గుట్కా..గుట్టు!
ABN , First Publish Date - 2023-03-14T01:11:12+05:30 IST
రాజమహేంద్రవరం నిషేధిత గుట్కాల వ్యాపారానికి అడ్డాగా మారింది. గతంలో నిషేధిత గుట్కాల వ్యాపార నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకునేవారు కాని ఇప్పుడు స్వేచ్ఛగా వదిలివేయడంతో గుట్కాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.

కొరవడిన అధికారుల నిఘా
ఇష్టారాజ్యంగా సాగుతున్న అమ్మకాలు
పెద్ద ఎత్తున గుట్కా దిగుమతులు
60 శాతం పాన్‌షాపుల్లో అమ్మకాలు
ఇతర ప్రాంతాలకు సరఫరా
కన్నెత్తి చూడని అధికారులు
దాడులు చేసినా జరిమానాలతో సరి
భయపడని వ్యాపారులు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 13 : రాజమహేంద్రవరం నిషేధిత గుట్కాల వ్యాపారానికి అడ్డాగా మారింది. గతంలో నిషేధిత గుట్కాల వ్యాపార నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకునేవారు కాని ఇప్పుడు స్వేచ్ఛగా వదిలివేయడంతో గుట్కాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రాజమహేంద్రవరం నుంచి నిషేధిత గుట్కాలు సరఫరా కావడం విస్మయానికి గురిచేస్తుంది. రాష్ట్రంలో నిషేధించిన గుట్కాలు రాజమహేంద్రవరంలో యథేచ్ఛగా దొరకడం విడ్డూరంగా ఉంది.ప్రతీ పాన్ షాపులోను సిగరెట్లు కంటే అధికంగా నిషేధిత గుట్కా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతారు.రాజమహేంద్రవరంలో సుమారు 60 శాతం పాన్ షాపులలో నిషేధిత గుట్కాలు కనపించకుండా ఉన్నాయి. రాజమహేంద్రవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కాల వినియోగం పెద్ద ఎత్తున సాగుతుంది. ఎక్కువ శాతం యువకులు, పగలంతా పనిచేసే కార్మికుల్లో చాలా మంది గుట్కాలకు అలవాటుపడి ఉన్నారు. ఇది ప్రమాదం అని తెలిసినా నోటిలో పడకపోతే రోజు ముందుకు సాగని పరిస్థితి. ఎంత దారుణమంటే ఉదయం లేవగానే వాటిని వినియోగిస్తేగాని కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు.అందువల్ల వాటి వినియోగం ఎక్కు వైంది. రాజాఖైనీ, ఎంసీ, డీలక్స్ వంటి నిషేధిత గుట్కాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. డిమాండ్ ఎక్కువ కావడంతో కొంత మంది వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసి లక్షల్లో అక్రమ వ్యాపారం చేస్తున్నారు.
దిగుమతులపై కొరవడిన నిఘా
వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరానికి అనేక వస్తువులు, తినుబండరాలు, ఇతర సామగ్రిని వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు.నిత్యం లారీలు, రైల్వే వేగన్ల ద్వారా సరుకు రవాణా జరుగుతోంది.. ఇదే వ్యాపారులకు వరంగా మారింది. గుం పులో గోవిందం అన్నట్టు గుట్కాల దిగుమతి మాత్రం చాలా చాకచక్యంగా జరుగుతుందనే చెప్పాలి. పోలీసులు, ఇతర అధికారుల లారీ లోడుతో పట్టుకున్న సంఘటనలు లేవు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు వ్యాపార గొడౌ న్లలో ఉన్న స్టాక్‌ను పట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరానికి సరుకు దిగుమతి అవుతున్నప్పుడు పట్టుకోలేదు. అంటే ఖశ్చితంగా రాజమహేంద్రవరానికి వస్తున్న వస్తుసామాగ్రిపై నిఘాలేదనేది అర్ధమవుతుంది. ఒడిస్సా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి నిషేధిత గుట్కా ఎంసీ, డీలక్స్, రాజా ఖైనీలు, ఇతర నిషేదితక గుట్కాలు రాజమహేంద్రవరానికి యథేచ్ఛగా దిగుమతి అవుతున్నాయి. కాని అవి అధికారులకు కనిపించడంలేదు.రవాణాపై నిఘా పెడితే చాలా వరకు వాటి వినియోగాన్ని నియంత్రించవచ్చు.. కాని ఆ ఽఽదిశగా ప్రయత్నాలు కనిపించడం లేదు. దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది.
తీగ లాగరు ఎందుకో?
అధికారులు తీగ లాగితే డొంక కదులు తుంది.. అయితే అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ఎప్పుడో నెలకో రెండు నెలలకో పాన్ షాపులపై దాడులంటారు.. ఒక రెండు మూడు పాన్ షాపులపై కేసులు పెడతారు. వాళ్లకు జరిమానా విధించి వదిలేస్తారు. అయితే ఎక్కడ నుంచి ఎలా వస్తుంది.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. అనే సమాచారంపై ఆరా తీయక పోవడంతో గుట్కా వ్యాపారం నగరంలో గుట్టుగా సాగిపోతోంది. యువత కూడా ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. లాభం ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు వ్యాపారంపై మొగ్గుచూపుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో గుట్కా వ్యాపారంపై ఎక్కడా నిఘా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.