Share News

భారీ వాహనాలతో బెంబేలు

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:15 AM

కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఈ నెల 13వ తేదీన ద్విచక్ర వాహనాన్ని భారీ టిప్పర్‌ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడ మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

భారీ వాహనాలతో బెంబేలు

  • 24 గంటలూ నగరం మధ్య నుంచి రాకపోకలు

  • బైపాస్‌ (కొత్త రహదారి) అందుబాటులోకి వచ్చినా టోల్‌ తప్పించుకునేందుకు పాత మార్గంలోనే ప్రయాణం...

  • పెరుగుతున్న టాఫిక్‌ సమస్య

  • తరచూ రోడ్డు ప్రమాదాలు

  • పట్టించుకోని పోలీసులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఈ నెల 13వ తేదీన ద్విచక్ర వాహనాన్ని భారీ టిప్పర్‌ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడ మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వెంకోజీపాలెం జంక్షన్‌ సమీపాన ఈ నెల 15వ తేదీ ఉదయం ముందు వెళుతున్న కారును వెనుక నుంచి భారీ వాహనం ఢీకొంది. దీంతో కారు రోడ్డుపై బోల్తాపడింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.

...ఇలాంటి ఘటనలు నగరంలో ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. భారీ వాహనాలతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రద్దీ సమయాల్లో నగరంలోకి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్‌ నగరవాసుల నుంచి వినిపిస్తోంది.

భారీ వాహనాలను పెద్ద నగరాలు, పట్టణాల్లోకి ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు అనుమతించరు. రాత్రి పది తరువాత ఉదయం ఏడు గంటల లోపు మాత్రమే అనుమతిస్తారు. అయితే విశాఖ విషయానికి వస్తే నగరం మధ్య నుంచి జాతీయ రహదారి వెళుతోంది. దీంతో భారీ వాహనాలు ఏ సమయంలోనైనా రాకపోకలు సాగించగలుగుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు నగర పరిధిలోని రోడ్లన్నీ ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. మారికవలస, కొమ్మాది, కార్‌షెడ్‌, ఎండాడ, హనుమంతవాక, మద్దిలపాలెం, సత్యం జంక్షన్‌, తాటిచెట్లపాలెం, షీలానగర్‌, గాజువాక వంటి జంక్షన్లలో ట్రాఫిక్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. రెండు, మూడుసార్లు సిగ్నల్‌ పడితేనే గానీ జంక్షన్‌ దాటడానికి వీలుండని పరిస్థితి ఉంటుంది. అలాంటి రద్దీ సమయాల్లో భారీ వాహనాలు జాతీయ రహదారి మీదుగా రావడం వల్ల ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. అదేవిధంగా పక్క నుంచి వచ్చే వాహనాలను భారీ వాహనాల డ్రైవర్లు గుర్తించకపోవడం, సరిగా అంచనా వేయలేకపోవడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి మీదుగా రాకపోకలకు అవకాశం ఉంది కదా అని...భారీ వాహనాలు నగరంలోకి ఇష్టారాజ్యంగా వచ్చివెళుతున్నాయి. దీనివల్ల నగర అంతర్గత రోడ్లపై వాహనాల రాకపోకలకు ఆటంకం ఎదురవుతోంది.

కొత్త జాతీయ రహదారిపైకి మళ్లించాలి

నగరంలో భారీ వాహనాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం కొత్త జాతీయ రహదారిని అందుబాటులోకి తెచ్చింది. అనకాపల్లి నుంచి పెందుర్తి మీదుగా ఆనందపురం జంక్షన్‌లో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిని కలుపుతూ కొత్త రహదారిని నిర్మించింది. దీనివల్ల ఒడిశా, శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ఆనందపురం వద్ద నుంచి పెందుర్తి మీదుగా అనకాపల్లి వైపు వెళ్లేందుకు అవకాశం ఉంది. అలాగే చెన్నై, విజయవాడ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు నగరంలోకి రాకుండా అనకాపల్లి నుంచి పెందుర్తి మీదుగా ఆనందపురం వైపు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా భారీ వాహనాలు నగరంలోని ట్రాఫిక్‌ ఇబ్బందులను తప్పించుకుని సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. అదేసమయంలో నగరంలో కూడా భారీ వాహనాల తాకిడి తగ్గి, ట్రాఫిక్‌ సమస్యతోపాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని అంతా భావించారు. కానీ కొత్త జాతీయ రహదారిపై రెండు టోల్‌గేట్‌లు ఉండడంతో వాటిని తప్పించుకునేందుకు భారీ వాహనాలు నగరం మధ్య నుంచి ఉన్న జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి. దీనివల్ల కొత్త జాతీయ రహదారి నిర్మాణ లక్ష్యం నెరవేరకుండా పోయినట్టయింది. మరోవైపు నగరంలో ట్రాఫిక్‌ సమస్య యథావిధిగా కొనసాగుతోంది. నగరంలోకి భారీ వాహనాల రాక వల్ల కలుగుతున్న ఇబ్బందులు, జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కొత్త జాతీయ రహదారిపైగా మళ్లించేందుకు నగర పోలీస్‌ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 01:15 AM