low pressure: హిందూ మహాసముద్రంలో అల్పపీడనం
ABN , First Publish Date - 2022-12-14T20:02:16+05:30 IST
దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం (low pressure) ఏర్పడింది.
విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం (low pressure) ఏర్పడింది. ఇది పశ్చిమంగా పయనించి గురువారంకల్లా తీవ్ర అల్పపీడనంగా బలపడనున్నది. ఆ తరువాత మూడు రోజులపాటు అంటే ఈనెల 17వ తేదీ వరకు అదే తీవ్రతతో పశ్చిమంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తీవ్ర అల్పపీడనం శ్రీలంక (Sri Lanka) దిశగా వెళుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో 16వ తేదీ వరకు ఆగ్నేయ బంగాళాఖాతం, 16 నుంచి 18వ వరకు నైరుతి బంగాళాఖాతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా కేరళ (Kerala)కు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారి ప్రస్తుతం పనాజీకి 500 కి.మీ. పశ్చిమ నైరుతిగా కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని, అయితే దీని ప్రభావం పశ్చిమ తీరంపై వుండదని నిపుణులు వివరించారు. బుధవారం రాయలసీమ (Rayalaseema), దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.