వక్ఫ్‌ ఆస్తులకు అల్లాయే దిక్కు!

ABN , First Publish Date - 2022-10-29T04:35:04+05:30 IST

రాష్ట్రంలో మైనారిటీలకు సంబంధించిన వక్ఫ్‌ ఆస్తులు పరాధీనమవుతున్నాయి. లీజు పేరుతో ఒక్కొక్కటిగా అప్పనంగా వాటిని కట్టబెట్టేందుకు వైసీపీలోని కొందరు పెద్దలు రంగం సిద్ధంచేశారు. సాక్షాత్తు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ తన బంధువుల కోసం సిఫారసు లేఖలు ఇచ్చినట్టు సమాచారం.

వక్ఫ్‌ ఆస్తులకు అల్లాయే దిక్కు!
Waqf properties

బంధువులకు ఇచ్చేసుకుంటున్న వైసీపీ పెద్దలు

కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్ల కోసం వక్ఫ్‌ భూములు

మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ సిఫారసు కలకలం

బంధువుల కోసం బోర్డు చైర్మన్‌కు లేఖ!

మదనపల్లి, కదిరిలో లీజుకు ఇవ్వాలని సిఫారసు

గుంటూరులో ఇటీవలే బయటపడ్డ పైరవీ ‘రాజ్‌’

రూల్స్‌ పక్కనపెట్టి తలొంచుతున్న వక్ఫ్‌ బోర్డు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌భూములు సుమారు 70 వేల ఎకరాలు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 25 వేల ఎకరాలు ఉండగా, అందులో సుమారు 2500 ఎకరాలు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో 162 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై మైనారిటీ కమిషన్‌ ఆదేశాలతో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్‌ ఆస్తులుగా రికార్డు చేయకపోవడాన్ని కొందరు అక్రమార్కులు అనుకూలంగా మార్చుకున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో కర్నూలు జిల్లాలో భూములకు ఏకంగా రిజిస్ర్టేషనే చేసేసుకున్నారు.

లీజుపేరిట గేలం! ఆనక సాంతం సొంతం! వక్ఫ్‌ ఆస్తులు కనిపించడమే ఆలస్యం ఉఫ్‌మని ఊదేస్తున్న తీరు ఇది. ప్రార్థనామందిరాల నిర్వహణ, ధార్మిక సేవల కోసం వెనుకటికి రాజులు, జమీందారులు, దాతలు ఇచ్చిన వేలాది ఎకరాల భూములు వక్ఫ్‌ ఆస్తులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. ఖాళీగా కనిపించిన వక్ఫ్‌ భూములను ఎగరేసుకుపోవడం మొదటినుంచీ ఉన్నదే! వైసీపీ వచ్చాక ఈ కబ్జాలపర్వంలో దర్జా పెరిగింది. గుంటూరులో ఇటీవల వక్ఫ్‌ భూముల మధ్య ఉన్న రెవెన్యూ భూములను సైతం కలిపేసుకునేందుకు నడిచిన ‘పైరవీ’ రాజ్‌ ఉదంతం చూశాం. అంతకుమించిన అనూహ్య రీతిలో రాజ్యాంగ పదవిలో ఉండీ...వక్ఫ్‌బోర్డుకు సిఫారసు లేఖలు రాయడం కలకలం రేపుతోంది. మదనపల్లి, కదిరిలోని వక్ఫ్‌ భూములను తన బంధువులు కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు కట్టుకునేందుకు లీజుకు ఇవ్వాలని ఆ లేఖల్లో కోరినట్టు సమాచారం.

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మైనారిటీలకు సంబంధించిన వక్ఫ్‌ ఆస్తులు పరాధీనమవుతున్నాయి. లీజు పేరుతో ఒక్కొక్కటిగా అప్పనంగా వాటిని కట్టబెట్టేందుకు వైసీపీలోని కొందరు పెద్దలు రంగం సిద్ధంచేశారు. సాక్షాత్తు శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ తన బంధువుల కోసం సిఫారసు లేఖలు ఇచ్చినట్టు సమాచారం. వక్ఫ్‌ ఆస్తులను సంరక్షించాల్సిన వక్ఫ్‌బోర్డు సైతం ఈ సిఫారసులకు శిరస్సు వంచేసినట్టు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు రావడమే తడవు.. నిబంధనలు ఏం చెబుతున్నాయనేది సంబంధం లేకుండా వెనువెంటనే బోర్డు రంగంలోకి దిగిపోతోందన్న విమర్శలు జిల్లాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ చేసిన మూడు సిఫారసులకు తలొంచినట్టు సమాచారం. సత్యసాయిజిల్లా కదిరి పట్టణానికి చెందిన కె.సదత్‌ ఆలీఖాన్‌కు మదనపల్లిలో సర్వే నంబర్‌ 144లోని మూడు ఎకరాలు విలువైన వక్ఫ్‌ భూమిని వాణిజ్య సముదాయం, రెస్టారెంట్‌ నిర్మించుకునేందుకు అప్పగించాలనేది తొలి సిఫారసు. కదిరి పట్టణానికి చెందిన కోలార్‌ సల్లావుద్దీన్‌కు కదిరి మండలం కూటగుల్ల గ్రామంలో ఉన్న సర్వే నంబర్‌ 199లో 2.50 ఎకరాల భూమిని అప్పగించాలని రెండో సిఫారసులో కోరారు. మదనపల్లికి చెందిన కె.తాబ్రేజ్‌ ఆలీఖాన్‌కు మదనపల్లిలోని సర్వే నంబర్‌ 130లో మూడు ఎకరాలు వాణిజ్య సముదాయం, రెస్టారెంట్‌ నిర్మాణం కోసం కేటాయించాలని మూడో సిఫారసులో అడిగారు. దీనిపై వక్ఫ్‌బోర్డు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు వక్ఫ్‌ ఆస్తులను కాపాడుకునేందుకు కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ పలు దఫాలు రాష్ట్రాలను అప్రమత్తంచేస్తూ లేఖలు రాస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వక్ఫ్‌భూములను గాలికొదిలేసిందన్న వ్యాఖ్యలు వక్ఫ్‌బోర్డు వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఉదాహరణకు, అన్నమయ్య జిల్లాలో ఇటీవల 162 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు మైనారిటీ కమిషన్‌కు ఫిర్యాదులు వచ్చాయి. కమిషన్‌ స్పందించి జాయింట్‌ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు.

కర్నూలు జిల్లాలో వక్ఫ్‌ ఆస్తులను రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్‌ ఆస్తులుగా రికార్డు చేయకపోవడంతో అక్కడ రెవెన్యూ అధికారుల సహకారంతో సబ్‌డివిజన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేశారు. మైనారిటీ కమిషన్‌కు ఫిర్యాదులందడంతో ఆయా రిజిస్ట్రార్‌లకు నోటీసులిచ్చారు. వక్ఫ్‌ ఆస్తులు ఆక్రమణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 35 ఫిర్యాదులందాయని, వాటిపై విచారణకు ఆదేశించామని మైనారిటీ కమిషన్‌ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల ఎకరాలు వక్ఫ్‌ ఆస్తులుంటే, అందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే 25 వేల ఎకరాలున్నట్లు సమాచారం. అయితే ఒక్క కర్నూలుజిల్లాలోనే సుమారు 2500 ఎకరాలకు పైగా ఈ భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయని చెబుతున్నారు. ఓ వైపు వక్ఫ్‌ ఆస్తులను ఆక్రమించుకుంటుండటం, మరో వైపు రెవెన్యూ రికార్డుల్లో వక్ఫ్‌ ఆస్తులుగా వాటిని పేర్కొనకుండా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సొంతం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇటీవల గుంటూరులో వక్ఫ్‌ ఆస్తులకు మధ్యలో ఉన్న రెవెన్యూ భూములను సైతం కబ్జా చేసేందుకు అధికారపార్టీకి చెందిన రాజ్యాంగపదవుల్లో ఉన్న వ్యక్తి కుమారుడి పైరవీలు చేశారు. ఆ భూములు వక్ఫ్‌ ఆస్తులు కాదని రికార్డులు మార్చేందుకు సిద్ధమవడంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దీంతో ఈ ప్రయత్నాలకు గండపడింది.

లీజు ఇచ్చేందుకు నిబంధనలేవీ?

ఖాళీగా ఉన్న భూములను కాపాడుకోవడంలో భాగంగా లీజుకు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటికి కొన్ని నిబంధనలున్నాయి. లీజుకు ఇవ్వడంలో టెండరు విధానం పాటించాలి. ఓపెన్‌ టెండర్లు పారదర్శకంగా పిలిచి అధికారికంగా లీజు అగ్రిమెంట్లు చేసుకోవాలి. అయితే అవేవీ పట్టించుకోకుండా ఫైరవీలకు తలొగ్గి ఎవరికి కట్టబెట్టాల్నో వారికి అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు. పైగా పట్టణాలు, హైవేలలో విలువైన ఆస్తులను అప్పనంగా 30 ఏళ్లకు లీజు ఇవ్వడంద్వారా ఆస్తులను పరోక్షంగా పరాధీనం చేసేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు వంటి నిర్మాణాలకు లీజుకు ఇస్తే ఆ ఆస్తులను అంత త్వరగా తిరిగి స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక పక్కా వ్యూహంతో వక్ఫ్‌ ఆస్తులను లాగేసుకునేందుకు అధికారపార్టీ నేతలు సిద్ధమైనట్లు విమర్శిస్తున్నారు. కాపాడాల్సిన ప్రభుత్వంలోని పెద్దనేతలే కబ్జాలకు ఊతమిస్తే వక్ఫ్‌బోర్డు ఆస్తులకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-10-29T05:56:00+05:30 IST