అరకు కాఫీకి అందలం
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:51 AM
అరకు కాఫీగా ప్రపంచ గుర్తింపు పొందిన మన్యం కాఫీకి మరో అరుదైన ఖ్యాతి లభించింది. రాష్ట్ర అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమక్షంలో దీనిని మంగళవారం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో గిరిజనులు పండించిన అరకు కాఫీ అసెంబ్లీ సాక్షిగా మరో మారు వార్తల్లో నిలిచింది. గిరిజనులు సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడమే ఈ కాఫీకి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం.

- తాజాగా అసెంబ్లీలో కాఫీ స్టాల్ ప్రారంభం
- త్వరలో పార్లమెంట్ హాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
- విస్తరిస్తున్న మన్యం కాఫీ ఖ్యాతి
- గిరిజనుల సేంద్రీయ సాగు పద్ధతులే ప్రధాన కారణం
- గతేడాది మన్‌కీ బాత్‌లో అరకు కాఫీ ప్రత్యేకతను ప్రస్తావించిన ప్రధాని మోదీ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
అరకు కాఫీగా ప్రపంచ గుర్తింపు పొందిన మన్యం కాఫీకి మరో అరుదైన ఖ్యాతి లభించింది. రాష్ట్ర అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమక్షంలో దీనిని మంగళవారం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో గిరిజనులు పండించిన అరకు కాఫీ అసెంబ్లీ సాక్షిగా మరో మారు వార్తల్లో నిలిచింది. గిరిజనులు సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడమే ఈ కాఫీకి ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో సేంద్రీయ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఏజెన్సీలోని గిరిజనులకు చెందిన కాఫీ ఉత్పత్తికి దేశీయ, విదేశీ మార్కెట్‌లో ఆశించిన గిరాకీ ఏర్పడింది. దేశంలో కర్ణాటక రాష్ట్రం తరువాత స్థానం కాఫీ సాగులో ఆంధ్రప్రదేశ్‌దే కావడం విశేషం. అలాగే గిరిజన రైతులు రసాయన, ఆధునిక పద్ధతులకు దూరంగా వాటిని పండిస్తుండడంతో మార్కెట్‌లో మన్యం కాఫీ గింజలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. కాగా గతేడాది జూలైలో ఢిల్లీలో నిర్వహించిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ‘అరకు కాఫీ’ ప్రత్యేకతను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో అప్పట్లో మరో మారు అరకు కాఫీ దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది.
1989 నుంచి మన్యంలో కాఫీ సాగు
గిరిజనులు పోడు వ్యవసాయంపై ఆధారపడి అడవులను నాశనం చేయకుండా ఉండేందుకు గానూ 1989లో కాఫీ సాగును ప్రభుత్వం గిరిజనులకు పరిచయం చేసింది. దీంతో 1989 నుంచి 2002 వరకు కేవలం 32,072 ఎకరాల్లో మాత్రమే కాఫీ తోటలు అభివృద్ధి జరగ్గా, 2003 నుంచి 2008 వరకు 64,265 ఎకరాల్లో కాఫీ తోటలు వేశారు. ఆ తరువాత 2009లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. దీంతో 2009 నుంచి 2016 వరకు 61,684 ఎకరాల్లో, 2016 నుంచి 2024 వరకు 84 వేల ఎకరాల్లో కాఫీని అభివృద్ధి చేశారు. ఈ లెక్కన 1989 నుంచి 2024 వరకు ఏజెన్సీ వ్యాప్తంగా 2 లక్షల 42 వేల 21 ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. ఆయా తోటల ద్వారా 2 లక్షల 36 వేల 618 మంది గిరిజన కాఫీ రైతులు లబ్ధి పొందుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇవి కాకుండా గిరిజన రైతులు స్వయంగా తమ వారసత్వ భూముల్లో వేసుకున్న సుమారుగా 30 వేల ఎకరాలు కలిపి మొత్తం ఏజెన్సీ వ్యాప్తంగా ప్రస్తుతం 2 లక్షల 72 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. అయితే వాటిలో సుమారుగా లక్షా 52 వేల ఎకరాల్లో ఏడాదికి 71 వేల టన్నుల కాఫీ పండ్ల దిగుబడి వస్తుందని అంచనా. దీంతో సుమారుగా 14 వేల టన్నుల క్లీన్ కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి. ఏడాదికి ఒక ఎకరం కాఫీ తోటతో సుమారుగా రూ.50 నుంచి రూ.60 వేల ఆదాయం సమకూరుతున్నది. దీంతో కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే సేంద్రీయ పద్ధతిలో కాఫీ ఉత్పత్తి జరగడంతో ఇక్కడ ఉత్పత్తి చేసే కాఫీ గింజలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ గిరాకీ ఉంది.
కాఫీ తోటలకు ప్రాణం పోసిన చంద్రబాబునాయుడు
2014లో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్‌కు భారీ స్థాయిలో కాఫీ తోటలు ధ్వంసమయ్యాయి. దీంతో కాఫీ రైతులను ఆదుకునేందుకు 2015 నుంచి 2025 వరకు లక్ష ఎకరాల కాఫీ తోటల అభివృద్ధికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.526 కోట్లతో ఒక ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రత్యేకంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు అభివృద్ధి చేశారు. కాగా 2016లోనే చంద్రబాబునాయుడు మన్యం కాఫీని ‘అరకు కాఫీ’గా ప్రపంచానికి పరిచయం చేసి ప్రమోట్ చేశారు. ఇందులో భాగంగా అదే ఏడాది దేశ ప్రధాని మోదీతో పాటు అనేక మంది ప్రముఖులతో అరకు కాఫీని తాగించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ మరింతగా ప్రాచుర్యం పొందింది.
పార్లమెంట్‌లో కాఫీ స్టాల్ ఏర్పాటుకు చర్యలు
అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేయించిన సర్కారు పెద్దలు పార్లమెంట్‌లోనూ కాఫీ స్టాల్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం అసెంబ్లీలో కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ చైౖర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ జీసీసీ ఉత్పత్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌లను జ్ఞాపికగా అందించారు. తాను జీసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో అరకు కాఫీ స్టాల్‌ను అసెంబ్లీ ఏర్పాటు చేయడం, పార్లమెంట్‌లో సైతం ఏర్పాటు చేసే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని, గిరిజన కాఫీని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు గిరిజనులుగా తామంతా రుణపడి ఉంటామని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు.