CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 02:33 PM
CM Chandrababu Comments: ఈనెలలోనే డీఎస్సీ పూర్తి చేసి జూన్‌లోగా టీచర్ల నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారని అన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్ళు కళ్లు తెరిచి చూడాలని అన్నారు.

బాపట్ల, ఏప్రిల్ 1: కొత్తగొల్లపాలెం టీడీపీకి కంచుకోట అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన సీఎం.. చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించిన ముఖ్యమంత్రి.. లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులు అని స్పష్టం చేశారు. ‘గతంలో బటన్ నొక్కామని చెప్పారు.. మీ బటన్లు అన్నీ నా పెన్షన్‌తో సమానం. ప్రజా సేవల పేరుతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టా. ముందుండి నడిపించాలనే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నా. పెన్షన్లు ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలి. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీ కంటే తక్కువ పెన్షన్’ అని చెప్పుకొచ్చారు.
మళ్లీ అమరావతిని గాడిన పెట్టామని తెలిపారు. అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. విశాఖ స్టీల్ కూడా గాడిలో పడిందన్నారు. విశాఖ ఉక్కుకు రూ.11 వేల కోట్లు నిధులు తెచ్చామన్నారు. విశాఖకు రైల్వే జోన్ కూడా వచ్చిందన్నారు. ఈనెలలోనే డీఎస్సీ పూర్తి చేసి జూన్‌లోగా టీచర్ల నియామకాలు చేపడతామన్నారు. ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారని అన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానని విమర్శించే వాళ్ళు కళ్లు తెరిచి చూడాలని అన్నారు. 2027కి పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
2029కి ఏపీలో జీరో పావర్టీ చూడాలనేది తన లక్ష్యమన్నారు. వారసత్వంగా అప్పు వచ్చిందని.. రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తానన్నారు. తల్లికి వందనం మేలో ఇస్తామని ప్రకటించారు. ఎందరు పిల్లలు ఉంటే.. అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. నాలుగు నెలలకు ఒకసారి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పారు. మే, జూన్‌లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఇస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామని చెప్పారు. వ్యవసాయంలో మోడరైజేషన్ తీసుకువస్తామన్నారు. రాష్ట్ర ప్రజల కోసం డబ్బు సంపాదిస్తానని చెప్పారు.
అంబేద్కర్ షెడ్యూల్ కులంలో పుట్టిన 12వ సంతానమని.. లండన్‌లో అంబేద్కర్ చదువుకోడానికి బరోడా సాయం చేశారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగారన్నారు. అబ్దుల్ కలామ్‌కు అయ్యర్ అనే వ్యక్తి ఆపన్న హస్తం అందించారని చెప్పుకొచ్చారు. కలాం చరిత్రలో నిలిచిపోయారన్నారు. డ్వాక్రా సంఘాలకు పొదుపు నేర్పించారని.. ఇప్పుడు వారి వద్ద రూ.35 వేల కోట్లు పొదుపు డబ్బులు ఉన్నాయని తెలిపారు. సెల్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిందన్నారు. గతంలో తాను సెల్‌ఫోన్ గురించి చెబితే అందరూ నవ్వారన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామన్నారు. ఐదేళ్లలో ఇళ్లులేని అందరికీ ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
HCU Land Politics:హెచ్‌సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ
Read Latest AP News And Telugu News