Meta: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సంచలన ప్రకటన.. పాపం 11 వేల మంది ఉద్యోగులు.. | Facebook Parent Meta shocking decesion to layoffs 11,000 Employees psnr

Meta: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సంచలన ప్రకటన.. పాపం 11 వేల మంది ఉద్యోగులు..

ABN , First Publish Date - 2022-11-09T18:29:15+05:30 IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) సంచలన ప్రకటన చేసింది.

Meta: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సంచలన ప్రకటన.. పాపం 11 వేల మంది ఉద్యోగులు..

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) సంచలన ప్రకటన చేసింది. 11 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం వెల్లడించింది. కంపెనీ ఆదాయం క్షీణత, లాభాల్లో తగ్గుదల పరిస్థితుల నేపథ్యంలో వ్యయాల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకునట్టు తెలిపింది. ఈ మేరకు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ ( Mark Zuckerberg) బ్లాగ్ పోస్టులో వెల్లడించారు. ‘‘ మెటా చరిత్రలోనే అత్యంత కఠిన మార్పుల్లో కొన్నింటిని ఈ రోజు పంచుకుంటున్నాను. కంపెనీ ఉద్యోగుల పరిణామాన్ని 13 శాతం మేర కుదించాలని నిర్ణయించుకున్నాను. ప్రతిభ కలిగిన 11 వేలకుపైగా మంది ఉద్యోగులు బయటకు వెళ్లనున్నారు’’ అని పోస్టులో పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గింపు లక్ష్యంగా మరిన్ని చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వ్యయాల తగ్గింపే లక్ష్యంగా తొలి త్రైమాసికంలో నియామకాలు చేపట్టబోమని, మెటాను సమర్థవంత కంపెనీగా ఆవిష్కరించడమే ఈ నిర్ణయాల లక్ష్యమని చెప్పారు.

ఉద్యోగులకు క్షమాపణలు..

ఈ కఠిన నిర్ణయాలకు బాధ్యత వహిస్తున్నట్టు పేర్నొన్న మార్క్‌జుకర్ బర్గ్.. మెటా ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. ఉద్యోగులకు మింగుడుపడని నిర్ణయమని తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభావిత ఉద్యోగులను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. కాగా తొలగింపునకు గురికానున్న ఉద్యోగులకు 16 వారాల వేతనం (4 నెలల) చెల్లించనున్నట్టు మెటా పేర్కొంది. అంతేకాకుండా 6 నెలల హెల్త్‌కేర్ వ్యయాలను కూడా అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ప్రధాన టెక్ కంపెనీలైన ఎలాన్ మస్క్ సారధ్యంలోని ట్విటర్ (Twitter), మైక్రోసాఫ్ట్ (Microsoft) పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న సమయంలోనే మెటా (Meta) కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఫేస్‌బుక్ మొదలైన నాటి నుంచి ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి.

Updated Date - 2022-11-09T18:35:32+05:30 IST