MUNUGODU: మునుగోడులో 93% రికార్డు ఓటింగ్
ABN , First Publish Date - 2022-11-04T03:29:56+05:30 IST
రాష్ట్రంతోపాటు దేశంలోనూ ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ముగిసింది.

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక శాతం
ఓటు వేసిన 2,24,878 మంది
ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక
డబ్బు కావాలంటూ ఓటర్ల డిమాండ్
స్థానికేతరుల మకాం, అక్రమ నిల్వలపై ఆందోళనలు
పలు చోట్ల టీఆర్‌ఎస్ నేతల నుంచి డబ్బు, మద్యం స్వాధీనం
తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తామన్న స్థానికులు
ఓటర్లకు సెల్‌ఫోన్‌లో కేటీఆర్ హామీ
నల్లగొండ/హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంతోపాటు దేశంలోనూ ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ముగిసింది. ఊహించినట్లుగానే రికార్డు స్థాయిలో 93 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,24,878 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం కావడం గమనార్హం. 2018 సాధారణ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో నమోదైన 91.27 శాతమే ఇప్పటిదాకా అత్యధికంగా ఉంది. అప్పుడు కూడా 91.07 శాతంతో మునుగోడు ఆ తరువాతి స్థానంలో నిలిచింది. తాజాగా ఉప ఎన్నికలో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.
బుధవారం అర్ధరాత్రి వరకు టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, చోటుచేసుకున్న ఘటనలతో పోలింగ్ రోజు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన నెలకొన్నా.. చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు, నాయకులు ఆందోళనకు దిగడం వంటివి తలెత్తగా.. అధికారులు, పోలీసులు వీటిని చక్కదిద్దారు. కొన్ని చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. కాగా, పలువురు ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ పార్టీల నాయకులను బహిరంగంగానే నిలదీయడం గమనార్హం.
పెద్ద పెద్ద లీడర్లకు రూ.లక్షలు ముట్టజెప్పారని, తమకు మాత్రం ఏమీ ఇవ్వలేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మర్రిగూడ మండలం శివన్నగూడంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని పలువురు ఓటర్లు అడ్డుకొని తమకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మరోవైపు మునుగోడు మండల కేంద్రంలో కొందరు ఓటర్లు తమకు డబ్బులు అందలేదంటూ బీజేపీ నేతల ఇళ్లకు వెళ్లి మరీ నిలదీశారు.
ముంబై నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వలేదు
డబ్బులు, చార్జీలు ఇస్తామని టీఆర్‌ఎస్ నేతలు ఫోన్ చేయడంతో నవీముంబై నుంచి వచ్చామని, కానీ తమకు డబ్బులు ఇవ్వలేదంటూ గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కాగా, మగవాళ్లకు వేలు, లక్షల రూపాయలు ఇస్తారని, ఆడవాళ్లకు మాత్రం రూ.100 కూడా ఇవ్వరని మర్రిగూడలోని పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడ్డ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమ గ్రామ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, అప్పటివరకు ఓటింగ్‌కు వెళ్లబోమని గట్టుప్పల్ మండలం రంగం తండా, హాజీనా తండావాసులు.. భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఈ ప్రాంతానికి ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి కేటీఆర్.. వారితో ఫోన్‌లో మాట్లాడారు.
సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారంతా ఓటింగ్‌కు కదిలారు. మర్రిగూడ మండలం అంతంపేట గ్రామస్థులు సైతం ఇదే తరహాలో కేటీఆర్ హామీతో పోలింగ్ బూత్‌లకు వెళ్లారు. ఇక నియోజకవర్గంలో పరిస్థితిని అంచనా వేసిన అధికారులు పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 5వేల మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. వృద్ధుల కోసం వీల్‌చైర్లు, ఓటర్లకు ఎండదెబ్బ తగలకుండా షామియానాలు, మంచినీరు, వైద్యశాఖ సిబ్బందితో మందులు అందుబాటులో ఉంచారు. మొత్తం 298 పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని నల్లగొండ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి ఎన్నికల పరిశీలకులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఓటు వేసిన స్రవంతి, కూసుకుంట్ల..
కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి చండూరు మండలం ఇడికూడలో ఓటుహక్కును వినియోగించుకోగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సంస్థాన్ నారాయణపురం మండలం లింగంవారిగూడెంలో ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ పోలింగ్ రోజు నియోజకవర్గంలో వివిధ విన్యాసాలతో ఓటర్లను నవ్వించారు. చేతివేళ్లకు నిండా తన గుర్తు అయిన ఉంగరాలతో పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యక్షమయ్యారు. నియోజకవర్గమంతా పర్యటించేందుకు సమయం లేదంటూ ప్రతి కేంద్రం నుంచీ పరుగులు తీస్తూ వెళ్తుండడంతో ఓటర్లు ఆయనను ఆసక్తిగా పరిశీలించారు.
మర్రిగూడ మండలం శివన్నగూడం రిజర్వాయర్‌కు చెందిన భూనిర్వాసితులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ 33 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో ఈవీఎం మొరాయించడంతో కొత్త యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి అది కూడా ఇబ్బంది పెట్టడంతో గంటసేపు పోలింగ్ నిలిచిపోయింది. చండూరు మండలం కొండాపురం, సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలోనూ ఈవీఎం మొరాయించింది. చండూరు మునిసిపాలిటీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వెళ్లిన మహిళ కాలు గ్రిల్‌లో ఇరుక్కుపోవడంతో తీవ్ర ఇబ్బంది పడింది. స్పందించిన సిబ్బంది ఆ మహిళ కాలిని సురక్షితంగా బయటకు తీశారు. చండూరు మండలం కోటయ్యగూడెంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్‌లో మంచి స్పందన కనిపించింది.
ఉప ఎన్నికలన్నింటికన్నా అధికం..
రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో 91.07 శాతం పోలింగ్ నమోదైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.14 శాతం పోలింగ్ నమోదవడం కూడా అప్పట్లో అత్యధికమే. దీంతో ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరుగుతుందని భావించినట్లుగానే 93 శాతం నమోదయింది. ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలతో పోలిస్తే కూడా మునుగోడులోనే ఎక్కువ నమోదైంది. అంతకుముందు హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో 84.75 శాతం, దుబ్బాకలో 82.61 శాతం, నాగార్జునసాగర్ 88 శాతం, హుజూరాబాద్‌లో 87 శాతం ఓటింగ్ నమోదైంది.