లేటరైట్!?
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:53 AM
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో జర్తా లక్ష్మణరావుకు చెందిన క్వారీలో లేటరైట్ తవ్వకాలకు మళ్లీ రంగం సిద్ధమైంది. ప్రభుత్వంలో కీలక వ్యక్తి తెర వెనుక ఉండగా, నర్సీపట్నానికి చెందిన వ్యాపారి తవ్వకాల బాధ్యత తీసుకున్నారు. లేటరైట్‌ను తవ్వి తరలించేందుకు వీలుగా భమిడికలొద్ది క్వారీ నుంచి కాకినాడ జిల్లా రౌతులపూడి వరకూ రహదారిని గత పక్షం రోజుల నుంచి మరమ్మతు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం క్వారీ పాయింట్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారనే ప్రచారం సాగుతుంది. తవ్వకాలకు అవసరమైన మిషనరీని కొండపైకి చేర్చారంటున్నారు. ఈ వారంలో రహదారి మరమ్మతులు పూర్తిచేసిన తరువాత తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది.

భమిడికలొద్దిలో మళ్లీ తవ్వకాలకు రంగం సిద్ధం
క్వారీ ప్రాంతానికి మిషనరీ, వాహనాలు
తెర వెనుక కూటమి పార్టీ నేత
స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు
బియ్యం కార్డుదారులకు నెలకు రూ.1,000 చొప్పున అందజేస్తామని హామీ
విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలొద్దిలో జర్తా లక్ష్మణరావుకు చెందిన క్వారీలో లేటరైట్ తవ్వకాలకు మళ్లీ రంగం సిద్ధమైంది. ప్రభుత్వంలో కీలక వ్యక్తి తెర వెనుక ఉండగా, నర్సీపట్నానికి చెందిన వ్యాపారి తవ్వకాల బాధ్యత తీసుకున్నారు. లేటరైట్‌ను తవ్వి తరలించేందుకు వీలుగా భమిడికలొద్ది క్వారీ నుంచి కాకినాడ జిల్లా రౌతులపూడి వరకూ రహదారిని గత పక్షం రోజుల నుంచి మరమ్మతు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం క్వారీ పాయింట్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారనే ప్రచారం సాగుతుంది. తవ్వకాలకు అవసరమైన మిషనరీని కొండపైకి చేర్చారంటున్నారు. ఈ వారంలో రహదారి మరమ్మతులు పూర్తిచేసిన తరువాత తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
భమిడికలొద్దిలో 121 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అల్లూరి జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన గిరిజనుడు జర్తా లక్ష్మణరావు పేరిట అనుమతులు వచ్చాయి. అయితే లక్ష్మణరావు బినామీ మాత్రమే. ఆయన్ను ముందుపెట్టి వైసీపీకి చెందిన కీలక నేత కుమారుడు లేటరైట్ తవ్వకాలు చేపట్టారు. భమిడికలొద్దిలో క్వారీయింగ్, అక్కడ నుంచి రౌతులపూడి వరకు రహదారి నిర్మించిన ప్రాంతంపై అనేక వివాదాలు ఉన్నాయి. రిజర్వు అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు కొట్టేసి రోడ్డు నిర్మించారు. దీనిపై నాతవరం మండలానికి చెందిన మరిడయ్య ఎన్జీటీలో ఫిర్యాదు చేయడతో విచారణ జరిగింది. ఒకపక్క విచారణ జరుగుతుండగానే పాలకుల దన్నుతో లేటరైట్‌ను తవ్వేసి లక్షల క్యూబిక్ మీటర్లు తరలించుకుపోయారు. క్వారీ ప్రాంతంలో ఇప్పటివరకూ ఎంత తవ్వారు?, రాయల్టీ ఎంత చెల్లించారు?...అన్న విషయాలు గనుల శాఖ ఎన్నడూ వెల్లడించలేదు. గత ఏడాది ఎన్నికల ముందు తవ్వకాలు ఆపారు. అప్పటికే రౌతులపూడిలో నిల్వ చేసిన లక్షల క్యూబిక్ మీటర్ల లేటరైట్‌ను ఇటీవల కొందరు ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇంకా రౌతులపూడి మండలంలో మరో రెండుచోట్ల ఉన్న నిల్వలను కొద్దిరోజుల నుంచి రాత్రిపూట తరలిస్తున్నారు.
ఇదిలావుండగా ప్రభుత్వం మారడంతో లేటరైట్ తవ్వకాల నుంచి వైసీపీ కీలక నేత కుమారుడు తప్పుకోగా, ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీకి చెందిన మరో నాయకుడు రంగంలోకి దిగారు. లీజుదారుడు జర్తా లక్ష్మణరావుకు బినామీగా నర్సీపట్నానికి చెందిన వ్యాపారిని తెరపైకి తీసుకువచ్చారు. భమిడికలొద్ది క్వారీ ఉన్న సుందరకోట పంచాయతీలో ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంచాయతీలో సుందరకోట, భమిడికలొద్ది, హసనగిరి, తొర్రడ, ముంత మామిడిలొద్ది, పాత సిరిపురం, కొత్త సిరిపురం గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు. ఎనిమిది గ్రామాల పరిధిలో మొత్తం 500 వరకు బియ్యం కార్డుదారులుండగా ప్రతి కార్డుదారుడికి నెలకు రూ.1000 వంతున పరిహారం అందజేస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిసింది.
సరుగుడు లేటరైట్‌పైనా కూటమి నేతల కన్ను?
40 హెక్టార్లల్లో తవ్వకాలకు ఈసీ అనుమతి
తెర వెనుక ఇద్దరు నేతలు
విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):
నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో గల మేలు రకం లేటరైట్‌పై కూటమికి చెందిన కొందరు నేతల కన్నుపడింది. గిరిజనులకు మైనింగ్ లీజులు వచ్చేలా తెర వెనుక ఇద్దరు నేతలు చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో గత ఏడాది చివరిలో ఇద్దరికి లేటరైట్ తవ్వకాల నిమిత్తం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని ఇప్పటివరకూ అత్యంత గోప్యంగా ఉంచారు. విశ్వసనీయంగా అందిన వివరాల ప్రకారం...సరుగుడు గ్రామ పరిధిలో చెరో 20 హెక్టార్లలో తవ్వకాలకు ఇద్దరు గిరిజనులు దరఖాస్తు చేశారు. వాటిని గనుల శాఖ పరిశీలించి జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపగా...అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల కమిటీలు పరిశీలించి ఆమోదం తెలిపాయి.
లేటరైట్ తవ్వకాలకు అనుమతులు
నర్సీపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):
నాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికలొద్ది, సరుగుడు ప్రాంతాల్లో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని మైనింగ్ ఏడీ శివాజీ తెలిపారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ భమిడికలొద్ది క్వారీ జర్తా లక్ష్మణరావు పేరు మీద ఉందన్నారు. మొత్తం 121 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. అలాగే సరుగుడులో కిల్లో లోవరాజు పేరుతో 20 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని శివాజీ తెలిపారు.