మత్స్యశాఖ మీన మేషాలు
ABN , First Publish Date - 2022-11-11T00:16:42+05:30 IST
వానాకాలం సీజన్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి.

- చేప పిల్లల పంపిణీలో జాప్యం
- కాంట్రాక్టర్లు లేక నిలిచిన సరఫరా
- నిరీక్షిస్తున్న మత్స్యకారులు
- సీజన్ దాటితే కష్టమని ఆందోళన
కామారెడ్డి, నవంబరు 10: వానాకాలం సీజన్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఒకవైపు రైతులు, మరోవైపు మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పుష్పలంగా నీరు వచ్చి చేరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ మత్స్యకారుల ఆశలకు అంతలోనే అడ్డుకట్ట పడింది. ఆయా జలవనరుల్లో చేపపిల్లల పంపిణీకి మత్స్యశాఖ మీన మేషాలు లెక్కిస్తోంది. చేప పిల్లలు పెంచి ఉపాధి పొందాలని ఆశించిన మత్స్యకారులు సరైన సమయంలో సరఫరా లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకారుల ఎదురుచూపులు
జిల్లాలో మొత్తం 634 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 217 మత్స్య సొసైటీలు ఉన్నాయి. ఇందులో 35 మహిళ సొసైటీలు ఉన్నాయి. వీటిలో 12,539 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా 10 వేలకు పైగా కుటుంబాలు మత్స్యవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఏటా చెరువులు నిండగానే జూన్, జూలై నెలల్లో మత్స్యకార సొసైటీలకు ప్రభుత్వం చేప పిల్లలు అందించాల్సి ఉంటుంది. జిల్లాకు 2 కోట్ల 70లక్షలు సీడ్ అందించాల్సి ఉండగా 1 కోటి 91 లక్షలు మాత్రమే సీడ్ అందించారు. ప్రతీ చేపపిల్లకు రూ.38 పైసలు వెచ్చించి బొత్స, రవ్వ, బంగారు తీగలు లాంటి నాణ్యమైన సీడ్ సరఫరా చేయాల్సి ఉంటుంది. సీడ్ అందకపోవడంతో మిగిలిన మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు.
ఇచ్చింది 1 కోటి 91లక్షలు మాత్రమే
జిల్లాల్లో 634 చెరువులకు గాను 578 చెరువుల్లో మాత్రమే ఇప్పటి వరకు సీడ్ పంపిణీ చేశారు. కాంట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడం, ఆంధ్రసీడ్ ఆలస్యం కావడం కారణమని తెలుస్తోంది. ఇంకా 56 చెరువుల్లో 79 లక్షల చేప పిల్లలను అందించాల్సి ఉంది. గత సంవత్సరం జిల్లాలోని చెరువుల నుంచి 10వేల 400 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది.
ఆలస్యంపై మత్స్యకారుల్లో ఆందోళన
జూన్, జూలైలో చేప పిల్లలను అందించాల్సి ఉంటుంది. నవంబరు వచ్చినా నేటికి పలుచోట్ల పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ వారం రోజుల్లో అందజేసిన రెండు, మూడు అంగుళాల చేప ఎప్పుడు పెరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంత ఆలస్యంగా పిల్లలు అందజేస్తే కిలో బరువు వచ్చే సరికి వేసవికాలం చెరువులు ఎండిపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఇచ్చే సీడ్‌లోనూ నాసిరకం వస్తుందని ఆరోపిస్తున్నారు.
నష్టం జరగకుండా చూస్తాం
- వరదారెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి
జిల్లాలో మత్స్యకారులకు ఇప్పటి వరకు 1 కోటి 91లక్షల సీడ్‌ను అందించాం. త్వరలోనే మిగితాది అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని సమస్యలతో ఆలస్యం జరిగింది. మత్స్యకారులకు నష్టం జరగకుండా చూస్తాం. ఈ సారి 9 చెరువులలో 2 రిజర్వాయర్‌లలో 60 లక్షల రొయ్య సీడ్‌ను వేసినట్లు తెలిపారు.