అటవీ భూమి అన్యాక్రాంతం
ABN , First Publish Date - 2022-07-05T05:21:10+05:30 IST
అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నది. రక్షించాల్సిన అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని కంపార్ట్మెంట్ 20లోని 159 సర్వే నంబర్లో 440 ఎకరాల అటవీ భూమి ఉన్నది. భూజరంపేట్, పీర్యాతండా, కుకుట్లపల్లి, మనంతాయిపల్లి తండాల పరిధిలో ఈ భూమి విస్తరించి ఉన్నది.

అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
అందోళనకు సిద్ధమవుతున్న గిరిజనులు
కౌడిపల్లి, జూలై 4: అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నది. రక్షించాల్సిన అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని కంపార్ట్మెంట్ 20లోని 159 సర్వే నంబర్లో 440 ఎకరాల అటవీ భూమి ఉన్నది. భూజరంపేట్, పీర్యాతండా, కుకుట్లపల్లి, మనంతాయిపల్లి తండాల పరిధిలో ఈ భూమి విస్తరించి ఉన్నది. కూకుట్లపల్లి గ్రామానికి చెందిన కొందరు పీర్యాతండా సమీపంలో అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. భూమిని చదును చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. తండా సమీపంలోని అటవీ భూమిలోని గోర్రెపోనికుంట, జలకుంట, వీరబోయిన చెలక, పలుగుగుట్ట, బాపనిదాని కుంట, వైకుంఠధామం సమీపంలో అటవీ భూమి 70 ఎకరాల్లో చెట్లను నరికి చదును చేశారు. ఈ విషయంపై పీర్యాతాండాకు చెందిన గిరిజనులు పలుమార్లు అధికారులకు విన్నవించారు. అటవీ భూమి కబ్జాపై మెదక్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుకు కూడా ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు. అయినా కనీసం పరిశీలించేందుకు కూడా రాలేదని భుజరంపేట్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్, పీర్యాతండాకు చెందిన నునావత్ శంకర్, చిన్న శంకర్, రాంచందర్; దేన్య, అజ్మీర రూప్సింగ్, శివరాం, శ్రీను, సుభాష్, గణేష్, సురేష్ ఆరోపించారు. అటవీశాఖ అధికారులు కుకుట్లపల్లి గ్రామస్థులకు వంతపాడుతున్నారని వారు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు తప్పుడు సమాచారం అందించి తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. అటవీశాఖ అధికారులు స్పందించి అటవీ భూమిని కాపాడకపోతే ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విషయంపై డిప్యూటీ అర్ఎ్ఫవో రాజమణిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. సదరు భూమి తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. అటవీ భూములను అక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, తమ పరిధిలోనిది కాకపోవడంతోనే సదరు భూమిపై స్పందించడం లేదని తెలిపారు.