏడీకి పలుమార్లు కాల్‌ చేయగా ఆయన స్పందించలేదు.

=--------------------------------

పోషకాలు.. పెనుబారం

రెండేళ్లుగా రాయితీకి రాంరాం

పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం

నాడు ఉచితం.. నేడు ఇండెంట్‌తో సరి

బాపట్ల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిప్సం, జింకు, బోరాన్‌ తదితర సూక్ష్మ పోషకాలు భూమి సారానికి అవసరం. గత ప్రభుత్వ హయాంలో వీటిని రైతులకు ఉచితంగా అందజేసేవారు. తద్వారా భూమిలో పోషకాలు పెరిగి ఆశాజనంగా పంట దిగుబడులు వచ్చేవి. అయితే పాలకులు మారగానే పోషకాల భారం రైతులపై పడింది. రెండేళ్ల నుంచి ఖరీఫ్‌, రబీ సీజన్‌ ప్రారంభం కాగానే రైతులకు కావాల్సిన సూక్ష్మ పోషకాల విషయంలో ఇండెంట్‌ పెడుతున్నాం.. రాగానే రైతులకు రాయితీపై అందిస్తామనే మాటలతో పాలకులు సరిపెడుతున్నారే కాని ఇప్పటి వరకు వాటిని అందజేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ తీరుతో విసిగి పోయిని రైతులు కూడా వాటిని అడగడమే మానేశారు. భూ సారానికి అనుగుణంగా పోషకాలను పిచికారి చేస్తే కొంతమేర భూమి సారం పెరిగి తద్వారా ఆశాజనకంగా దిగుబడులు ఉండేవని రైతులు చెప్తున్నా పాలకుల్లో చలనంలేదు. ప్రతి ఏటా భూసార పరీక్షలు చేపట్టి ఆ మట్టికి తగ్గట్లు ఏ పోషకాలు అవసరమో గుర్తించి వాటిని రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో నిర్విరామంగా కొనసాగింది. 2014 నుంచి 2019 వరకు సూక్ష్మ పోషకాలను అప్పటి ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందించింది. అలా అందించే పోషకాలలో జింకు, జిప్సం, బోరాన్‌ తదితరాలు ఉండేవి. భూసార పరీక్షలను చేపట్టి అన్నదాతలకు సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కార్డులను అందించి వాటి ద్వారా సాయం చేసేది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 70,000 మంది రైతులు ఈ కార్డు ద్వారా ఉచితంగా పోషకాలను అప్పట్లో అందుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వం కొలువుదీరిన తొలి ఏడాదిలో వాటిని 50 శాతం రాయితీపై రైతులకు అందించింది. ఇక రెండేళ్ల నుంచి వాటి ఊసేలేదు. ప్రతిసారీ వ్యవసాయ శాఖ రైతుల నుంచి ఇండెంట్‌ తీసుకోవడం తప్పితే పంపిణీ చేసిన పాపాన పోలేదు. ఖర్చులు పెరిగి సేద్యం గిట్టుబాటుకావడంలేదు. ఈ పరిస్థితుల్లో సూక్ష్మ పోషకాలకు వెచ్చించే మొత్తం రైతులకు అదనపు భారంగా మారింది. దిగుబడుల కోసం వీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో పది కేజీల జింకు ధర దాదాపు రూ.600 ఉండగా, జిప్సం 50 కేజీల బ్యాగు రూ.1100 వరకు ఉంది. బోరాన్‌ కోసం కిలోకు రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఆయా కంపెనీలను బట్టి వీటి ధరల్లో కొద్దిపాటి వ్యత్యాసం ఉన్నప్పటికీ రైతులకు భారంగా మారాయి. పోషకాల లోపం పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 2018లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో హెక్టారు వరికి 6,700 కిలోలు అయితే గత సంవత్సరం 5,100 కిలోలకు ఉత్పాదకత పడిపోయింది. ఈ విధంగా ప్రతి పైరు విషయంలో కూడా తీసికట్టుగానే దిగుబడులు ఉంటున్నాయి. రసాయనాల వాడకం వల్ల భూసారం దెబ్బతింటున్నందు వల్ల ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున వీటి వాడకాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం మొత్తానికే ఈ పథకాన్ని అటకెక్కించింది.

ఇండెంట్లు పెట్టాం..

సీజన్‌ ప్రారంభమైన ప్రతిసారీ వ్యవసాయ శాఖ రైతుల నుంచి ఏ పోషకాలు అవసరమో ఆర్డర్‌ తీసుకుని ఇండెంట్‌ పెడుతుంది. ప్రభుత్వం నుంచి వస్తున్నాయి.. అన్నట్లుగా అధికారులు చెప్తున్నారే కాని అలా వచ్చింది లేదు.. ఇచ్చింది లేదు. ఈ తంతు రెండేళ్లుగా సాగడం తప్ప వాటిని రైతుభరోసా కేంద్రాలలో ఉంచి రైతులకు అందించిన పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో విధిగా భూసార పరీక్షలు జరిపేవారు. ప్రస్తుతం వాటి పరిస్థితి తీసికట్టుగానే మారింది. వాటికి సంబంధించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో వారు మానేశారు. ఆర్థికంగా భరించగలిగే శక్తి ఉన్న అన్నదాతలకు అసలు తమ పొలంలో ఏ పోషకాల లోపం ఉందో తెలిపే యంత్రాంగం కూడా కొరవడింది. మట్టి నమూనాలు తీసుకెళితే ఆర్‌బీకేలలో పరీక్ష చేస్తారనే ప్రభుత్వ మాటలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న దాఖలాలు మచ్చుకైన లేవు. రాబోయే రబీ సీజన్‌కయినా రాయితీపై సూక్ష్మ పోషకాలు అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందని రైతులు అభ్యర్థిస్తున్నారు.

============================================================

Updated Date - 2022-11-24T00:02:02+05:30 IST