క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తో ఏయూ కళకళ
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:12 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పరిధిలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు భారీ వేతనాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలు
గడిచిన మూడు నెలల్లో సుమారు 900 మంది ఎంపిక
రూ.మూడు లక్షల నుంచి రూ.15 లక్షల ప్యాకేజీ
కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల పెంపుతో సత్ఫలితాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పరిధిలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు భారీ వేతనాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గడిచిన మూడు నెలల్లో సుమారు 900 మంది రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలను సాధించారు. ఎంహెచ్‌ఆర్‌ఎం విద్యార్థి రూ.1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో పోలెండ్‌లో ఉద్యోగాన్ని పొందాడు. పరిశ్రమల/సంస్థల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇండస్ర్టీ మెంటార్‌షిప్, ఇండస్ర్టీ ఇంటర్న్‌షిప్ వంటి ప్రోగ్రామ్స్‌ను అమలు చేస్తున్నారు.
90 శాతం మందికి ప్లేస్‌మెంట్స్
సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ పరిధిలోని కెమిస్ర్టీ, బయో టెక్నాలజీ, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, బోటనీ, జియో ఫిజిక్స్ వంటి కోర్సులు పూర్తిచేసిన 710 మంది విద్యార్థులు గడిచిన మూడు నెలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికయ్యారు. వీరికి నెలకు కనిష్ఠంగా రూ.3 లక్షల నుంచి గరిష్ఠంగా ఆరు లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకువచ్చాయి. ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ పరిధిలోని ఎంబీఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంకాం, ఎకనామిక్స్, థియేటర్ ఆర్ట్స్, జర్నలిజం వంటి కోర్సులు పూర్తిచేసిన 280 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఎంహెచ్‌ఆర్‌ఎం పూర్తిచేసిన విద్యార్థి రూ.1.3 కోట్ల వేతనంతో ఉద్యోగాన్ని సాధించాడు. మిగిలిన విద్యార్థులు రూ.4.5 లక్షల నుంచి తొమ్మిది లక్షల వేతనాలను పొందారు. అలాగే, ఫార్మసీ కాలేజీ పరిధిలోని 48 మంది నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. వీరికి ఉద్యోగాలు కల్పించిన సంస్థల్లో ఫైజర్, డాక్టర్ రెడ్డీస్, లారస్, అరబిందో, సత్యరాక్స్ వంటివి ఉన్నాయి. న్యాయ విద్య పూర్తిచేసిన విద్యార్థులు భారీ వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. ఇప్పటివరకూ పది మంది విద్యార్థులు మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. వీరిలో ఎనిమిది మంది ప్రముఖ సంస్థ లీగల్ ఫోరంలో చేరగా, ఇద్దరు శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్‌లో లీగల్ అడ్వయిజర్స్‌గా చేరారు. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌కు చెందిన 12 మంది విద్యార్థులు రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించారు. పలు సంస్థల్లో మార్కెటింగ్, బిజినెస్ అనలిటిక్స్ విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
నిరంతరం టచ్‌లో ఉంటూ క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం
- వీఆర్ రెడ్డి, ప్లేస్ మెంట్ ఆఫీసర్, సౌత్ క్యాంపస్ ఏయూ
వర్సిటీలోని వివిధ కోర్సులు చేసిన విద్యార్థుల వివరాలు, వారిలో ఉన్న నైపుణ్యాలతో కూడిన జాబితా రూపొందించుకుని నిరంతరం కార్పొరేట్ కంపెనీలతో టచ్‌లో ఉంటున్నాం. ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరుల గురించి మాకు సమాచారాన్ని అందించిన వెంటనే ఇంటర్వ్యూల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. పరిశ్రమలు, సంస్థలు అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ నేర్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇందుకోసం కొన్నాళ్లు కిందట ప్రవేశపెట్టిన ఇండస్ర్టీ మెంటార్‌షిప్, ఇండస్ర్టీ ఇంటర్న్‌షిప్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటివల్ల పరిశ్రమల అవసరాలపై విద్యార్థులకు ఒక అవగాహన కలుగుతోంది. గతంతో పోలిస్తే ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు భారీ వేతనాలతో ఉద్యోగాలను సాధిస్తున్నారు.