Share News

గుర్రంపాలెంలో అక్రమ క్వారీయింగ్‌

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:18 AM

పెందుర్తి మండలం గుర్రంపాలెం పారిశ్రామిక లేఅవుట్‌లో అక్రమంగా క్వారీయింగ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో గనుల శాఖ విజిలెన్స్‌ విభాగం మీనమేషాలు లెక్కించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గుర్రంపాలెంలో అక్రమ క్వారీయింగ్‌

  • నోటీసులకే పరిమితమైన గనుల విజిలెన్స్‌ విభాగం

  • జరిమానా విధించడంపై మీనమేషాలు

  • పెద్దల జోక్యమే కారణం

  • విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):

పెందుర్తి మండలం గుర్రంపాలెం పారిశ్రామిక లేఅవుట్‌లో అక్రమంగా క్వారీయింగ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో గనుల శాఖ విజిలెన్స్‌ విభాగం మీనమేషాలు లెక్కించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్మిట్లు తీసుకోకుండా గ్రావెల్‌/మట్టి తవ్వినందుకు ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చిన విజిలెన్స్‌ అధికారులు తరువాత జరిమానా విధించడానికి వెనుకంజ వేశారనే వాదన వినిపిస్తోంది. కూటమికి చెందిన కీలక నేత ఒకరు జోక్యం చేసుకోవడంతోనే అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ ఐదేసి ఎకరాల ప్లాట్లతో లేఅవుట్‌ రూపొందించింది. వాటిని పలువురు పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. ఆ అనువుగా ప్లాట్లు అభివృద్ధి చేసుకునేందుకు భారీగా గ్రావెల్‌/మట్టి అవసరమైంది. అందుకు గనుల శాఖ నుంచి తాత్కాలిక పర్మిట్లు తీసుకోవాలి. కానీ అటువంటిదేమీ లేకుండా సమీపంలో గల కొండల నుంచి భారీస్థాయిలో గ్రావెల్‌/మట్టి తవ్వి ప్లాట్లు చదునుకు తరలించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితం కావడంతో గనుల శాఖ, గనుల శాఖ విజిలెన్స్‌ అధికారులు పలుమార్లు తనిఖీలు చేశారు. గుర్రంపాలెం పారిశ్రామిక లేఅవుట్‌లో అక్రమ క్వారీయింగ్‌ ప్రాంతం, ఫిల్‌ చేసిన ప్లాట్లు పరిశీలించారు. ఈ వ్యవహారంలో గనులశాఖ విజిలెన్స్‌ అధికారులు సుమారు ఎనిమిది మందికి నోటీసులు జారీచేశారు. ఎంత మేర గ్రావెల్‌, మట్టి తవ్వి తరలించారో కొలతలు వేసి...ఆ మేరకు జరిమానా విధించాలంటూ గనుల శాఖ రెగ్యులర్‌ విభాగానికి సిఫారసు చేయాలి. అయితే జరిమానా విధింపుపై ఇంతవరకూ విజిలెన్స్‌ నుంచి రెగ్యులర్‌ విభాగానికి ఎటువంటి సమాచారం అందలేదు. నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే జరిమానా విధించే నోటీసులు జారీచేయాలని సూచిస్తూ రెగ్యులర్‌ విభాగానికి ఎటువంటి లేఖ రాయలేదని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 19 , 2025 | 01:26 AM