మళ్లీ కుళ్లిన చికెన్
ABN , First Publish Date - 2022-12-25T19:27:21+05:30 IST
నెల్లూరు నగరంలో కుళ్లిన మాంసం విక్రయాలు ఆగడం లేదు. తాజాగా హరనాథపురంలో 700 కేజీల కుళ్లిన కోడి మాంసాన్ని శనివారం అధికారులు గుర్తించారు.
నెల్లూరు(సిటీ), డిసెంబరు 24 : నెల్లూరు నగరంలో యంత్రాంగం ఎంత కట్టడి చేస్తున్నా కుళ్లిన మాంసం విక్రయాలు మాత్రం ఆగడం లేదు. అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తూ వందల కేజీల కుళ్లిన చికెన్‌ను నిర్వీర్యం చేస్తున్నా మళ్లీ.. మళ్లీ అదే దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని హరనాథపురంలో 700 కేజీల కుళ్లిన కోడి మాంసాన్ని శనివారం అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో మున్సిపల్ ఆరోగ్య అధికారి వెంకట రమణయ్య తన సిబ్బందితో కలిసి హరనాథపురం 2వ వీధిలోని గరీబ్ బిరియానీ దుకాణానికి ఆనుకుని ఉన్న ఓ షాపులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రెండు ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. 5, 10 కేజీల ప్యాకెట్లలో ఉంచిన కోడి గుండె, కందన కాయలు, కోడి బాడీలు భారీ స్థాయిలో బయటపడ్డాయి. వాటిని బయటకు తీయగా పురుగులు పట్టి దుర్గంధం వెదజల్లడంతో అక్కడున్న పలువురు వాంతులు చేసుకున్నారు. కార్పొరేషన్ సిబ్బంది ఆ మాంసాన్ని ఫినైల్‌తో నిర్వీర్యం చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. దుకాణం నిర్వాహకుడు అంజాద్ అలీకి రూ.25 వేలు జరిమానా విధించారు. దుకాణాన్ని, అందులోని ఫ్రీజర్లు సీజ్ చేశామని అధికారులు వెల్లడించారు.
షాపులకు తరలించేలోపు పట్టేసుకున్నారు
కనీస సామాజిక బాధ్యత కూడా లేకుండా కుళ్లిన, పురుగులు పట్టిన మాంసాన్ని విక్రయించడమేకాక, పట్టుబడ్డామన్న భయంకూడా లేని షాపు నిర్వాహకుడు అంజాద్‌అలీ సంచలనాత్మకమైన విషయాలను మీడియాకు వెల్లడించాడు. చెన్నైలోని తన సోదరుడి సహాయంతో ఈ మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీనిని నగరంలోని షాపులకు అమ్ముతామని, ప్రస్తుతం తన వద్దనున్న మాంసాన్ని మరో గంటలో తరలించేందుకు సిద్ధమవుతున్నామని, ఈలోపు అధికా రులు పట్టుకున్నారని చెప్పాడు. ఇలాంటి మాంసం తానొక్కడినే అమ్మడం లేదని, నగరంలో చాలా మంది అమ్ముతున్నారని చెప్పడంతో అధికారులు, స్థానికులు షాకయ్యారు.