ప్రభుత్వ భూములపై జెండా పాతేద్దాం!
ABN , First Publish Date - 2023-06-26T02:40:36+05:30 IST
అవి ఖనిజ నిల్వలున్న విలువైన భూములు. పైగా ప్రభుత్వ భూములు. ఇంకేముంది... వాటిపై ఓ అధికార పార్టీ నేత కన్నేశారు.

2200 ఎకరాలపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కన్ను .. మైనింగ్ భూముల స్వాహాకు స్కెచ్ .. పేదల పేరుతో తనవారికి ఇప్పించే యత్నం
ఆ తర్వాత సొంతం చేసుకునే ప్లాన్
లెటర్ హెడ్‌తో అధికారులకు లేఖలు
కొందరు కోర్టుకు వెళ్లడంతో పంపిణీకి బ్రేక్
కేసు నడుస్తున్నా తెరవెనుక తతంగం
ఫైలు సిద్ధం చేస్తున్నట్టు ఆరోపణలు
నంద్యాల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): అవి ఖనిజ నిల్వలున్న విలువైన భూములు. పైగా ప్రభుత్వ భూములు. ఇంకేముంది... వాటిపై ఓ అధికార పార్టీ నేత కన్నేశారు. ఏకంగా దాదాపు 2200 ఎకరాలు సొంతం చేసుకునేందుకు పథకం వేసినట్టు తెలుస్తోంది. ముందుగా తన వారికి ఆ భూములు కట్టబెట్టి ఆ తర్వాత తన వశం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నిరుపేదలకు పంచాలని అధికారులను కోరారు. ఇందుకోసం తన లెటర్ హెడ్‌ను సైతం వాడుకున్నారు. ఆ భూములు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల ప్రాంతంలో ఉండగా... బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులకు లేఖలు రాశారు. ఆయన చెప్పగానే అధికారులు భూములు పంచేందుకు సిద్ధమయ్యారు. అయితే కొంతమంది కోర్టుకు వెళ్లడంతో భూ పంపిణీ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అయితే ఎమ్మెల్యే తన పంతం నెగ్గించుకునేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. తాను పేర్లు సూచించిన వారు భూమిని అనుభవిస్తున్నట్టుగా చూపించేందుకు ప్రయతిస్తున్నట్టు సమాచారం. తన వారికి చెప్పి ఆయా భూముల్లో డోజర్లతో చదును చేయించి, ట్రాక్టర్లతో దున్నించడం వంటివి చేస్తున్నారు. ఆ భూములన్నీ చాలావరకు కొండలు, గుట్టలతో కూడుకున్నవి. ఏళ్లుగా బీడువారిన భూములు. అలాంటి భూముల్లో కొత్తవారు వచ్చి దున్నతుండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కొన్ని భూముల్లో చాలాకాలంగా సాగు చేస్తున్న కొంతమంది స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు.
ఆదాయ పన్ను కట్టేవారికి కూడా...
కొలిమిగుండ్ల మండలంలో దాదాపు 32 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 17 గ్రామాల్లో ఆరు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో దాదాపు 2200 ఎకరాలను అర్హులైన పేదలకు పంచాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరిలో తన లెటర్ హెడ్ మీద పే ర్లు రాయించి మరీ రెవెన్యూ అధికారులకు పంపించారు. మొదట 609 మందికి 2 ఎకరాల చొప్పున ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత 489 మందికి ఇవ్వాలని అధికారులకు సూచించారు. వారిలో గతంలో భూములు పొందినవారు, ఒకే కుటుంబానికి చెందిన వారు, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారూ ఉన్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు మాత్రం అర్హులా కాదా అని చూడకుండా భూ పంపిణీకి సిద్ధమయ్యారు. కొంతమంది కోర్టుకు వెళ్లడంతో భూ పంపిణీ ఆగిపోయింది.
కోర్టులో కేసు నడుస్తున్నా....
కోర్టులో కేసు నడుస్తున్నా ఆ భూములు తాను చెప్పిన వారికి వచ్చేలా చూడాలంటూ ఎమ్మెల్యే అఽధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు ఆ పని మీదే ఉన్నట్లు సమాచారం. ఒక్క ఆన్‌లైన్‌లో తప్పా.. ఎక్కడ ఎవరికి ఎంత భూమి కేటాయించాలి.. ఒకే కుటుంబంలోని వారికి ఎంతెంత ఇవ్వాలి.. అన్నదానిపై పనులన్నీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కోర్టు నుంచి తీర్పు అనుకూలంగా వచ్చిన వెంటనే భూ పంపిణీ చేసి ఆన్‌లైన్‌లోకి ఎక్కించేందుకు అంతా సిద్ధం చేశారని తెలుస్తోంది.
ఆ భూములే ఎందుకంటే...
భూ పంపిణీ చేయాలంటూ ఎమ్మెల్యే సూచించిన భూములన్నీ మైనింగ్ భూములు. వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాని భూములు. అలాంటిది... వాటిని పేదలు వ్యవసాయం చేసుకునేందుకు పంచాలనుకోవడం వెనుక వేరే మతలబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడి భూముల్లో సిమెంటు తయారీకి ఉపయోగించే క్వార్ట్‌జైట్, సున్నపురాయి ఎక్కువగా దొరుకుతుంది. దీంతో అక్కడ చాలా ఫ్యాక్టరీలు నెలకొల్పుతున్నారు. భవిష్యత్తులో ఇంకా వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భూములన్నింటినీ తన వారి పేర్ల మీద మార్పించుకుని, ఆ తర్వాత వాటిని కారుచౌకగా కొట్టేసి, భవిష్యత్తులో కంపెనీలకు మంచి ధరకు అమ్ముకోవచ్చన్న ఆలోచనలో స్థానిక నేత ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇవీ సర్వే నంబర్లు..
ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేదలకు ఇవ్వాలని సూచించిన ప్రభుత్వ భూములు కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో సర్వే నంబరు 112సీ, సీ1, 112బీ, 763లో ఉన్నాయి. అలాగే సర్వే నంబరు 112 సీకి సంబంధించి కనకాద్రిపల్లెలో భూములు ఉన్నాయి. వీటితో పాటు ఇతర గ్రామాల్లో పలు సర్వే నంబర్లలో ఉన్నాయి. ఈ భూముల్లో 5 నుంచి పదేళ్లుగా అనుభవంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే వందలాది మందికి లెటర్లు ఇచ్చారు. లెటర్లు ఇచ్చినందుకు అధికార పార్టీ వారు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులకూ వాటాలు ఉన్నట్లు సమాచారం.
వివరాలు పరిశీలిస్తున్నాం
ఎమ్మెల్యే పంపిన లెటర్లను తీసుకువచ్చిన వారి వివరాలను పరిశీలిస్తున్నాం. ఎవరెవరికి ఎంత భూములు ఉన్నాయి? లేని వారు ఎవరు? అనే విషయాలను చూస్తున్నాం. ఆ తర్వాత అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి భూములు ఇస్తాం. ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి పట్టాలు గానీ, పత్రాలు గానీ ఇవ్వలేదు. - ధోని ఆల్ర్ఫెడ్, తహసీల్దార్, కొలిమిగుండ్ల
జీవో ఏం చెబుతోందంటే...
కొలిమిగుండ్ల మండలంలో అపారమైన ఖనిజ నిల్వలున్నాయి. ఇలాంటి ఖనిజ నిల్వలున్న భూములు మైనింగ్ జరిపిందుకే ఇవ్వాలని జీవో నం.74 చెబుతోంది. ఇలాంటి భూముల్ని వ్యవసాయానికి ఇవ్వరాదని, అలాగే మైనింగ్‌కు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటామన్న వారికి ఎన్‌వోసీ ఇవ్వకూడదని కూడా జీవోలో స్పష్టంగా ఉంది. ఇక జీవో నం.1142... మైనింగ్ భూములను వ్యవసాయ అవసరాల కోసం డీ పట్టాలు ఇవ్వరాదని చెబుతోంది. ఈ విషయాలను కోర్టు దృష్టికి తెచ్చేలా కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా, ఆ ప్రాంతంలో మైనింగ్ భూములను చాలా వరకు సిమెంటు కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. మరికొన్ని భూములను ఇతర అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తులు లీజుకు తీసుకున్నారు. దీన్నిబట్టి అధికార పార్టీ నేత సూచించిన విధంగా భూములను ఆయన మనుషులకు కట్టబెట్టేందుకు అవకాశం లేదని తెలుస్తోంది.
అంతా కొత్తవారే
ఇటిక్యాలలో గ్రామంలోని 112సీ 1 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమి లో 15 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇపుడు ఎమ్మెల్యే మనుషులు వచ్చి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నామని చెప్పడం అవాస్తవం. ఏళ్లుగా సాగులో ఉన్న మాకు పట్టాలు ఇప్పటికీ రాలేదు. ఇందుకోసం మేము కోర్టును కూడా ఆశ్రయి ంచాం. కొత్తగా వచ్చిన వారు అనుభవంలో ఉన్నారని ఎమ్మెల్యే నుంచి లెటర్లు తెచ్చుకోవడం విడ్డూరంగా ఉంది.
- వంకదారి పెద్ద ఆచారి, కల్వటాల,కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా
ఇది న్యాయం కాదు
ఇటిక్యాలలోని ప్రభుత్వ భూముల్లో ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటున్నాం. అయినా ఆ భూములపై మాకు హక్కు లేదని అధికారులు గతంలో కొర్రీలు పెట్టారు. అలాంటిది అనుభవంలో లేని వారు ఎమ్మెల్యే వద్ద నుంచి లెటర్లు తెచ్చుకుని భూములు మా వేనని చెబుతున్నారు. అసలు అర్హు లు ఎవరో గుర్తించి వారికి భూము లు పంచితే బాగుంటుంది. ఇప్పటికిప్పుడు వచ్చిన వారికి భూములు పంచాలనడం న్యాయం కాదు.
- బాషా, కనకాద్రిపల్లె, కొలిమిగుండ్ల